Indian Railways: దేశంలోని అతిపెద్ద రవాణా నెట్ వర్క్ లో రైల్వేలు (Indian Railways) ఒకటి. అడవులు, పర్వతాలు, నదులు, కొండలు, లోయల గుండా నిత్యం వందలాది రైళ్లు ప్రయాణిస్తుంటాయి. అయితే అటవీ మార్గానికి వచ్చే సరికి కొన్నిసార్లు అనుకోని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఏనుగులు, పులులు తదితర వన్యప్రాణాలు.. కొన్ని సందర్భాల్లో ట్రాకులపైకి వచ్చి ప్రమాదానికి గురవుతున్నాయి. దేశంలోని ఏదోక మూలన ఇలాంటి ఘటనలు తరుచూ జరుగుతున్న నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తమైంది. ఏఐతో పనిచేసే కెమెరాల ద్వారా ఈ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు సిద్ధమైంది.
ఏఐ ఆధారిత కెమెరాలు..
ఏనుగులు, సింహాలు, పులులు వంటి వన్యప్రాణ జంతువుల కదలికలను గుర్తించేందుకు ఏఐ ఆధారిత కెమెరాలను వినియోగించాని రైల్వేశాఖ నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా కసరత్తు సైతం ప్రారంభించింది. వన్యప్రాణులు పట్టాలపై ఉన్నప్పుడు లేదా ట్రాక్ సమీపంలో వచ్చినప్పుడు ఈ ఏఐ కెమెరాలు గుర్తించి.. లోకోపైలెట్ కు వెంటనే సమాచారం అందించేలా రైల్వే శాఖ వాటిని అభివృద్ధి చేస్తోంది. 500 మీటర్ల దూరం నుంచే జంతువుల కదలికలు గుర్తించేలా ఈ అధునాతన కెమెరాలను సంసిద్ధం చేస్తోంది.
అక్టోబర్ నుంచే..
ఏనుగులు, పులుల కారిడార్ తో పాటు అటవీ ప్రాంతం గుండా వెళ్లే రైళ్లకు ఈ ఏఐ ఆధారిత కెమెరాలను అమర్చాలని రైల్వే శాఖ భావిస్తోంది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సైతం గత గురువారం ఈ ఏఐ కెమెరాల గురించి ప్రస్తావించారు. ప్రస్తుతం ఇవి అభివృద్ధి దశలో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. పూర్తిగా అభివృద్ధి చేసిన తర్వాత వాటిని లోకోమోటివ్ (రైలు ఇంజిన్) పై భాగంలో అమర్చనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. అక్టోబర్ నాటికి ఈ ఏఐ ఆధారిత కెమెరాలు అందుబాటులోకి రావొచ్చని అశ్విని వైష్ణవ్ అంచనా వేశారు.
Also Read: Phone Tapping Case: సుప్రీంకోర్టులో హరీశ్ రావుకు ఊరట.. తెలంగాణ ప్రభుత్వ పిటిషన్ కొట్టివేత
ఆప్టికల్ ఫైబర్ కేబుల్
కాగా వన్యప్రాణుల కదలికలను గుర్తిచేందుకు ఇప్పటికే ఆప్టికల్ ఫైబర్ కేబుల్ (OFC) వ్యవస్థను రైల్వే శాఖ వినియోగిస్తోంది. ఏనుగులు, పులుల క్యారిడార్ల గుండా వెళ్లే రైల్వే ట్రాకుల వద్ద వీటిని ఏర్పాటు చేశారు. పట్టాలపై జంతువుల కదలికలు గుర్తించిన వెంటనే ఆ మార్గం గుండా వెళ్లే రైళ్లకు దూరం నుంచే సిగ్నల్స్ వెళ్తాయి. దీంతో లోకోపైలెట్ వెంటనే అప్రమత్తమై.. వన్యప్రాణులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్త పడేందుకు వీలు కలుగుతుంది. అయితే ఈ వ్యవస్థను మరింత సమర్థవంతంగా అమలు చేసే ఉద్దేశంతో ఏఐ కెమెరాలను అందుబాటులోకి తీసుకురావాలని రైల్వేశాఖ నిర్ణయించడం విశేషం.

