Shadnagar Gurukulam: దళితుల సంక్షేమం కోసం స్థాపించిన గురుకుల కళాశాలలో.. దళిత విద్యార్థినుల కడుపు కొట్టి, మెస్ బియ్యంతోనూ వ్యాపారం చేస్తోంది ఆ ప్రిన్సిపాల్! తమకు కనీసం తినడానికి సరిపడా భోజనం పెట్టకుండా, లంచాలు డిమాండ్ చేస్తూ నిత్యం వేధిస్తున్న ప్రిన్సిపాల్ శైలజపై విద్యార్థినులు తిరగబడ్డారు. ‘మాకు ప్రిన్సిపాల్ వద్దు.. అక్రమాలకు పాల్పడే టీచర్ వద్దు’ అంటూ షాద్‌నగర్ రోడ్లపైకి వచ్చి విద్యార్థినులు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో పట్టణ కేంద్రంలో యుద్ధ వాతావరణం నెలకొంది. తమ ప్రిన్సిపాల్‌ను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తూ డిగ్రీ కళాశాల విద్యార్థినులు రోడ్డెక్కి మెరుపు ధర్నాకు దిగారు. ఇదంతా రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణ శివారులో నిర్వహిస్తున్న నాగర్ కర్నూల్ సాంఘిక సంక్షేమ ప్రభుత్వ గురుకులంలో జరిగింది.
Also Read: Waragal Gurukulam: గురుకుల ప్రవేశాల్లో నియమాల మాయం.. విద్యార్థులపై అన్యాయం ఎవరి బాధ్యత?
మా పేదోళ్ల పొట్ట కొట్టి..!
కళాశాల ప్రిన్సిపాల్ శైలజపై విద్యార్థినులు తీవ్ర ఆరోపణలు చేశారు. తాను దళితురాలినంటూ గ్రూప్ వన్ అధికారిగా చలామణి అవుతున్న ప్రిన్సిపాల్‌కు మానవత్వం లేదని, తాము కూడా దళిత విద్యార్థులమేనని వాపోయారు. సుమారు 500 మంది విద్యార్థినులకు కేవలం 20 కేజీల మటన్ వస్తే, అందులో కొంత ప్రిన్సిపాల్ తానే ఉంచుకొని చాలీచాలని భోజనం పెడుతున్నారని విమర్శించారు. మెస్ సరుకులు కూడా మూటకట్టి తరలిస్తున్నారని, అందుకు ఆధారాలు తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. ‘మా పేదోళ్ల పొట్ట కొట్టి ఆమె కడుపు నింపుకుంటున్నది. అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ప్రిన్సిపాల్‌ను వెంటనే సస్పెండ్ చేయాలి’ అని విద్యార్థినులు డిమాండ్ చేశారు.
పరీక్షకు 10 వేలు, టీసీకి 5 వేలు!
ప్రిన్సిపాల్ శైలజ ఫీజుల విషయంలోనూ, ఇతర అంశాల్లోనూ అక్రమాలకు పాల్పడుతున్నారని విద్యార్థినులు ఆరోపించారు. వివాహం జరిగిన విద్యార్థులు పరీక్షలు రాయాలంటే రూ.10వేలు లంచం తీసుకుంటున్నారని, అలాగే టీసీ తీసుకోవడానికి రూ.3వేలు నుంచి రూ.5వేలు వరకు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. ఈ అక్రమాలకు మిగతా లెక్చరర్‌లు కూడా తోడుగా ఉంటూ, వారి ద్వారా డబ్బులు వేయించుకొని శైలజ తెలివిగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. డబ్బుల కోసం తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని, అన్ని ఆధారాలు ఉన్నా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కానిస్టేబుల్‌పై తిరుగుబాటు
ప్రిన్సిపాల్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ షాద్‌నగర్ చౌరస్తాలో విద్యార్థినులు చేస్తున్న ధర్నా కాస్తా ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళనను విరమింపజేయడానికి పోలీసులు బలవంతంగా వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో, ఓ మహిళా కానిస్టేబుల్ విద్యార్థినిపై చెయ్యిచేసుకోవడం చూసి ఆగ్రహించిన తోటి విద్యార్థినులు ఆమెపై తిరగబడ్డారు. ఆ మహిళా కానిస్టేబుల్ జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లారు. ‘న్యాయం కోసం రోడ్డుపైకి వస్తే మమ్మల్ని కొడతారా?’ అంటూ విద్యార్థినులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు కొందరు విద్యార్థినులను బలవంతంగా వాహనంలోకి ఎక్కించి తరలించారు.
గతంలో సస్పెండ్ అయినా..
ప్రిన్సిపాల్ శైలజ తీరు వివాదాస్పదంగా మారడం ఇది తొలిసారి కాదు. ఏడాది క్రితం సూర్యాపేట గురుకుల పాఠశాలలో పనిచేస్తున్నప్పుడు ఆమె గదిలో మద్యం సీసాలు దొరికాయని విద్యార్థినులు ఆందోళన చేయడంతో ఉన్నతాధికారులు ఆమెను సస్పెండ్ చేశారు. ఆ తర్వాత షాద్‌నగర్ గురుకుల కళాశాలకు బదిలీపై వచ్చారు. ఇప్పుడు లంచాలు, అవినీతి ఆరోపణలతో మరోసారి ఆమె తీరు చర్చనీయాంశమైంది.
Also Read: Warangal Gurukulam: గురుకులంలో పదవ తరగతి విద్యార్థి ఆత్మహత్య.. అధికారాల తీరుపై స్థానికుల ఆగ్రహం!
