Chevella Bus Accident: చేవెళ్ల సమీపంలోని ఇందిరా రెడ్డి నగర్ వద్ద జరిగిన ఘోర రోడ్డు దుర్ఘటనపై ఆర్టీసీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ప్రాణాలు కోల్పోయిన 19 మందికి సంతాపం తెలియజేసింది. క్షతగాత్రులైన ప్రయాణికులు త్వరగా కోలుకోవాలని ఆకాక్షించింది. మృతుల కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయం తాండూరు నుంచి బయలుదేరిన ప్రైవేట్ హైర్ ఎక్స్ప్రెస్ బస్సు ఇందిరానగర్ సమీపంలో కంకర లోడ్తో ఎదురుగా వచ్చిన టిప్పర్ బస్సు ముందుభాగాన్ని బలంగా ఢీ కొట్టింది. ప్రయాణికులతో పాటు బస్సు డ్రైవర్ దస్తగిరి మృతిచెందారు.
Also Read: Chevella Bus Accident Live Updates: ఘోర బస్సు ప్రమాదం.. ఎక్స్ గ్రేషియో ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
25 మందికి మెరుగైన చికిత్స అందించాలి
సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వై.నాగిరెడ్డి, హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఖుష్రో షా ఖాన్, ఇంచార్జీ ఈడీ (ఆపరేషన్స్) శ్రీధర్, రంగారెడ్డి రీజినల్ మేనేజర్ శ్రీలత, తదితర సీనియర్ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన 25 మందికి మెరుగైన చికిత్స అందించాలని అధికార బృందం డాక్టర్లను కోరారు. చనిపోయిన 19 మందిలో 5గురు మహిళలు, 14 మంది పురుషుల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. వారి సంబంధీకులకు అప్పగించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మృతి చెందిన వారికి ఒక్కొక్కరికి ప్రభుత్వం తరుఫున రూ.5లక్షలు, ఆర్టీసీ నుంచి రూ.2లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
టిప్పర్ అతివేగమే కారణం
గాయపడిన వారికి రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రభుత్వం ప్రకటించింది. ఇది కాకుండా వాహనం ఇన్సురెన్స్ పాలసీ ద్వారా బాధితులకు తగిన మొత్తంలో పరిహారం చెల్లించనున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ప్రాథమిక విచారణ చేశారు. ప్రమాదానికి ఆర్టీసీ బస్సు గానీ, బస్సు డ్రైవర్ గానీ కారణం కాదని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు సమాచారం. బస్సు పూర్తి ఫిట్నెస్తో ఉందని, డ్రైవర్ సర్వీసు రికార్డు ప్రకారం ఎలాంటి యాక్సిడెంట్ రికార్డు లేనట్టు తేలింది. రోడ్డు మలుపు వద్ద అతి వేగంతో ఉన్న టిప్పర్ డ్రైవర్ నియంత్రణ కోల్పొవడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
