Fake Land Scam: ఖాళీ ప్లాట్ అతని కంట్లో పడిందా?…ఖతమే. సహచరులతో కలిసి దానికి సంబంధించి నకిలీ డాక్యుమెంట్లు(Fake documents)సృష్టిస్తాడు. అవసరమనుకుంటే డెత్ సర్టిఫికెట్లు(Death certificates)కూడా పుట్టిస్తాడు. వాటి సహాయంతో ప్లాట్లను తెగనమ్ముతాడు. ఇలా తన గ్యాంగ్ తో కలిసి కోట్లు కొల్లగొట్టిన ప్రధాన సూత్రధారితోపాటు 8మందిని బోనగిరి ఎస్వోటీ అధికారులు కీసర పోలీసులతో కలిసి అరెస్ట్ చేశారు. అయిదు ప్లాట్లకు సంబంధించిన నకిలీ డాక్యుమెంట్లతోపాటు వాటి తయారీకి ఉపయోగిస్తున్న సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
ALSO Read: Mee Seva New Service: మీ సేవ పరిధిలోకి కొత్త సేవలు.. నిమిషాలలో ఈ సర్టిఫికెట్ జారీ
రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు(Rachakonda Commissioner Sudheer Babu) తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కీసర మండలం ఓల్డ్ రాంపల్లి నివాసి బీగూడెం అరవింద్ ఎలియాస్ టిల్లూ (30) వృత్తిరీత్యా బైక్ మెకానిక్. రాంప్లి గ్రామంలోనే ఉన్న వెంకటేశ్వర సర్వీస్ సెంటర్ లో పని చేస్తున్నాడు. రియల్ ఎస్టేట్ దందాలో ఉన్న సంపంగి సురేష్ (32), ఈగ హరిప్రసాద్ (38), చెక్కల సోమనాథ్ (51), బ్యాంకు రుణాలు ఇప్పించే పని చేస్తున్న కోట్ల నాగేంద్ర ప్రసాద్ (45), గ్రాఫిక్ డిజైనర్ మహ్మద్ హుస్సేన్ (32), ప్రైవేట్ ఉద్యోగులు యంజాల శేఖర్ (36), వీరమాచినేని వనజ (40)తోపాటు అమరేందర్, మాణిక్, అహమద్, ముస్కు సునీల్ కుమార్ తోపాటు మరో ఆరుగురితో కలిసి అరవింద్ ముఠాగా ఏర్పడ్డాడు.
ఎక్కడెక్కడ…?
రియల్ ఎస్టేట్ దందాలో ఉన్న స్నేహితులతో కలిసి అరవింద్ రాంపల్లి గ్రామంలో ఖాళీ ప్లాట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి? అన్నదానిపై ఆరా తీసేవాడు. ముఖ్యంగా ప్రహారీలు కట్టని…ఫెన్సింగ్ వేయని ప్లాట్లను ఎంపిక చేసుకునే వాడు. ఆ తరువాత వాటికి సంబంధించి ఈసీ సర్టిఫికెట్లు తీయించే వాడు. వీటి ద్వారా ప్లాట్ కొన్న తరువాత దాని యజమాని ఎలాంటి లావాదేవీలు జరపలేదని నిర్ధారించుకునేవాడు. ఇక, ఆయా ప్లాట్ల యజమానులు ఎక్కడ నివాసం ఉంటున్నారు? వాళ్లు వృద్ధులా? అపుడపుడు ప్లాట్ వద్దకు వచ్చి తనిఖీ చేసుకుని వెళుతున్నారా? లేదా? అన్న వివరాలు సేకరించేవాడు.
నకిలీ డాక్యుమెంట్ల తయారీ…
ఆ తరువాత సహచరులైన కోట్ల నాగేంద్ర, మహ్మద్ హుస్సేన్, సోమ్ నాథ్, అహమద్ ల సహకారంతో ఆయా ప్లాట్లకు సంబంధించి నకిలీ డాక్యుమెంట్లు తయారు చేయించే వాడు. అనంతరం వాటిని అడ్డం పెట్టుకుని ఆయా ప్లాట్లను మార్కెట్లో అమ్మకానికి పెట్టేవాడు.
Also Read: Fake Cotton Seized: నకిలీ విత్తనాల గ్యాంగ్ పట్టివేత.. మరీ ఇంత మోసమా?
డెత్ సర్టిఫికెట్…
ఈ క్రమంలో రాంపల్లి గ్రామం సర్వే నెంబర్ 281, 282, 283 లో ఉన్న 149వ నెంబర్ ప్లాట్ (267 చదరపు గజాలు) యజమానులు చనిపోయినట్టుగా డెత్ సర్టిఫికెట్ పుట్టించాడు. వారికి తన ముఠా సభ్యురాలైన వనజ వారసురాలంటూ మరో సర్టిఫికెట్ ను కూడా తయారు చేయించాడు. ఆ తరువాత వనజ ఆ ప్లాట్ ను తన గ్యాంగ్ లోనే ఉన్న అరవింద్ కు అమ్మినట్టుగా సేల్ డీడ్ సృష్టించాడు. దాంతోపాటు రాంపల్లి గ్రామంలోనే సర్వే నెంబర్ 422లో…సివిల్ వివాదంలో ఉన్న 200 గజాల ప్లాట్ కు సంబంధించి నకిలీ కాంప్రమైజ్ సర్టిఫికెట్ తయారు చేయించి నేరుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇచ్చాడు. ఆ తరువాత ప్లాట్ ను తన పేరన సేల్ డీడ్ చేయించుకున్నాడు.
ఇక, సర్వే నెంబర్ 403, 421లోని 300 చదరపు గజాల ప్లాట్ యజమాని పేర నకిలీ పాస్ పోర్ట్ తయారు చేయించాడు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే ఈ ప్లాట్ యజమాని అమెరికాలో ఉంటుండటం. అతని పేర నకిలీ పాస్ పోర్ట్ తయారు చేయించిన తరువాత తన సహచరుడైన వేల్పల్లి చంద్రశేఖర్ పేర స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ సర్టిఫికెట్ పుట్టించి మరో సహచరుడు అమరేందర్ కు అమ్మినట్టుగా సేల్ డీడ్ క్రియేట్ చేశాడు. కోట్ల రూపాయల విలువ చేసే ఈ ప్లాట్లలో కొన్నింటిని అమ్ముకున్న అరవింద్ మిగితా వాటిని కూడా అమ్మకానికి పెట్టాడు.
ఫిర్యాదు రావటంతో…
గ్యాంగ్ సాగిస్తున్న ఈ అక్రమాల గురించి ఫిర్యాదు రావటంతో మల్కాజిగిరి డీసీపీ పద్మజ, ఎస్వోటీ డీసీపీ రమణా రెడ్డి, అదనపు డీసీపీ నర్సింహారెడ్డి, ఏసీపీ అంజయ్యల పర్యవేక్షణలో సీఐ కే.శ్రీనివాస్, ఎస్ఐ రఘురాముడుతోపాటు కీసర సీఐ ఆంజనేయులుతో కలిసి విచారణ చేపట్టారు. పక్కాగా ఆధారాలు సేకరించి ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. కేసులో నిందితులుగా ఉండి పరారీలో ఉన్న అమరేందర్, మాణిక్, అహమద్, సునీల్ కుమార్ తోపాటు మరో ఆరుగురి కోసం గాలిస్తున్నారు.