Sunil Kumar Ahuja
లేటెస్ట్ న్యూస్, సూపర్ ఎక్స్‌క్లూజివ్

Sunil Kumar Ahuja: అక్రమ ఫైనాన్స్‌లో జిత్తులమారి.. సునీల్ కుమార్ అహుజా!

  • ఇచ్చేది వైట్ మనీ.. తీసుకునేది మాత్రం బ్లాక్
  • రూ.6 నుంచి రూ.10 వడ్డీతో రియల్టర్స్‌కు కుచ్చుటోపీ
  • ప్రాపర్టీస్ తనఖా పేరుతో ఇష్టారీతిన రిజిస్ట్రేషన్స్?
  • రియల్ ఎస్టేట్‌లో పేరొందిన వారంతా బాధితులే..
  • ఒక్కొక్కటిగా బయటపడుతున్న అహుజా బాగోతాలు
  • సహకరించిన సైఫాబాద్‌లో పని చేసిన సీఐ
  • ఎలాంటి ఇబ్బందులు రాకుండా నెల్లూరు కాంట్రాక్టర్ అండ?
  • బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కాంట్రాక్టర్ వియ్యంకుడు కావడంతో ఫుల్ సపోర్ట్
  • దయాదాక్షిణ్యాలు లేకుండా రాక్షసంగా రియల్టర్స్‌ను వేధించిన అహుజా ఫ్యామిలీ
  • కూతురు వివాహం ఉందని కార్డు ఇస్తే పెళ్లికి తెచ్చిన బంగారం వడ్డీగా ఇవ్వాలని వేధింపులు
  • క్షణక్షణం బాధ తట్టుకోలేక ఇప్పటివరకు 40 మంది బాధితుల మృతి?
  • అహుజా ఫైనాన్స్ దందాపై ‘స్వేచ్ఛ’ ఎక్స్‌క్లూజివ్ స్టోరీ

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల
స్వేచ్ఛ ఎడిటర్


Sunil Kumar Ahuja: సునీల్ కుమార్ అహుజా.. రియల్ ఎస్టేట్ రంగంలో ఈ పేరు నిండా ముంచేసే పెద్ద సునామీ. రియల్టర్ల అత్యాశే పెట్టుబడిగా ఇతను సాగించిన దందాకు ఎందరో బలయ్యారు. హైదరాబాద్ హవాలాకు కేరాఫ్‌గా పేరొందిన అహుజా, వైట్ మనీ బ్లాక్ చేసుకోవడమే కాకుండా ఆస్తులను రాయించుకుని అరాచకాలకు పాల్పడడంలో దిట్ట. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నట్టు సమాచారం. రియల్ భూం ఉన్నప్పుడు భరించిన బాధితులు ఇప్పుడు వడ్డీలు కట్టలేక ఆత్మహత్యలే శరణ్యం అంటున్నారు. సెక్యూరీటీ డిపాజిట్స్ అంటూ 30 శాతానికే ఆస్తులను రాయించుకుని చెప్పా పెట్టకుండానే అహుజా అమ్మేసుకుంటున్నాడు. ఇతని డబ్బు పిచ్చిని తట్టుకోలేక ముగ్గురు భార్యలు వదిలేసినట్టు తెలిసింది.

