Jupally Krishna Rao: కొల్లాపూర్ పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao) ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల ప్రభుత్వం పెంచిన డైట్ చార్జీల ప్రకారం మెనూ సరిగా అమలవుతుందా అని ఆరా తీశారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ చేసి, పిల్లలకు నాణ్యమైన, రుచికరమైన భోజనం అందుతుందా అని అడిగారు. తల్లిదండ్రులు సంతృప్తి వ్యక్తం చేయడంతో మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ఒక తరగతి గదిని సందర్శించి విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడారు. వారికి పర్యావరణం అంటే ఏమిటో వివరించి, కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు.
Also Read: Mee Seva New Service: మీ సేవ పరిధిలోకి కొత్త సేవలు.. నిమిషాలలో ఈ సర్టిఫికెట్ జారీ
సమస్యలపై తక్షణ చర్యలు..
అదనపు తరగతి గదుల నిర్మాణం పూర్తయినా ప్రారంభం కాకపోవడంపై అధికారులను ప్రశ్నించి, వెంటనే ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. టీచర్లు కోరిన మీదట, పాఠశాలకు కాంపౌండ్ వాల్, క్రీడా ప్రాంగణం, బాత్‌రూమ్‌ల సమస్యలను పరిష్కరించాలని అక్కడికక్కడే కలెక్టర్ సంతోష్‌తో మాట్లాడి డీఎంఎఫ్‌టీ నిధుల ద్వారా నిధులు మంజూరు చేయించారు. కాంపౌండ్ వాల్‌కు ఇప్పటికే నిధులు మంజూరైనందున పనులు వేగవంతం చేయాలని పంచాయతీ రాజ్ ఏఈకి ఆదేశాలు జారీ చేశారు. ఈ పర్యటనలో నాగర్‌కర్నూల్(Nagarkurnool) మండలం పెద్దాపురం గ్రామానికి చెందిన ఓ బాలిక తల్లిదండ్రులకు దూరంగా ఉన్నందుకు బాధపడుతూ కనిపించగా, మంత్రి ఆమెను ఓదార్చారు. బాలిక తల్లిదండ్రులకు ఫోన్ చేసి, తరచుగా పాఠశాలకు వచ్చి కూతురితో గడిపి వెళ్లాలని కోరారు.
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు..
కొల్లాపూర్(Kollapur) మండలం చుక్కాయపల్లిలో ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపికపై నిర్వహించిన గ్రామసభలో కూడా మంత్రి పాల్గొన్నారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలని, రాజకీయ ప్రమేయం లేకుండా అసలైన అర్హులను ఎంపిక చేయాలని అధికారులకు సూచించారు. గ్రామసభలో అనర్హులను ఎంపిక చేశారని ప్రజలు మంత్రి దృష్టికి తీసుకురాగా, వారి పేర్లను తొలగించాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు.
కార్యాలయం ప్రారంభం..
అనంతరం తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల ఐఎన్టీయూసీ అనుబంధ సంఘం కార్యాలయాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్‌కర్నూల్(Nagarkurnool) ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేశ్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ ఉద్యోగులు ఉచిత విద్యుత్ వంటి పథకాల అమలులో కీలక పాత్ర పోషించాలని కోరారు. కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
Also Read: Warangal Heavy Rains: రానున్న 72 గంటలు బీ కేర్ ఫుల్.. సీఎం రేవంత్ రెడ్డి