Fake Certificates: గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు జీహెచ్ఎంసీ అందిస్తున్న అత్యవసర సేవల్లో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ ఒకటి, రాజ్యాంగంలోని పౌరుల ప్రాథమిక హక్కుల ప్రకారం ఈ సర్టిఫికెట్లను స్థానిక సంస్థలు ఉచితంగా జారీ చేయాల్సి ఉన్నా, నామమాత్రపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. స్థానిక సంస్థలకు చెల్లించేది నామమాత్రపు ఛార్జీలే అయినా, రూ.లక్షల్లో చేతులు మారుతూ అడ్డదారిలో సర్టిఫికెట్లు జారీ అవుతున్న విషయాలు వరుసగా బయట పడ్డాయి.
బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ పారదర్శకంగా జరిగేందుకు వీలుగా ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ అధికారులు ఎన్ని సంస్కరణలు తెచ్చినా, అవి తుస్సుమంటున్నాయే తప్పా, అధికారులు ఆశించిన స్థాయిలో సర్టిఫికెట్ల జారీలో పారదర్శకత చోటుచేసుకోవటం లేదన్న విమర్శలు వెల్లువెత్తటంతో పాటు గత సంవత్సరం చివర్లో హైదరాబాద్ నగరంలో హోమ్ బర్త్ ప్రాతిపాదికన ఏకంగా 70 బర్త్ సర్టిఫికెట్లను జారీ చేయటంతో అనుమానం వచ్చిన అప్పటి కమిషనర్ ఇలంబర్తి ఈ సర్టిఫికెట్ల జారీపై విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించటంతో అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. మూతపడి ఉన్న టోలీచౌకీలోని మెట్రో హాస్పిటల్ ఒక్కటే సుమారు తప్పడు సమాచారంతో 65 బర్త్, మరో ఎనిమిది డెత్ సర్టిఫికెట్లు జారీ చేసినట్లు గుర్తించిన జీహెచ్ఎంసీ అధికారులు సదరు హాస్పిటల్ రిజిస్ట్రేషన్ రద్దు చేయించటంతో పాటు నిర్వాహకులపై క్రిమినల్ కేసులు కూడా పెట్టారు.
Also Read: Shipla layout flyover: ట్రా ‘ఫికర్’ కు చెక్.. ప్రారంభానికి సిద్దమైన శిల్పా లేఔట్ ఫేజ్-2 ఫ్లై ఓవర్!
దీనికి తోడు ఫలక్ నుమాలో మూడు, మలక్ పేటలో మరో ఒక బర్త్ సర్టిఫికెట్ లను అడ్డదారిలో జారీ చేసినట్లు కూడా గుర్తించటంతో ఈ అక్రమాలను బల్దియా సీరియస్ గా తీసుకుంది. బర్త్, డెత్ సర్టిఫికెట్లు ఎలాంటి అవకతవకలు లేకుండా, పారదర్శకంగా జారీ చేసేందుకు ఓ సరి కొత్త విధానాన్ని తీసుకురావాలంటూ జీహెచ్ఎంసీ అధికారులు కసరత్తు చేశారు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల స్థానిక సంస్థలు బర్త్, డెత్ సర్టిఫికెట్లను కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని సివిలియన్ రిజిస్ట్రేషన్ సిస్టమ్(సీఆర్ఎస్) పరిధిలోకి బర్త్, డెత్ సర్టిఫికెట్లను తీసుకురావాలని అప్పట్లోనే కమిషనర్ ఇలంబర్తి ప్రతిపాదించగా, కొత్త గా కమిషనర్ గా వచ్చిన ఆర్.వి.కర్ణన్ అందుకు ఆమోదం తెలిపినట్లు సమాచారం.
త్వరలో ఎంఏయూడీకి ప్రతిపాదనలు
గత అయిదేళ్లు క్రితమే జీహెచ్ఎంసీ సీఆర్ సీ ద్వారానే బర్త్, డెత్ సర్టిఫికెట్లు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించినా. అప్పటి రాష్ట్ర గులాబీ సర్కారు అందుకు తిరస్కరించగా, ఇపుడు జీహెచ్ఎంసీ అధికారులు సీఆర్ సీ ద్వారానే సర్టిఫికెట్లు జారీ పారదర్శకంగా జరుగుతుందని భావిస్తున్న అధికారులు ఈ విధానంతోనే సర్టిఫికెట్ల జారీ చేసేందుకు సిద్దమవుతున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను త్వరలోనే మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖకు జీహెచ్ఎంసీ పంపనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎంఏయూడీ లో త్వరలోనే డైరెక్టర్ ఆఫ్ హెల్త్, జీహెచ్ఎంసీ కమిషనర్, ఈ సేవా నిర్వాహకులతో సమావేశం కూడా నిర్వహించనున్నట్లు తెలిసింది.
