Cotton Crop: పత్తి పంట సాగు చేసిన రైతులు ప్రస్తుతం అంతులేని పరేషాన్‌లో కూరుకుపోయారు. రోజుల తరబడి ఏకధాటిగా కురుస్తున్న అధిక వర్షాల కారణంగా పత్తి(Cotton) పంట తీవ్రంగా దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందుగా కాసిన పత్తి కాయలన్నీ నల్లబడి పోవడమే కాక, విచ్చుకున్న పత్తి సైతం వర్షానికి తడిసిపోయి అందులో మొలకలు వస్తున్న దయనీయ పరిస్థితి దాపురించింది. వానల తాకిడికి తోడు తెల్ల దోమ, పచ్చ దోమ వంటి చీడపీడల వ్యాప్తి బాగా పెరిగిపోవడంతో ఈ దఫా కేవలం ఒక్కసారి మాత్రమే పంటను తీసుకునే పరిస్థితి ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీని ఫలితంగా మలి దశ పూత, కాత పూర్తిగా రాలిపోయి, తెగుళ్ల కారణంగా ఆకులపై నల్లని మచ్చలు ఏర్పడి ఆకులు ఎర్రబారి, పత్తి చెట్లు కృంగిపోతున్నాయి. మరో రెండు నెలలు పచ్చగా కళకళలాడాల్సిన పత్తి చెట్లు ప్రస్తుతం పండుటాకులతో వెలవెలబోతూ, ఆకు రాల్చి మోడులవుతున్నాయి. రైతులు సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టలేకపోవడంతో దిగుబడులపై తీవ్ర ప్రభావం పడుతుందని వాపోతున్నారు.
సగానికి పడిపోయేలా..
ప్రస్తుత ఖరీఫ్‌లో వర్షాలు అధికంగా పడడంతో జోగులాంబ గద్వాల జిల్లాలోని నల్ల రేగడి నేలల ప్రాంతాల్లో, అలాగే ఎర్రమట్టి(Red clay)లో సాగు చేసిన పత్తి దిగుబడులపై ఈ ప్రతికూల వాతావరణం ప్రభావం చూపింది. జిల్లాలో 1.87 లక్షల ఎకరాలలో పత్తి పంట సాగు చేస్తుండగా, ప్రస్తుత ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా దిగుబడులు సగానికి పడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాయలన్నీ నల్లబడి, పండిన పత్తి సైతం వర్షానికి తడిసి మసకబారుతోంది. పండిన పత్తిని తీయడానికి కూలీలు దొరకని పరిస్థితి కూడా ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
Also Read: Hyderabad Rains: భారీ వర్షంతో అధికారులను అప్రమత్తం చేసిన జలమండలి ఎండీ
కన్నీరు మున్నీరు
సాధారణంగా పత్తి పంటకు అడపాదడపా వర్షాలు కురిస్తే ఆరోగ్యంగా ఎదిగి ఆశించిన దిగుబడిని ఇస్తుంది. అయితే, ఈ సంవత్సరం జూన్, జూలై నెలలో తీవ్ర వర్షాభావం ఉండగా, ఆగ(August)స్టు, సెప్టెంబర్(Sep), అక్టోబర్(Oct) నెలల్లో కురిసిన ఎడతెరిపిలేని వర్షాల కారణంగా భూమిలో అధిక తేమ చేరింది. దీంతో పత్తి పంటకు వేరుకుళ్ళు, పారవిల్డ్ లాంటి తెగుళ్లు సోకి వేరు వ్యవస్థ దెబ్బతిని ఎదుగుదల పూర్తిగా నిలిచిపోయింది. దీనికి తోడు మెగ్నీషియం, జింక్, బోరాన్ వంటి సూక్ష్మ ధాతు లోపం ఏర్పడటం వల్ల పంట నాణ్యతపై తీవ్ర ప్రభావం చూపింది. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినప్పటికీ, పంటపై ఆశలు లేకపోవడంతో రైతులు ఎరువులు, పురుగు మందులు పిచికారి చేయడం ఆపేశారు. ఆశించిన స్థాయిలో దిగుబడులు రాకపోవడంతో కన్నీరు మున్నీరవుతున్న రైతులు, తదుపరి పంటను రబీలో వేసేందుకు సిద్ధమవుతున్నారు.
Also Read: Pawan Kalyan: ఏపీలో భారీగా పంట నష్టం.. పొలంబాట పట్టిన పవన్ కళ్యాణ్.. రైతన్నల కష్టంపై ఆరా!

 Epaper
 Epaper  
			 
					 
					 
					 
					 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				