Asia Cup: ఆసియా కప్ నిర్వహణపై సందేహాలు వీడిపోయాయి. భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్‌లు జరుగుతాయా? లేదా? అన్న అనుమానాలు పటాపంచెలయ్యాయి. క్రికెట్ అభిమానులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న ఆసియా కప్ 2025 షెడ్యూల్ (Asian Cup 2025) శనివారం విడుదలైంది. యూఏఈ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు ఈ టోర్నమెంట్ జరగనుంది. ఈ మేరకు ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ (ACC) చైర్మన్ మోహ్సిన్ నక్వీ శనివారం ప్రకటించారు. ప్రస్తుతం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్‌గా కూడా వ్యవహరిస్తున్న మోహ్సిన్ నక్వీ ఎక్స్ వేదికగా అధికారిక ప్రకటన చేశారు.
భారత్-పాక్ మధ్య 3 మ్యాచ్‌లు!
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రదాడి, ఆ తర్వాత ఆపరేషన్ సిందూర్ పరిణామాలతో భారత్-పాకిస్థాన్ సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితుల్లో పాకిస్థాన్‌తో టీమిండియా క్రికెట్ ఆడకూడదంటూ బలంగా డిమాండ్లు వినిపించాయి. ఈ పరిణామాలతో ఆసియా కప్‌లో భారత్-పాక్ తలపడతాయా లేదా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ, మ్యాచ్‌లు ఆడడమే కాదు, ఇరు జట్లు ఆసియా కప్‌లో ఏకంగా మూడు మ్యాచ్‌ల్లో తలపడే సూచనలు కనిపిస్తున్నాయి. టోర్నమెంట్‌లో భారత్–పాకిస్థాన్ జట్లు ఒకే గ్రూపులో ఉండబోతున్నట్టు తెలుస్తోంది. దీంతో, గ్రూప్ దశ, సూపర్ ఫోర్‌తో పాటు ఇరు జట్లు ఫైనల్ చేరుకుంటే మొత్తం మూడు మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంటుంది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు రద్దైన నాటి నుంచి ఐసీసీ, ఆసియా కప్‌లకు సంబంధించిన అన్ని టోర్నీలలోనూ భారత్-పాక్ కనీసం ఒక్క మ్యాచ్‌లోనైనా తలపడేలా షెడ్యూల్‌ను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఈ సారి ఆసియా కప్ టోర్నమెంట్ టీ20 ఫార్మాట్‌లో జరగనుంది. వచ్చే ఏడాది జరగబోయే టీ20 వరల్డ్ కప్‌కు ఒక సన్నాహకంగా ఉపయోగపడనుంది.
Read Also- Nitish Reddy: చిక్కుల్లో క్రికెటర్ నితీష్ రెడ్డి.. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు
ఇరు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో, ఈ టోర్నీలో ఇరు దేశాలు ఒకే గ్రూపులో ఉండబోతున్నాయనే కథనాలు ఆసక్తికరంగా మారాయి. వారం రోజుల క్రితమే వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) మాజీ క్రికెటర్ల టోర్నమెంట్‌లో పాక్ జట్టుతో ఆడేందుకు భారత ఆటగాళ్లు మొగ్గుచూపలేదు. దీంతో, భారత్-పాకిస్థాన్ మ్యాచ్ రద్దయింది. భారత జట్టు తరపున యువరాజ్ సింగ్, సురేశ్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, శిఖర్ ధావన్ వంటి పాపులర్ ఆటగాళ్లు పాల్గొనాల్సి ఉన్నప్పటికీ, జనాల్లో ఉన్న అభిప్రాయాలకు గౌరవమిస్తూ మ్యాచ్‌కు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో, ఆసియా కప్‌లో భారత్–పాక్ ఒకే గ్రూపులో పెట్టడంపై చర్చలు మొదలయ్యాయి.
త్వరలోనే తేదీలు
ఆసియా కప్ 2025కు యూఏఈ ఆతిథ్యమివ్వనుంది. మ్యాచ్‌లకు సంబంధించిన తేదీలు, పూర్తి షెడ్యూల్‌ను త్వరలో వెల్లడించనున్నట్లు మోహ్సిన్ నక్వీ తెలిపారు. దుబాయ్, అబుధాబి నగరాల వేదికగా అన్ని జరిగే ఛాన్స్ ఉంది. టోర్నీలో మొత్తం 19 మ్యాచ్‌లు జరగనున్నాయి. మిగతా మ్యాచ్‌ల సంగతి పక్కన పెడితే భారత వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. చివరిసారిగా ఈ రెండు జట్లు ఛాంపియన్స్ ట్రోఫీలో తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ శతకంతో చెలరేగడంతో పాక్‌పై టీమిండియా 6 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండానే ట్రోఫీని టీమిండియా ముద్దాడింది.
Read Also- Telangana: ‘సిగాచీ’ దుర్ఘటనపై హైకోర్టులో మాజీ సైంటిస్ట్ పిల్