CM Revanth Reddy: ప్రజలకు సమస్యలు వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మానవత్వంతో వ్యవహరించాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కోరారు. వరదలతో నష్టపోయిన కామారెడ్డి జిల్లాలో తీసుకునే చర్యలు సంక్షోభ నివారణలో ఒక మోడల్ జిల్లాగా నిలవాలని అన్నారు. అధికారులు పరిష్కారాలతో అంచనాలు సిద్ధం చేయాలన్నారు. వారి అంచనాల ఆధారంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని, 15 రోజుల తర్వాత మరోసారి పరిస్థితులను సమీక్షిస్తామని వెల్లడించారు.
సమీకృత కలెక్టరేట్ భవనంలో ఉన్నతస్థాయి సమావేశంలో జిల్లాలో జరిగిన నష్టంపై సమీక్షించారు. ప్రజలను ఆదుకోవడానికి తీసుకోవల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. విపత్కర పరిస్థితులు తలెత్తినప్పుడు ప్రభుత్వంలోని అన్ని శాఖల మధ్య సమన్వయం చాలా అవసరమన్నారు. వరదలొచ్చినప్పుడు దాని ప్రభావం, పర్యవసానాలు నీటి పారుదల, వ్యవసాయం, విద్యుత్, రోడ్లు భవనాలు, మున్సిపాలిటీ, ఇలా ఒకదానిపై ఇంకొకటి ఆధారపడి ఉంటుందన్నారు. శాఖల మధ్య సమన్వయం లోపిస్తే ఇబ్బందులు తలెత్తుతాయన్నారు.
Also Read: SPDCL Control Rooms: గణేష్ నిమజ్జనం నేపథ్యంలో విద్యుత్ శాఖ కీలక నిర్ణయం
ప్రతిపాదనలపై తక్షణం నిధులు
వరదలతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జరిగిన నష్టంపై ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో రోజంతా ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి చర్చించాలని ఇంచార్జీ మంత్రి ధనసరి సీతక్కకు సూచించారు. నష్టంపై అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అంచనాలు రూపొందించి, ప్రతిపాదనలు తయారు చేయాలని ఆదేశించారు. అధికారుల ప్రతిపాదనలపై తక్షణం నిధులను విడుదల చేసి ప్రజలను ఆదుకుంటామన్నారు. ఆపత్కాలంలో సిబ్బంది రోజుకు 24 గంటలు పని చేశారని సీఎం అభినందించారు. అయినప్పటికీ శాఖల మధ్య కొంత సమన్వయ లోపం కనిపించిందన్నారు. ఎరువుల విషయంలోనూ క్షేత్రస్థాయిలో గందరగోళ పరిస్థితులు తలెత్తకుండా చూడాలని, రైతు వేదికల వద్ద సమావేశాలు ఏర్పాటు చేసి ముందుగానే టోకెన్లు జారీ వంటి చర్యలు తీసుకోవాలన్నారు.
యూరియా అందుబాటులో ఉన్నా ఒక్కసారిగా ఎక్కువ మంది లైన్లో నిలబెట్టడం ద్వారా చివరగా ఉన్న వారు సహనం కోల్పోయే పరిస్థితి ఉత్పన్నమవుతుందని, యూరియాకు సంబంధించి స్థానికంగా సమన్వయం చేసుకోవాలన్నారు. విపత్తు సహాయం విషయంలో నిబంధనల మేరకు కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవాలని అధికారులకు సూచించారు. వరదల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయి వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున అందజేశారు. ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస రెడ్డి, మదన్ మోహన్ రావు, సుదర్శన్ రెడ్డి, కాటిపల్లి వెంకట రమణారెడ్డి, తోట లక్ష్మీకాంతరావు, జిల్లా కలెక్టర్ , ఎస్పీతో పాటు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
వర్షాల వరద నష్టాని శాశ్వత పరిష్కారం చూపుతాం.. సీఎం
భారీ వర్షాలు, వరదల వల్ల నష్టం జరిగిన చోట శాశ్వత పరిష్కారం చూపేందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పంట పొలాల్లో ఇసుక మేటలను తొలగించేందుకు ప్రత్యేకంగా నిధులను మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో కామారెడ్డి జిల్లాలో దెబ్బతిన్న ప్రాంతాల్లో సీఎం పర్యటించారు. కామారెడ్డి చేరుకునే సమయంలో హెలికాప్టర్ ద్వారా జిల్లాలో నష్టపోయిన ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా వీక్షించారు.
