Chimpanzee: సాధారణంగా మద్యం అనగానే మానవులే గుర్తుకు వస్తారు. వీకెండ్ పార్టీలు, ఫ్రెండ్స్ బర్డ్ డేలు, ఫ్యామిలీ ఫంక్షన్లు ఇలా ఏదోక కారణంతో చాలా మంది మద్యం సేవిస్తూనే ఉంటారు. అయితే జంతువులు కూడా మద్యం సేవిస్తాయని మీకు తెలుసా? అది కూడా రోజూ రెండు కాక్ టెయిల్స్ లో ఉండేంత ఆల్కహాల్ ఓ జీవి లేపేస్తోందని ఎప్పుడైనా ఊహించారా?. కానీ ఇది అక్షరాల నిజమని తాజా అధ్యయనం వెల్లడించింది. చిపాంజీలపై నిర్వహించిన లేటెస్ట్ స్టడీ.. షాకింగ్ నిజాలను ప్రపంచానికి తెలిసేలా చేసింది.
వివరాల్లోకి వెళ్తే..
ఉగాండాలోని కిబాలే నేషనల్ పార్క్ (Kibale National Park), ఐవరీ కోస్ట్‌లోని తై నేషనల్ పార్క్ (Tai National Park) లో గల చింపాజీలపై కాలిఫోర్నియా యూనివర్సిటీ (University of California) జంతు శాస్త్ర నిపుణులు పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనల్లో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. చింపాంజీలు పండిన పండ్లు తింటున్నప్పుడు సహజంగానే వాటి నుంచి రోజుకు 14 గ్రాముల ఇథనాల్ (ఆల్కహాల్) ను పొందుతున్నాయని పరిశోధకులు గుర్తించారు. ఇది రెండు కాక్ టెయిల్ లో ఉండే ఆల్కహాల్ కంటెంట్ కు సమానమని పేర్కొన్నారు.
చింపాజీలపై ఆల్కహాల్ ప్రభావం
చింపాజీలు తింటున్న పండ్లలో ఉండే ఈస్ట్ కారణంగా వాటిలో సహజనంగానే ఆల్కహాల్ ఉత్పత్తి అవుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. పరీక్షించిన పండ్లలో సగటున ఆల్కహాల్ కంటెంట్ 0.3% గా ఉండగా కొన్నింటిలో 0.61% ABV వరకు చేరిందని తెలపారు. మరి చింపాజీలు మత్తుగా తిరుగుతున్నాయేమో అన్న సందేహంతో పరిశీలించగా.. వాటిలో అలాంటి లక్షణాలు ఏమి కనిపించలేదని తెలిపారు. అవి పండ్లను ఒకేసారి కాకుండా గ్యాప్ ఇచ్చి తినడం వల్ల చింపాజీలపై ఆల్కహాల్ ప్రభావం కనిపించలేదని స్పష్టం చేశారు. అంతేకాదు పండ్లను తోటి వాటితో పంచుకొని చింపాజీలు తినడాన్ని తాము గుర్తించామని పేర్కొన్నారు. ఇవి వాటి దృఢమైన సామాజిక బంధాన్ని తెలియజేస్తున్నాయని వివరించారు.
పండ్ల తిన్నప్పుడు రెట్టింపు ఉత్సాహాం
పరిశోధనలో భాగమైన కాలిఫోర్నియా యూనివర్సిటీ డాక్టరేట్ విద్యార్థి అలెక్సీ మాట్లాడుతూ ‘ఈ స్థాయి మద్యాన్ని సేవించడం చింపాంజీల ప్రవర్తనపై ఎంత ప్రభావం చూపుతుందో చెప్పడం కష్టం. అయితే పండ్ల సమృద్ధి ఉన్నప్పుడు అవి చేసే ప్రాంతీయ పహారా, వేటల సంఖ్య పెరుగుతోంది. కాబట్టి ఎక్కువ పండ్లు త్వరగా దొరికినప్పుడు వాటిలోని ఇథనాల్ కూడా వాటి ప్రవర్తనలో భాగమై ఉండవచ్చు’ అని అన్నారు.
Also Read: MD Ashok Reddy: హాట్ స్పాట్లపై ప్రత్యేక దృష్టి.. వాటర్ క్వాలిటీ చెక్ చేయాలి జలమండలి ఆదేశం
డ్రంకెన్ మంకీ సిద్దాంతంతో లింకప్..
కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు జరిపిన తాజా అధ్యయనం.. ప్రసిద్ధ ‘డ్రంకెన్ మంకీ సిద్ధాంతం’ను బలపరుస్తోంది. మద్యం పట్ల మనుషుల ఆకర్షణకు గల మూలాలు.. కోతిగా ఉన్నప్పుడు నుంచే ఉన్నట్లు తెలియజేస్తోంది. అచ్చం మనుషుల్లో ఉన్నట్లే చింపాజీల్లోనూ మద్యాన్ని విచ్చిన్నం చేసే జీర్ణ వ్యవస్థ ఉన్నట్లు డ్రంకెన్ మంకీ సిద్దాంతం తెలియజేస్తోంది. చింపాజీల నుంచి సేకరించిన మూత్రం ఆధారంగా ఈ విషయం వెల్లడైందని శాస్త్రవేత్తలు తెలిపారు. చింపాజీలు పండ్లు పంచుకోవడం చూస్తే.. మనుషులలో ఉన్న సామూహిక విందులు, పానీయాల సంస్కృతిని పోలి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.