Akshaya Patra: అక్షయ పాత్రను హిందూ పురాణాలు, ఇతిహాసాలు అత్యంత పవిత్రమైన అమూల్యమైన వస్తువుగా పేర్కొన్నాయి. ఇది ఎప్పటికీ తరగని ఆహారాన్ని అందించే దివ్యమైన పాత్రగా వర్ణించబడింది. ఈ పాత్ర గురించి మహాభారతంలో ప్రధానంగా ప్రస్తావించబడటం విశేషం. ఎంతమంది వ్యక్తులకు ఆహారం అవసరమైనా అందరికీ సరిపడా ఆహారాన్ని ఈ అక్షయ పాత్ర అందిస్తుందని నమ్ముతుంటారు. ఈ నేపథ్యంలో అక్షయ పాత్రకు సంబంధించి మహాభారతంలో ప్రస్తావించబడిన 3 ఆసక్తికరమైన ఘటనలను ఈ కథనంలో తెలుసుకుందాం.
1. సూర్యదేవుని ఆరాధన – అక్షయ పాత్ర వరం
మహాభారతంలోని ధర్మరాజు (యుధిష్టిరుడు) సూర్య భగవానుడ్ని ఆరాధిస్తాడు. అతడి భక్తికి మెచ్చి అద్భుతమైన అక్షయపాత్ర అతడికి ప్రసాదించబడుతుంది. దాని సాయంతో ధర్మరాజు ఇంటికి ఎంతమంది అతిథులు వచ్చినా ఆ పాత్ర సాయంతో ఆహారం అందించేవాడు. సూర్యదేవుడు ధాన్యానికి అవసరమైన కాంతి, శక్తి ప్రసాదించే వాడు కాబట్టి ఈ వరం ధర్మరాజుకు లభించింది.
2. ద్రౌపది భోజనం చేసిన తర్వాత పాత్ర ఆగిపోవడం
పాండవుల భార్య ద్రౌపదిని శ్రీకృష్ణ భగవానుడు సోదరిలా భావించేవాడు. ఆమెకు ఏ కష్టం వచ్చినా వెంటనే అక్కడ ప్రత్యక్షమయ్యేవాడని మహాభారతం చెబుతోంది. ఒకసారి దుర్యోధనుడు సభలో ఆమెను అవమానించాలనుకున్నప్పుడు కూడా శ్రీకృష్ణుడు ఆమెకు చీర అందించి ఆమె గౌరవాన్ని కాపాడాడు. ఇదిలా ఉంటే ద్రౌపది ఇంటికి వచ్చే అతిథులకు తరుచూ ఆహారం పెడుతుండేది. వారి భోజనం పూర్తయ్యాక చివరిలో తను ఆహారం తీసుకునేది. అయితే ఇందుకు ఓ కారణముండేదని మహాభారతం చెబుతోంది. ద్రౌపది భోజనం పూర్తైన వెంటనే అక్షయపాత్ర నుంచి ఆహారం రావడం ఆగిపోయేదట. అందుకే ఆమె అతిథులు అందరూ భోజనం చేసిన తర్వాత మాత్రమే తినేవారని.. దీనివల్ల అతిథులకు ఎలాంటి సమస్య వచ్చేది కాదని తెలుస్తోంది.
Also Read: CM Revanth Reddy: వీధుల్లో ఎల్ఈడీ లైట్లపై సీఎం రేవంత్ ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు
3. దుర్వాస మహర్షితో సంఘటన
ఓ రోజు దుర్వాస మహర్షి తన అనుచరులతో కలసి పాండవుల దగ్గరకు వస్తాడు. కానీ అప్పటికే ద్రౌపది భోజనం చేసి ముగించేసింది. దీంతో ధర్మరాజు కొంత సమయం తీసుకునేందుకు దుర్వాసుడిని ముందుగా నదిలో స్నానం చేసి రావాలని కోరాడు. అప్పుడే శ్రీకృష్ణుడు సైతం అతిథిగా అక్కడకు వచ్చాడట. ద్రౌపది ఆహారం లేదని విచారిస్తుండగా, కృష్ణుడు పాత్రను పరిశీలించి ఒక చిన్న ముద్ద మిగిలి ఉంటే దానిని తీసుకుని తిన్నాడట. ద్రౌపది చేత ప్రేమగా సమర్పించిన ఆహారం కాబట్టి శ్రీకృష్ణుడు చాలా సంతోష పడిపోయాడట. దీంతో నది స్నానానికి వెళ్లిన దుర్వాసుడు, అతని శిష్యులు సైతం ఆహారం తీసుకోకపోయినా కడుపు నిండినంత తృప్తిని పొందారట. దీంతో ఇంటికి వచ్చి భోజనం వద్దని చెబితే బాగోదని అతిథి మర్యాదల కోసం రాకుండానే అటు నుంచి అటే వెళ్లిపోయారని పురాణ గాథ చెబుతోంది.