Pak Terrorist: పహల్గాం ఉగ్రదాడిలో అమాయకుల ప్రాణాలను బలిగొన్న ముష్కరులపై భారత సైన్యం విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ పేరుతో దయాది దేశంలోని ఉగ్ర స్థావరాలను మన వైమానిక దళం నాశనం చేసింది. సీమాంతర ఉగ్రవాదాన్ని భారత్ పైకి ఎగదోస్తున్న పాకిస్థాన్ కు చావదెబ్బ తినేలా చేసింది. అయితే ఇది జరిగి కొన్ని నెలలు గడుస్తున్న క్రమంలో తాజాగా జైష్- ఈ -మొహమ్మద్ (Jaish-e-Mohamad) కమాండర్ మసూద్ ఇల్యాస్ కాశ్మీరీ (Masood Ilyas Kashmiri) సంచలన వ్యాఖ్యలు చేశాడు. JeM అధినేత మసూద్ అజర్ (Maulana Masood Azhar) కుటుంబం భారత దాడుల్లో నాశనమైందని పేర్కొన్నారు.
ఉగ్రవాది ఏమన్నాడంటే?
ఉగ్రవాద కమాండర్ మసూద్ ఇల్యాస్ మాట్లాడిన తాజా వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. భారత సైన్యం తమ నివాస ప్రాంతాల్లో దాడి చేసిన తీరును అందులో వివరించాడు. ‘మేము ఉగ్రవాదాన్ని అంగీకరించి ఢిల్లీ, కాబూల్, కాంధహార్‌లలో ఈ దేశపు (పాక్) సరిహద్దులను రక్షించడానికి పోరాడాము. అన్నీ త్యాగం చేసిన తర్వాత మే 7న మౌలానా మసూద్ అజర్ కుటుంబాన్ని భారత దళాలు బహావల్పూర్‌లో నాశనం చేశాయి. ఈ దాడిలో మసూద్ ఫ్యామిలీ ముక్కలు ముక్కలు అయ్యింది’ అని ఆయన ఉర్దూలో అన్నాడు. వీడియోలో వెనుక తుపాకులతో ఉన్న సాయుధ గస్తీ సిబ్బంది కనిపించారు.
🚨 #Exclusive 🇵🇰👺
Jaish-e-Mohamad top commander Masood ilyas kashmiri admits that On 7th May his leader Masood Azhar’s family was torn into pieces in Bahawalpur attack by Indian forces.
Look at the number of gun-wielding security personnel in the background. According to ISPR… pic.twitter.com/OLls70lpFy
— OsintTV 📺 (@OsintTV) September 16, 2025
ఆపరేషన్ సిందూర్
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయక భారత పౌరులు మరణించారు. ఇది జరిగిన కొద్ది రోజులకే భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట పాకిస్తాన్, PoKలోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై ఒకేసారి వైమానిక దాడులు జరిపింది. జైష్-ఇ-మొహమ్మద్ (JeM), లష్కర్-ఇ-తోయిబా (LeT) ఉగ్ర స్థావరాలను నాశనం చేశాయి. మెుత్తం 9 స్థావరాలు దెబ్బతిన్నాయని పాకిస్తాన్ సైతం తరువాత అంగీకరించింది. ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రాలుగా ఉన్న బహావల్పూర్, కోట్లి, మురీద్కే ప్రాంతాల్లో ఈ దాడులు జరిగినట్లు పేర్కొంది.
మసూద్ ఫ్యామిలీలో 10 మంది మృతి
బహావల్పూర్ (పాకిస్తాన్‌లో 12వ అతిపెద్ద నగరం) జైష్-ఇ-మొహమ్మద్ ఉగ్రసంస్థకు ప్రధాన కేంద్రంగా ఉంది. లాహోర్‌కు 400 కి.మీ దూరంలో ఉన్న ఈ నగరంలో JeM ప్రధాన కార్యాలయం జామియా మస్జిద్ సుభాన్ అల్లా (ఉస్మాన్-ఓ-అలి క్యాంపస్) ఉంది. 2000వ దశకం ప్రారంభంలో ఉగ్రవాది మసూద్ అజర్.. కాశ్మీర్‌లో జిహాద్‌కు పిలుపునిచ్చిన తర్వాత JeM ఏర్పడింది. గత రెండు దశాబ్దాల్లో భారత భూభాగంపై అనేక దాడులకు ఇది బాధ్యత వహించింది. ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ మీడియా సమాచారం ప్రకారం.. తన కుటుంబ సభ్యుల్లో 10 మంది భారత దాడుల్లో మరణించారని మసూద్ అజర్ అంగీకరించాడు.
Also Read: Diwali Special Trains: దీపావళి స్పెషల్.. ఏకంగా 1,126 ప్రత్యేక రైళ్లు.. ప్రయాణికులకు పండగే!
పాక్ బుకాయింపు
మసూద్ అజర్ గత కొన్నేళ్లుగా పాకిస్థాన్ లో దాక్కుని ఉన్నాడు. పాకిస్తాన్ రాజకీయ నాయకుడు బిలావల్ భుట్టో జర్దారీ గతంలో ఆయన ఎక్కడ ఉన్నారో ఇస్లామాబాద్‌కు తెలియదని చెప్పాడు. ఈ ఏడాది జూన్‌లో ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘భారత్ ఆయన పాకిస్తాన్‌లోనే ఉన్నాడని సమాచారం ఇస్తే అతన్ని అరెస్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం’ అని జర్దారీ పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే తాము ఉగ్రవాదులను ఏమాత్రం ప్రోత్సహించడం లేదని చెప్పుకుంటూ వస్తోన్న పాక్ నిజస్వరూపాన్ని తాజాగా జైష్-ఇ-మొహమ్మద్ (JeM) కమాండర్ మసూద్ ఇల్యాస్ చేసిన వ్యాఖ్యలు బయటపెట్టాయని చెప్పవచ్చు.