ఫైనాన్స్ జిమ్మిక్కులు


సూట్ కేస్ కంపెనీలతో ఒకేసారి వైట్ మనీ రూ.100 కోట్లు ట్రాన్స్‌ఫర్ చేయడంలో అహుజా ఆరితేరాడు. రూ.10 కోట్ల క్యాష్ కావాలంటే ఒకేసారి పంపించగల ఆర్థిక స్కామర్‌గా మారాడు. అందుకే ఏ పార్టీలు ఇతన్ని టచ్ చేయడం లేదు. రాను రాను అరాచకాలు పెరిగిపోతుండడంతో బాధితులు బయటకు వస్తున్నారు. ఫైనాన్సర్ ముసుగులో కష్టపడి సంపాదించుకున్న ఆస్తులను కాజేస్తుండడంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అహుజా మాయ ఎలా ఉంటుందంటే, అవసరం అని పోతే మాయమాటలతో బ్యాంకు వడ్డీకే తీసుకెళ్లండి అని చెబుతాడు. నైస్‌గా ఆస్తి తన పేరుపై రాయించుకుంటాడు. తర్వాత మూడు నెలలకు ఒకసారి వడ్డీ ఇవ్వాలంటాడు. మొదటగా రూ.2 చొప్పునే తీసుకుంటాడు. రిజిస్ట్రేషన్ విలువ తన సొంత అకౌంట్స్ నుంచి బదిలీ చేస్తాడు. మిగితా కొంత మొత్తం రెండు మూడు అకౌంట్స్ నుంచి వస్తాయి. కానీ, వడ్డీ అసలు ఇచ్చేటప్పుడు మాత్రం పంపించిన అకౌంట్స్‌కు వేయొద్దు, పూర్తిగా క్యాష్ రూపంలోనే కావాలంటాడు. అందుకు వడ్డీతో కూడి అసలు మొత్తం తీసుకెళ్లి ఇస్తే తీసుకుంటాడు. అప్పుడే అసలు రాక్షసుడు బయటకు వస్తాడు. తీసుకెళ్లిన డబ్బును వేరే వ్యక్తులకు ఇచ్చేస్తాడు. ఆ తర్వాత కొడుకును పిలిచి లెక్కలు తీస్తాడు. వాళ్ల ప్రాపర్టీ ఆ క్షణం వరకు అమ్మితే ఎంత వస్తుందో అంతా ఇవ్వాలని చెబుతాడు. ఇవేం లెక్కలండి అని ప్రశ్నిస్తే, మీరు మా వద్ద రూ.10 వడ్డీకి తీసుకున్నారు. ఆ మొత్తం ఆస్తి విలువ అంతే ఉంది. మీరు పూర్తిగా ఇచ్చి తాకట్టు పెట్టిన ఆస్తిని మీ పేరుపై మార్చుకోండి అంటూ సెలవిస్తాడు. మళ్లీ అప్పటి నుంచి మొత్తం సొమ్ముకు వడ్డీ మీటర్ తిరుగుతుంది. చెల్లించకుంటే తాను రాయించుకున్న ఆస్తిలోకి పొజిషన్ తీసుకునేందుకు పయత్నాలు చేస్తాడు. పోలీసులను మేనేజ్ చేసి పేపర్స్ చూపించి కొనుగోలు చేశానని నమ్మించి నట్టేట ముంచుతాడు.

Read Also- Kingdom Trailer: ఈ సారి ఎంకన్న సామి నా పక్కనుంటే టాప్ లో పోయి కూసుంటా.. విజయ్ దేవరకొండ

పోలీసులతో మేనేజ్

2019 ఎలక్షన్ ముందు సైఫాబాద్ పోలీసులకు తన కుమారుడు ఆశీష్ రూ.7 కోట్లతో పట్టుబడ్డాడు. అప్పటి పోలీసులను మేనేజ్ చేసి తన కుమారుడి పేరును తొలగించి డ్రైవర్, తన పేరు చేర్చుకున్నాడు. ఇప్పుడు ఆ కేసును మేనేజ్ చేసేశాడు. అప్పుడు సైఫాబాద్ ఎస్‌హెచ్ఓగా పనిచేస్తున్న సీఐ మేలు చేయడంతో ఇప్పటికీ తనతోనే సివిల్ మేటర్‌లో ఫైనాన్స్‌లో ఇన్వాల్ అవుతున్నారని బాధితులు చెబుతున్నారు. అన్ని కమిషనరేట్స్ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో సీఐలను మేనేజ్ చేసి పొజిషన్ తెప్పించుకుంటాడని, పోలీసులు సివిల్ డ్రెస్‌లో సైట్‌ల వద్దకు వెళ్తుంటారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఎవరైనా రియల్టర్ తన దగ్గర 2 కోట్లు తీసుకుంటే ఏడాదిన్నరలోనే రూ.2 కోట్లు చెల్లించినా, మరో రూ.4 కోట్లు ఇవ్వాలి, లేదంటే నీ విల్లాను స్వాధీనం చేసుకుంటామని బెదిరిస్తుంటాడు. ఫైనాన్స్ ఇచ్చే క్రమంలో బ్లాంక్ చెక్స్, బాండ్ పేపర్స్, వైట్ పేపర్స్‌పై దాదాపు మొత్తం 20 సంతకాలు తీసుకుంటాడు. ఇళ్లను ఖాళీ చేయకపోతే, తానే అద్దెకు ఇచ్చినట్లు రాయించుకుని న్యాయపరంగా టైటిల్‌ను స్ట్రాంగ్ చేసుకుంటాడు.