సీఎం స్థానికులతో మాట్లాడుతూ గ్రామాల వారీగా అంచనాలు రూపొందించాలి
మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ధనసరి అనసూయ సీతక్క, ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్, సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు మదన్ మోహన్ రావు, తోట లక్ష్మీ కాంతారావు, కాటిపల్లి వెంకట రమణారెడ్డితో ఆయా ప్రాంతాలను పరిశీలించారు. రోడ్లు, పంటలు దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన సీఎం స్థానికులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. కొడంగల్‌కు ఎంత మేరకు సాయం చేస్తానో కామారెడ్డి కి కూడా అంత సాయం చేస్తానని హామీ ఇచ్చారు. వరద నష్టంపై గ్రామాల వారీగా అంచనాలు రూపొందించి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. దెబ్బతిన్న రహదారులు, బ్రిడ్జీలు, మైనర్, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులతో పాటు పంట నష్టానికి సహాయం అందిస్తామన్నారు.
Also Read: Andhra King Taluka: పప్పీ షేమ్.. సెప్టెంబర్ 8న ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఇచ్చే ట్రీట్ ఇదే!
బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది
వర్షానికి నష్టపోయిన వారిని ప్రభుత్వం కచ్చితంగా ఆదుకుంటుందని, అన్ని సమస్యలు పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పూర్తిస్థాయిలో వరదల నష్టాన్ని అంచనా వేయాలని ఆదేశించారు. పంట నష్ట పోయిన రైతులకు పరిహారం అందిస్తామన్నారు. రోడ్లు, ప్రాజెక్టులను మరమ్మతులు చేసేందుకు కూడా అంచనాలు రూపొందించాలన్నారు. వరదలతో ఆస్తినష్టం, ప్రాణ నష్టం జరగకుండా ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ప్రజలకు అండగా నిలిచారన్నారు. కష్టం వచ్చినప్పుడు అండగా ఉండే వారే నిజమైన నాయకుడు అని కితాబు ఇచ్చారు. కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలకు తోడుగా ఉండాలని నాయకులకు సూచించారు. వరదలకు మైనర్, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు దెబ్బతిన్నాయన్నారు. పోచారం ప్రాజెక్టు భారీ వరదను కూడా తట్టుకుని నిలబడి అందర్నీ కాపాడిందన్నారు. తాత్కాలిక మరమ్మతులు చేశామని, అయితే ప్రజలు ఎదుర్కొన్న కష్టాలు, జరిగిన నష్టాన్ని ప్రత్యక్షంగా పరిశీలించడానికే ఇక్కడికి వచ్చామన్నారు. నష్టపోయిన వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని బాధితులకు భరోసా ఇచ్చారు.
శాశ్వత పరిష్కారం కోసం బ్రిడ్జి కమ్ బ్యారేజీ
తొలుత తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ లో సీఎం ప్రజాప్రతినిధులతో కలిసి వరదల వల్ల దెబ్బ తిన్న ప్రాంతాలు, లింగంపేటలో దెబ్బతిన్న ఆర్ అండ్ బీ బ్రిడ్జీని పరిశీలించారు. వరదలు జరిగిన నష్టంపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. స్థానికులను ఉద్దేశించి మాట్లాడారు. తాత్కాలిక మరమ్మతులతో కాకుండా బ్రిడ్జి నిర్మాణానికి పూర్తిస్థాయి ప్రణాళికలు తయారు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం కోసం బ్రిడ్జి కమ్ బ్యారేజీ లేదా బ్రిడ్జి కమ్ చెక్ డ్యామ్ తరహాలో నిర్మించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని, అంచనాలతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
కామారెడ్డి జీఆర్ కాలనీ సందర్శించి బాధితులతో సీఎం మాట్లాడారు. మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున, పశుసంపద కోల్పోయిన వారికి సాయం అందించాలని ఆదేశించారు. వర్షాలకు ఆస్తినష్టం జరిగినప్పటికీ అప్రమత్తంగా ఉండటంతో ప్రాణ నష్టం తగ్గించగలిగామన్నారు. సమస్యల పరిష్కారానికి వంద శాతం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు, ఇతర సామగ్రిని అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
Also Read: CM Revanth Reddy: వందేళ్లలో రానంత వరద.. కామారెడ్డికి ప్రత్యేక ప్యాకేజీ.. సీఎం రేవంత్ హామీ