ఆ రెండు మస్టు
జీహెచ్ఎంసీ త్వరలోనే బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ కోసం అమలు చేయనున్న సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ద్వారా దేశంలోనే యూనిక్ ఐడీ నెంబర్ తో ఈ సర్టిఫికెట్ జారీ చేయనుంది.జీహెచ్ఎంసీ పరిధిలో జనన, మరణాలు సంభవిస్తే దేశంలో ఎక్కడి నుంచైనా సర్టిఫికెట్లు తీసుకునే వెసులు బాటు కల్గనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్ లో జరిగే జనన, మరణాలకు సంబంధించి సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకునే దరఖాస్తుదారుడి ఆధార్ కార్డు, అందులో ఫోన్ నెంబర్ మస్టుగా ఉంటేనే స్వీకరించేలా అమలు చేయనున్నారు.
ఈ దరఖాస్తును స్వీకరించిన వెంటనే ఆధార్ కార్డులోని ఫోన్ నెంబర్ కు వచ్చే ఓటీపీ ద్వారా ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ జరిగిన తర్వాత తదుపరి ఆమోదం కోసం బర్త్, డెత్ రిజిస్ట్రార్ కు దరఖాస్తు వెళ్లనున్నట్లు అధికారులు తెలిపారు. జీహెచ్ఎంసీలో ఇప్పటివరకున్న బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ నియమావళిలోని లొసుగులను ఆసరాగా చేసుకుని అధికారులు, సిబ్బంది, మధ్తవ్యర్తులు అడ్డదారిలో బర్త్, డెత్ సర్టిఫికేట్లు జారీ చేస్తున్నట్లు సమాచారం.
Also Read: MLC Kavitha: అవినీతితో సింగరేణిని అంతం చేయాలని.. కాంగ్రెస్ ప్రభుత్వం యత్నం!
ఇటీవలీ కాలంలో చనిపోయిన ఓ వ్యక్తికి సంబంధించి అతనితో సంబంధం లేని వ్యక్తి ఆయన పేరిట ఫేక్ డెత్ సర్టిఫికెట్ తీసుకున్న మరో వ్యక్తి, చనిపోయిన వ్యక్తి ఆస్తులను విక్రయించుకున్న ఘటన వెలుగు చూసింది. చనిపోయిన వ్యక్తి వ్యక్తి కుమార్తే ఈ విషయాన్ని గ్రహించి జీహెచ్ఎంసీ అధికారులకు చెప్పే వరకు కూడా ఆ సర్టిఫికెట్ ఫేక్ అన్న విషయం అధికారులకు తెలియదు. చనిపోయిన సదరు వ్యక్తికి కూతురు తప్పా, వేరే వారసులు లేకపోవటంతో నిందితుడు ఈ రకమైన మోసానికి తెర తీసినట్లు అభిప్రాయాలున్నాయి.
ఈ ఘటనపై విచారణ చేపట్టి, సదరు సర్టిఫికెట్ ను రద్దు చేయటంతో పాటు సర్టిఫికేట్ తీసుకున్న వ్యక్తిపై క్రిమినల్ కేసు కూడా నమోదు చేయించిన ఘటనతో జీహెచ్ఎంసీ అధికారులు సర్టిఫికెట్లు పక్కగా, పారదర్శకంగా జారీ చేసే సరి కొత్త విధానం కోసం అన్వేషించి, సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ను అనుసరించేందుకు సిద్దమైనట్లు సమాచారం. దీంతో పాటు సర్టిఫికెట్లలోని తప్పులను సరి చేసేందుకు కూడా ఐటీని వినియోగించుకుంటూ స్టాండర్డ్ మెజర్స్ తీసుకునే దిశగా జీహెచ్ఎంసీ అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
Also Read: Telangana Formation Day: యువతకు గుడ్ న్యూస్.. రూ.8,000 కోట్లతో ఉపాధి.. డిప్యూటీ సీఎం వెల్లడి!