వసూళ్లలో అరాచకానికి పరాకాష్ట

ఆస్తులను అమ్మే క్రమంలో ఓ రిటైర్డ్ జడ్జి పేరును అర్బిట్రేటర్‌గా పేర్కొంటాడు. అతనే నిర్ణయిస్తారని అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అండ్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీలో రాయించుకుంటాడు. సేల్ డీడ్‌లో కూడా ప్రస్తావిస్తాడు. దీంతో లిటిగేషన్ ద్వారా భూమిపై హక్కులు ఉన్నాయని కోర్టులో కేసు వేసినా ఆ అర్బిట్రేటర్‌కు రిఫర్ చేస్తుంటారు. బేగం బజారుకు చెందిన రిటైడ్ జడ్జితో అందరికీ చుక్కలు చూపిస్తుంటాడు. తాను ఉండే ఇల్లును సైతం ఫైనాన్స్ ఇచ్చి కబ్జా చేశాడని ఆరోపణలు ఉన్నాయి. తల్వార్ హుదాయ్ ఓనర్‌కు చెందిన ఇంటిని కొనుగోలు చేశానని చెప్పుకున్నా, అది లాగేసుకున్నదేనని సిటీలో ఉన్న చాలామంది పెద్దమనుషులకు తెలుసు. ఎవరైనా వడ్డీ చెల్లించకుంటే వాళ్ల కార్లను సైతం లాగేసుకుంటాడు. తర్వాత విక్రయిస్తాడు. కూతురు పెళ్లి ఉందని ఓ బాధితుడు కాళ్లావేళ్ల పడ్డా కానీ, కనకరించకుండా బెంజ్ కారును బలవంతంగా రాయించుకున్న ఘనుడు అహుజా. చివరకు మెడలో ఉన్న చైన్‌ను కూడా లాగేసుకుంటాడని పేరుంది. ఒక్క విజిట్‌కే డబ్బులు తీసుకోవడానికి ఇంటికి వెళితే 2 వేల రూపాయలు ఫైన్ వేస్తాడు. అది తీసుకొచ్చిన ఉద్యోగికి ఇవ్వకుండా అతనే మొదటగా ఆ డబ్బులు లాగేసుకుంటాడు. దీనికి తోడుగా పెనాల్టీలు, చార్జీలు అంటూ చక్ర వడ్డీ, బారు వడ్డీలతో మూడు నెలల్లో వడ్డీ ఇవ్వకపోతే నరకం చూపిస్తాడు. 10 రూపాయాల నోటు వాట్సాప్ పంపి అది ఇచ్చిన వారికి డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి తెస్తాడు. ఇలా అనేక రకాలుగా తన వద్ద ఒక్క రూపాయి ఉంచుకోకుండా మొత్తం రోడ్డుపైనే హవాలా నడిపిస్తాడని తెలిసిన వ్యక్తులు చెబుతుంటారు.

