Adwait Kumar Singh: జిల్లా బ్యాంకర్లు, అధికారులు సమన్వయంతో పనిచేసి, రుణాల పంపిణీలో నిర్దేశిత లక్ష్యాలను పూర్తి స్థాయిలో, పక్కా ప్రణాళికతో సాధించాలని జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్ (Adwait Kumar Singh) సూచించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన జిల్లా స్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ త్రైమాసిక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో జిల్లా లక్ష్యాలు, ఇప్పటివరకు సాధించిన ప్రగతి, రాబోయే సీజన్లో రైతాంగానికి అందించాల్సిన పంట రుణాల అంశాలపై ఆయా బ్యాంకుల వారీగా సమీక్షించారు.
43.91 శాతం లక్ష్యాలను పూర్తి
రుణాల పంపిణీలో పంట, హార్టికల్చర్, సెరికల్చర్, ముద్ర, ఎస్సీ/ఎస్టీ కార్పొరేషన్, పీఎంఈజీపీ, స్వయం సహాయక బృందాల లింకేజ్, పీఎం స్వనిధి వంటి రుణాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ఇప్పటివరకు సాధించిన లక్ష్యాల పురోగతిని సమీక్షిస్తూ పీఎం స్వనిధి కింద 99.53 శాతం, అగ్రికల్చర్ టర్మ్ లోన్స్ 57.96 శాతం, స్వయం సహాయక సంఘాల రుణాలు 47.99 శాతం, మరియు క్రాఫ్ లోన్స్ (పంట రుణాలు) 43.91 శాతం లక్ష్యాలను పూర్తి చేశారన్నారు. పంట రుణాల లక్ష్యాన్ని పూర్తి స్థాయిలో సాధించేందుకు బ్యాంకర్లు చొరవ చూపాలని, రుణ పంపిణీ లక్ష్యాన్ని అధిగమించాలని కలెక్టర్ కోరారు. కొన్ని బ్యాంకులు లక్ష్యానికి అనుగుణంగా రుణాలు అందిస్తుండగా, మరికొన్ని బ్యాంకులు వెనుకబడి ఉండటంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. క్రమం తప్పకుండా సమీక్షలు జరుపుతూ, వంద శాతం లక్ష్యాల సాధనకు కృషి చేయాలని సూచించారు.
స్వయం ఉపాధికి చేయూత నివ్వాలి
గ్రామీణ ప్రాంత ప్రజలకు బ్యాంకింగ్ సేవలను సమర్థవంతంగా అందించాలని కలెక్టర్ తెలిపారు. వ్యవసాయ శాఖతో పాటు పశు సంవర్ధక, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ తదితర శాఖలతో సమన్వయం చేసుకుని, ప్రభుత్వ పథకాల కింద ఎంపికైన లబ్ధిదారులకు సకాలంలో రుణాలు అందించి స్వయం ఉపాధికి చేయూతనివ్వాలన్నారు. రుణాలు తీసుకున్నవారు యూనిట్లు స్థాపించారా లేదా అన్నది నిశితంగా పరిశీలించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. స్వయం సహాయక సంఘాలకు పూర్తి స్థాయిలో లింకేజీ రుణాలు పంపిణీ చేయాలని, సబ్సిడీ రుణాల పంపిణీలో జాప్యం చేయవద్దని సూచించారు. వీధి వ్యాపారులకు విరివిగా ముద్ర రుణాలతో పాటు స్టాండ్ అప్ ఇండియా కింద రుణాలు అందించాలన్నారు.
క్షేత్రస్థాయిలో ప్రణాళికా ప్రకారం చర్యలు
కూరగాయల పంటల విభాగానికి చెందిన రుణాలను త్వరగా రైతులకు అందించేందుకు క్షేత్రస్థాయిలో ప్రణాళికా ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కే అనిల్ కుమార్, ఆర్బీఐ ఎల్డీఓ డిబోజిత్ బారువ, డీఆర్డీఓ మధుసూదన రాజు, లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ కే యాదగిరి, నాబార్డు ఏజీఎం చైతన్య రవి, డీఏఓ విజయనిర్మల, డీవీహెచ్ఓ డాక్టర్ కిరణ్ కుమార్, డీహెచ్ఓ జీ మరియాన్న, మెప్మా పీడీ విజయ, ట్రైబల్ వెల్ఫేర్ దేశి రామ్ నాయక్, జిల్లా పరిశ్రమల కేంద్రం మేనేజర్ శ్రీమన్నారాయణ రెడ్డి, యుబీఐ డీజీఎం కమలాకర్, డీసీసీబీ బీ కృష్ణమోహన్, సీఎఫ్ఎల్ కౌన్సిలర్స్ షరీఫ్, వేణు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, బ్యాంకర్లు పాల్గొన్నారు.
Also Read: Economics Nobel: ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్.. వారు చేసిన అద్భుత కృషి ఏంటంటే?

