Vote Chori Row: ఓట్ల చోరీకి పాల్పడినవారిని (Vote Chori Row) కేంద్ర ఎన్నికల సంఘం కాపాడుతోందంటూ లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గురువారం చూపించిన ఆధారాలపై ఈసీ స్పందించింది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ సానుకూల ఓట్లను టార్గెట్‌గా చేసుకొని, వ్యవస్థీకృతంగా తొలగించారన్న రాహుల్ గాంధీ వాదనలో ఏమాత్రం నిజం లేదని, ఆధార రహితమైన ఆరోపణలు చేశారని ఖండించింది. రాహుల్ గాంధీ చూపించిన ఆధారాలు తప్పు అని పేర్కొంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ‘ఓటు దొంగలను’ రక్షిస్తున్నారనడంపై కమిషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆన్‌లైన్‌లో ఓట్లను ఎవరూ తొలగించలేరని పేర్కొంది. తొలగింపునకు ముందు వివరణ తీసుకోకుండా ఒక వ్యక్తి పేరును ఓటర్ జాబితా నుంచి తీసివేయడం సాధ్యంకాదని ఎన్నికల సంఘం ఈ సందర్భంగా తెలిపింది.
కర్ణాటకలోని ఆలంద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్లను తొలగించేందుకు కొన్ని విఫలప్రయత్నాలు జరిగిన మాట నిజమేనని ఎన్నికల సంఘం ఒప్పుకుంది. ఈ అంశంపై దర్యాప్తు జరిపించేందుకు స్వయంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్టు కమిషన్ వెల్లడించింది. కాగా, ప్రత్యేక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, కర్ణాటకలోని ఆలంద్ నియోజకవర్గంలో 6,018 ఓట్లు తొలగించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి సాఫ్ట్‌వేర్, ఫోన్ నంబర్ల ద్వారా ప్రయత్నించారని ఆరోపించారు. ఓటర్లను తొలగించేందుకు ఉపయోగించిన సెల్‌ఫోన్ నంబర్లను కూడా ఆయన ప్రదర్శించారు. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లోనే ఓట్ల తొలగింపు ప్రయత్నాలు జరిగాయని, కాంగ్రెస్ ఆధిపత్యం ఉన్న బూత్‌లలోనే ఈ చర్యలు జరిగాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. గోదాబాయి అనే మహిళ పేరిట నకిలీ లాగిన్లు సృష్టించి, 12 మంది ఓటర్లను తొలగించేందుకు ప్రయత్నించారని చెప్పారు. అయితే, గోదాబాయికి అసలు ఏమీ తెలియదని ఆయన వివరించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆలంద్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి బీఆర్ పటేల్ 10,000కి పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు.
Read Also- Horror Hostle: అమ్మబాబోయ్ హాస్టల్లో దెయ్యం.. రాత్రిళ్లు వింత శబ్దాలు.. వణికిపోతున్న విద్యార్థులు!
రాహుల్ గాంధీపై బీజేపీ తీవ్ర విమర్శలు
ఓటు చోరీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన సంచలన ఆరోపణలపై బీజేపీ సీనియర్ నేత అనురాగ్ ఠాకూర్ ఘాటుగా స్పందించారు. రాహుల్ గాంధీ భారతదేశంలో బంగ్లాదేశ్, నేపాల్ లాంటి పరిస్థితులను సృష్టించాలనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. భారత ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా పనిచేస్తుంటే, రాహుల్ గాంధీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ. ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారంటూ అనురాగ్ ఠాకూర్ విమర్శించారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 90 ఎన్నికల్లో ఓడిపోయిందని, తీవ్ర నిరాశలో మునిగిపోయి, అవాస్తవమైన ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. హైడ్రోజన్ బాంబ్ వేస్తానన్న రాహుల్ గాంధీ కేవలం బాణసంచాతో సరిపెట్టుకున్నారని అనురాగ్ ఠాకూర్ ఎద్దేవా చేశారు.
రాహుల్ గాంధీ మరిన్ని ఆరోపణలు ఇవే
చీఫ్ ఎలెక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ‘ఓటు దొంగలతో’ చేతులు కలిపారంటూ రాహుల్ గాంధీ తీవ్రంగా ఆరోపించారు. గత 18 నెలల్లో కర్ణాటక సీఐడీ ఎన్నికల సంఘానికి 18 లేఖలు రాసిందని, ఓటర్ల తొలగింపు ఫారమ్‌లు దాఖలు చేసిన డివైస్‌కు చెందిన డెస్టినేషన్ ఐపీ అడ్రస్, ఓటీపీ ట్రయల్ సమాచారాన్ని కోరిందని వెల్లడించారు. కానీ, ఎన్నికల సంఘం ఈ సమాచారాన్ని ఇవ్వడం లేదని అన్నారు. వివరాలు అందిస్తే ఆ ఆపరేషన్ ఎక్కడి నుంచి జరుగుతోందనే విషయం బయటపడుతుందని, అందుకే ఈసీ సమాచారం ఇవ్వడంలేదని పేర్కొన్నారు.