Indiramma Sarees: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సమైక్యత ద్వారా రాష్ట్రంలోని మహిళలకు పంపిణీ చేసేందుకు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని చేనేత కార్మికుల ద్వారా తయారు చేయిస్తున్న ఇందిరమ్మ చీరల రంగులు, నాణ్యత అద్భుతంగా ఉన్నాయని రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి వచ్చిన మహిళా సమాఖ్య సభ్యులు కితాబు ఇచ్చారు. రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల నుంచి మహిళా సమాఖ్య సభ్యులు ఇందిరమ్మ చీరల తయారీని పరిశీలించేందుకు సిరిసిల్ల పట్టణంలోని వస్త్ర పరిశ్రమను సందర్శించారు.
Also Read: Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో పేదలకు అన్యాయం జరిగిందా?
ప్రభుత్వానికి మహిళా సమాఖ్య సభ్యులు ధన్యవాదాలు
జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ గరిమ అగర్వాల్ ఆధ్వర్యంలో ఈ పర్యవేక్షణ జరిగింది. పవర్‌లూమ్ పరిశ్రమను పర్యవేక్షిస్తూ, ఇందిరమ్మ చీరల నాణ్యతను, పనితీరును కార్మికులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర నలుమూలల నుంచి పర్యవేక్షణకు వచ్చిన మహిళా సమాఖ్య సభ్యులకు కలెక్టర్ అభినందనలు తెలిపారు. అనంతరం మహిళలు మాట్లాడుతూ.. ఇందిరమ్మ చీరల నాణ్యత బాగుందని ఆనందం వ్యక్తం చేశారు. నాణ్యమైన, కట్టుకోవడానికి అనువైన రంగురంగుల డిజైన్లతో మహిళలను ఆకట్టుకునే విధంగా ఇందిరమ్మ చీరలను అందిస్తున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రాష్ట్ర ప్రభుత్వానికి మహిళా సమాఖ్య సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.
రంగులు, నాణ్యతా బాగున్నాయి
రాష్ట్ర ప్రభుత్వం మహిళా మణులకు పంపిణీ చేసేందుకు ఇందిరమ్మ చీరల పేరుతో చేనేత కార్మికుల చేత తయారు చేస్తున్న చీరలు రంగులు, నాణ్యత బాగున్నాయి. గతంలో ‘బతుకమ్మ చీరలు’ పేరుతో ఇచ్చిన చీరలు కట్టుకోవడానికి మహిళలు ఇబ్బంది పడ్డారు. కానీ ఈ చీరలు చాలా బాగున్నాయి.
– మాదవి, మెదక్ జిల్లా
చేనేత కార్మికులకు ఉపాధి
రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఇందిరమ్మ చీరల పేరుతో చీరలు పంపిణీ చేసేందుకు చేపట్టిన పథకం ద్వారా చేనేత కార్మికులకు ఉపాధి అవకాశం పెరుగుతుంది. మహిళలకు నాణ్యమైన చీరలు అందించడంతో పాటు చేనేత కార్మికులకు ఉపాధి కల్పించాలనే ప్రభుత్వ నిర్ణయం అభినందనీయం. చేనేత కార్మికులకు మరింత ఉపాధి కల్పించేందుకు అవసరమైన చర్యలు ప్రభుత్వం చేపట్టాలి.
– అనిత, మంచిర్యాల జిల్లా
క్వాలిటీగా ఉన్నాయి..
మహిళలకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చేనేత కార్మికుల ద్వారా తయారు చేస్తున్న చీరల నాణ్యత విషయంలో ప్రభుత్వం రాజీ పడనట్టుగా (కాంప్రమైజ్ కానట్టుగా) కనిపిస్తుంది. నాణ్యమైన, అందమైన రంగుల చీరలు అందించాలని, కార్మికులకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఈ చీరలతో మహిళలు సంతోషపడతారని భావిస్తున్నాం.
– హరిత, జగిత్యాల జిల్లా
Also Read: Indiramma Houses: అర్హతను బట్టి ఇందిరమ్మ ఇల్లు.. మంత్రి సంచలన వాఖ్యలు!
