Kavitha: హుజురాబాద్ మండలంలో అనుమానాస్పదంగా మృతి చెందిన విద్యార్థిని శ్రీవర్షిత కుటుంబానికి ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన ‘ జనంబాట ‘ పర్యటనలో భాగంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడారు.
కల్వల మత్తడిపై కవిత వ్యాఖ్యలు
కేశపట్నం మండలంలోని కల్వల మత్తడి కొట్టుకుపోయి మూడు సంవత్సరాలు గడిచిందని, అయినా ఇప్పటివరకు రిపేరు పనులు చేపట్టకపోవడంపై కవిత ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వమే మత్తడి రిపేరు కోసం రూ. 70 కోట్లు విడుదల చేస్తూ జీవో ఇచ్చినా, ప్రభుత్వం మారడంతో పనులు నిలిచిపోయాయని పేర్కొన్నారు. మానకొండూరు నియోజకవర్గంలో మత్తడి ఉన్నప్పటికీ, నీరు హుజురాబాద్‌లో పారుతున్నందున, ఇరు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఒకరు పనులు చేయిస్తే మరొకరికి పేరు వస్తుందనే భావనతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
Also Read: Kavitha: దగాపడ్డ ఉద్యమకారుల్లో మొదటి వరుసలో నేనే ఉంటా.. కవిత కీలక వ్యాఖ్యలు
ప్రభుత్వానికి విజ్ఞప్తి
రూ.6 వేల ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్ట్‌పై వందలాది రైతు కుటుంబాలు, సుమారు 180 ముదిరాజ్ కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని, కాబట్టి ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకొని, గతంలో ఇచ్చిన రూ. 70 కోట్ల జీవోను అమలు చేయాలని కోరారు. రాజకీయాలకు అతీతంగా రైతుల కోసం పనులు త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఎకరాకు రూ. 50 వేలు ఇవ్వాలి. మొంథా తుపాను కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అందరినీ ఆదుకోవాలి
ముఖ్యమంత్రి వరంగల్, ఖమ్మం రైతులకు మాత్రమే ఎకరాకు రూ. 10 వేలు ఇస్తామని ప్రకటించినట్లు తెలిసిందని, అయితే కేశపట్నం లో కూడా వరి రైతులు నష్టపోయారని, వారికి కూడా పరిహారం అందించాలని విజ్ఞప్తి చేశారు. చేతికొచ్చిన పంట నష్టపోయినందున, ఎకరాకు రూ. 10 వేలు కాకుండా రూ. 50 వేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పంట నష్టాన్ని అంచనా వేయడానికి కలెక్టర్ చొరవ తీసుకొని అధికారులను వెంటనే పొలాలకు పంపించాలని కోరారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా కేంద్రం తరఫున రైతులకు పంట నష్టం పరిహారం ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.
శ్రీవర్షిత మృతిపై స్పెషల్ ఎంక్వైరీ, సిట్ వేయాలి.
హుజురాబాద్ మండలం రాంపూర్ గ్రామనికి చెందిన విద్యార్థి,శ్రీవర్షిత వంగర లోని బీసీ రెసిడెన్షియల్ హాస్టల్‌లో అనుమానాస్పదంగా మృతి చెందిన శ్రీవర్షిత కుటుంబ సభ్యులను కవిత పరామర్శించారు. ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు (స్పెషల్ ఎంక్వైరీ), సిట్ (SIT) వేయాలని ఆమె డిమాండ్ చేశారు.
కుట్ర కోణం అనుమానం
శ్రీవర్షిత మరణాన్ని ప్రభుత్వం, పాఠశాల వర్గాలు ఆత్మహత్యగా చెబుతున్నాయని, అయితే చనిపోవడానికి గంట ముందు కూడా తమతో మాట్లాడిందని తల్లిదండ్రులు చెబుతున్నారని కవిత పేర్కొన్నారు. గంటన్నరలోనే సంఘటన జరిగిందని, టీచర్లు, పోలీసులు వివరాలు చెప్పకుండా, కనీసం అంబులెన్స్‌ను కూడా పిలిపించకుండా పంపించడంపై అనుమానం వ్యక్తం చేశారు. సంఘటన జరిగి 8 రోజులు గడిచినా ఏ ఒక్క పోలీస్, విద్యా శాఖ అధికారి, ఎమ్మార్వో కుటుంబ సభ్యులను పరామర్శించకపోవడం, వివరాలు చెప్పకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ సొంత నియోజకవర్గంలోనే ఇలా జరగడం దారుణమన్నారు.
పిల్లల మరణాలపై ఆవేదన
గత ఏడాదిన్నరలో రాష్ట్రంలోని వెల్ఫేర్ హాస్టల్స్‌లో 110 మంది పిల్లలు మృతి చెందినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలు పిట్టల్లా రాలిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని, పేద పిల్లలు చదువుకునే పాఠశాలలంటే ప్రభుత్వానికి పట్టింపు లేకుండా పోయిందని మండిపడ్డారు. చదువుల్లో ముందుండి, ఐఏఎస్, ఐపీఎస్ కావాలనే లక్ష్యం పెట్టుకున్న శ్రీవర్షిత మృతిపై ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, వాస్తవాలను వెల్లడి చేయాలని కోరారు. శ్రీవర్షిత కుటుంబానికి, అదేవిధంగా చనిపోయిన పిల్లల తల్లిదండ్రులకు న్యాయం జరిగే వరకు తెలంగాణ జాగృతి అండగా ఉంటుందని ప్రకటించారు.
Also Read: Kavitha: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై.. కవిత సంచలన వ్యాఖ్యలు

 Epaper
 Epaper  
			 
					 
					 
					 
					 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				