Read Also- Asia Cup: భారత్-పాక్ మధ్య 3 మ్యాచ్‌లు!.. ఆసియా కప్‌ షెడ్యూల్ రిలీజ్

పెద్దల పేర్లు చెప్పి దందాలు

సునీల్ అహుజా మామూలోడు కాదు. ఇష్టం వచ్చినట్టు ఫైనాన్స్ దందా చేస్తూ, ప్రముఖుల పేర్లు వాడేస్తుంటాడు. అమిత్ షా తన మనిషి, సీఎం జిగిరీ దోస్త్ అంటూ బిల్డప్ ఇస్తాడు. నిజానికి అహుజాకు అంత సీన్ లేదు. మాటలతో పాటు చిన్నపాటి ఉద్యోగులను మచ్చిక చేసుకుని హవాలా నడిపిస్తాడు. ఇతనికి నెల్లూరుకి చెందిన ఓ కాంట్రాక్టర్ మాత్రమే పరిచయం. అతను తెలంగాణలోని మెదక్ జిల్లాలో గతంలో ఎంపీగా ఇప్పుడు ఎమ్మెల్యేగా పని చేస్తున్న వ్యక్తికి వియ్యంకుడు. సమస్య వచ్చినప్పుడల్లా అతనే కాపాడుతాడని మార్కెట్‌లో టాక్. ఇక, తన కుటుంబ సభ్యులు సైతం ఇతని డబ్బు పిచ్చిని తట్టుకోలేకపోయారు. ఒక్కరిద్దరు కాదు ముగ్గురు భార్యలు ఈ సైకోతో బతకలేమని వదిలేశారు. మొదటి భార్యకు కుమారుడు ఆశీష్ పుట్టగా అతనికి పెళ్లి చేశాడు. మనవరాలు తన కొడుక్కే పుట్టిందా అంటూ డీఎన్ఏ టెస్ట్ చేయించాడని అతని కోడలు విడాకులు ఇచ్చి వెళ్లిపోయింది. 24 గంటలూ డబ్బుల మైకంలో మునిగిపోయి చట్టంలోని లొసుగులను, డబ్బుల అవసరాలను ఆసరాగా చేసుకుని హైదరాబాద్‌లో ఫైనాన్స్ అరాచాకాలు సృష్టిస్తున్నాడు. ఇప్పటి వరకు 40 మందికి పైగా ఇతని టెన్షన్ తట్టుకోలేక గుండెపోటుతో చనిపోయారు. మరికొందరు ఆత్మహత్య చేసుకున్నారని బాధితులు తెలిపారు. అయితే, ఎక్కడా కేసు నమోదు కాకుండా జాగ్రత్త పడ్డాడు. సూసైడ్ నోట్ రాసినా అప్పటికప్పుడు మేనేజ్ చేసి బయటకు రాకుండా వాళ్ల ప్రాపర్టీ రిలీజ్ చేస్తాడని తెలుస్తున్నది. ఇలా అనేక మందిని ఇబ్బందులకు గురి చేస్తున్న సునీల్ అహుజాను అరెస్ట్ చేసి ఆస్తులను అప్పగించాలని బాధితులు కోరుతున్నారు.

‘స్వేచ్ఛ’లో తర్వాతి కథనం

అహుజా అక్రమ సంపాదన అంతా తన కొడుకు తెలివితేటలతో సైడ్ అవుతున్నది. క్లౌడ్‌లో డేటాను భద్రపర్చడంతో పాటు రిమోట్ రీబూట్ చేయడంతో ఎవరికీ ఆధారాలు అందడం లేదు. ఐటీ, ఈడీలు ఎంట్రీ అవుతున్నట్లు అనుమానం వస్తే చాలు దుబాయ్, అమెరికా వెళ్లిపోతారు. విదేశాల్లోనూ హవాలా చేస్తారు. అహుజా చేతిలో ఇంకా ఎంతమంది మోసపోయారు. అమెరికాలో క్రిప్టో కరెన్సీకి నగదు ఎలా మారుస్తాడో మరో ఎక్స్‌క్లూజివ్ కథనంలో చూద్దాం.

Read Also- Jogulamba Gadwal district: ప్రభుత్వ ఆస్పుపత్రిలో క్రిటికల్ సర్జరీ చేసిన గద్వాల డాక్టర్లు

Just In

01

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్