CM Revanth Reddy: తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లా తీవ్రంగా ప్రభావితమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి.. జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. రైతులు, ముంపు ప్రాంతాల ప్రజలను అడిగి వరద నష్టం గురించి తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. వందేళ్లలో ఎప్పుడూ రానంత వరద వచ్చిందని అన్నారు. ప్రభుత్వం కచ్చితంగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.
స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్.. వరద సమయంలో అప్రమత్తంగా వ్యవహరించి ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లకుండా చూసుకున్నారని సీఎం రేవంత్ కొనియాడారు. ‘కష్టం వచ్చినపుడు అండగా ఉండే వాడే నాయకుడు. మీకు అండగా ఉండి విపత్తును ఎమ్మెల్యే అడ్డుకున్నారు. కష్టాల్లో ఉన్నపుడు ప్రజలకు తోడుగా ఉండాలని నాయకులకు సూచిస్తున్నా. వరదలకు మైనర్, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు దెబ్బతిన్నాయి. పోచారం ప్రాజెక్టు వరదలకు తట్టుకుని నిలబడి మిమ్మల్ని కాపాడింది. తక్షణమే తాత్కాలిక మరమ్మతులు చేశాం’ అని సీఎం రేవంత్ అన్నారు.
Also Read: Viral video: అయ్యబాబోయ్.. దిల్లీ నడిబొడ్డున జలపాతం.. అది కూడా మెట్రో స్టేషన్‌లో..
వరదల వల్ల ఇబ్బంది, ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా చూసేందుకు తాను కామారెడ్డి జిల్లా పర్యటనకు వచ్చానని సీఎం రేవంత్ అన్నారు. శాశ్వత పరిష్కారం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. పంటపొలాల్లో ఇసుక మేటలు తొలగించుకునేందుకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ‘పంట నష్టపరిహారం అందిస్తాం. రోడ్లు, ప్రాజెక్టులను మరమ్మతులు చేసేందుకు అధికారులు అంచనాలు రూపొందించాలి. అన్ని సమస్యలు పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. క్షేత్రస్థాయిలో పర్యటించి అధికారులు పూర్తిస్థాయిలో వరద నష్టాన్ని అంచనా వేయాలి’ అని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మరోవైపు వరద కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపుతామని కామారెడ్డి పర్యటనలో సీఎం రేవంత్ అన్నారు. కొడంగల్ తరహాలో కామారెడ్డిని ఆదుకుంటానని హామీ ఇచ్చారు. కామారెడ్డి కోసం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటిస్తానని సీఎం అన్నారు. అదే సమయంలో వరదల్లో ఇండ్లు కోల్పోయినవారికి ఇండ్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటానని సీఎం అన్నారు.