MLC Kavitha: కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతితో సింగరేణి సంస్థనే అంతం చేయాలని కుట్రలు పన్నుతోందని వాటిని అడ్డుకుంటామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. సింగరేణి కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా, సంస్థను కాపాడటమే ధ్యేయంగా సింగరేణి జాగృతి ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. హైదరాబాద్ లో మంగళవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన సింగరేణి జాగృతి ఆవిర్భావ సమావేశంలో ఆమె మాట్లాడారు. టీబీజీకేఎస్ తో సమన్వయం చేసుకుంటూ సింగరేణి జాగృతి పని చేస్తుందన్నారు.
సింగరేణి కార్మికులు విద్య, వైద్యం కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. సంస్థలో 40 వేల మందికిపైగా కార్మికులు పని చేస్తుంటే వారిలో సగానికిపైగా యువకులే ఉన్నారని తెలిపారు. సింగరేణి స్కూళ్లను పునరుద్దరించి సీబీఎస్ఈ సిలబస్ లో విద్యాబోధన చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు కార్పొరేట్ హాస్పిటళ్లలో ఉచిత వైద్యం అందజేయాలన్నారు. కార్మిక కాలనీల్లో మెరుగైన వసతులు కల్పించాలని, తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 1970లో నిర్మించిన క్వార్టర్స్ కూలిపోయే దశలో ఉన్నాయని, అన్ని రీజియన్లలో కార్మికుల కోసం కొత్త క్వార్టర్స్ నిర్మించాలని డిమాండ్ చేశారు.
Also Read:Operation Kagar: ఆపరేషన్ కగార్ ఆపాలి.. మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరపాలి!
భూగర్భ గనుల్లో ఎస్ డీ ఎల్ వెహికిల్స్ ను సింగరేణి కార్మికులతోనే నడిపించాల్సి ఉండగా ఆ మిషన్లను ప్రైవేటు వాళ్ల తో నడిపిస్తున్నారని, ఇది సింగరేణి గనుల నుంచి కార్మికులను తొలగించే కుట్ర అన్నారు. వెంటనే ప్రైవేట్ వ్యక్తులతో పని చేయించడం ఆపివేయాలన్నారు. సింగరేణి సంస్థ ద్వారా సమకూరుతున్న డీఎంఎఫ్ టీ నిధులను కార్మికులకు మెరుగైన వసతులు కల్పించడానికి వినియోగించుకుండా సీఎం, డిప్యూటీ సీఎంల నియోజకవర్గాలు కొడంగల్, మధిరకు తరలించుకుపోతున్నారని మండిపడ్డారు. 130 ఏళ్ల సింగరేణి చరిత్రలోనే ఇంతటి అవినీతిని ఎప్పుడూ చూడలేదన్నారు.
అధికారాన్ని అడ్డంపెట్టుకొని సంస్థను ముంచేయాలనే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకొని తీరుతామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీ కోసం పని చేస్తున్నాడని అందుకే కార్మికుల ప్రయోజనాలు దెబ్బతీసే లేబర్ కోడ్ గురించి ఒక్కమాట మాట్లాడటం లేదని మండిపడ్డారు. కార్మికుల కోసం తాను స్వయంగా బొగ్గు గనులు, ఓపెన్ కాస్టుల వరకు వచ్చి కూర్చొంటానని హామీ ఇచ్చారు. ఓపెన్ కాస్టుల్లో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తామన్నారు. సింగరేణి జాగృతికి అనుబంధంగా మహిళల విభాగం కూడా ఏర్పాటు చేస్తామన్నారు.
11 ఏరియాలకు సింగరేణి జాగృతి కో ఆర్డినేటర్లను నియమిస్తున్నామని ప్రకటించారు. బెల్లంపల్లి – కిరణ్ ఓరం, శ్రీరాంపూర్ – కుర్మ వికాస్, మందమర్రి – ఎస్.భువన్, రామగుండం1 – బొగ్గుల సాయికృష్ణ, రామగుండం 2 – కె. రత్నాకర్ రెడ్డి, రామగుండం 3 – దాసరి మల్లేశ్, భూపాలపల్లి – నరేశ్ నేత, మణుగూరు – అజ్మీరా అశోక్ కుమార్, కొత్తగూడెం – వన్నంరెడ్డి వీర నాగేంద్ర సాగర్, కార్పొరేట్ – వసికర్ల కిరణ్ కుమార్, ఎస్ టీపీపీ పవర్ ప్లాంట్ – కె. రామ్మోహన్ చారి ని నియమించారు.
Also Read: Kalvakuntla Kavitha: కవితతో ఎంపీ దామోదర్ కీలక భేటీ.. కొత్త పార్టీని ఆపేందుకేనా?