Trump on India: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోమారు భారత్ ను సుంకాల పేరుతో హెచ్చరించారు. రష్యా చమురు విషయంలో భారత్ తమ తీరు మార్చుకోకుంటే త్వరలో మరిన్ని ప్రతీకార సుంకాలు విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు. తాను సంతోషంగా లేనన్న విషయం భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)కి బాగా తెలుసని ట్రంప్ అన్నారు. తనను సంతోష పెట్టాలని దిల్లీ ప్రభుత్వం కూడా చూస్తున్నట్లు చెప్పారు. అయితే ఇది అత్యంత ముఖ్యమని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ట్రంప్ ఇంకా ఏమన్నారంటే?
వెనుజులా అధ్యక్షుడు మదురో విషయంలో తర్వాత చేపట్టబోయే అంశాలపై ట్రంప్ తాజాగా బహిరంగ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా భారత్ పై ప్రతీకార పన్నులు విధించే అంశంపై ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ చాలా మంది వ్యక్తి. నేను సంతోషంగా లేనన్న విషయం ఆయనకు తెలుసు. నన్ను సంతోషపెట్టడం ముఖ్యం. వారు రష్యాతో చమురు వ్యాపారం కొనసాగిస్తే మేం త్వరలో వారిపై సుంకాలను పెంచవచ్చు’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. రష్యా చమురు అంశంపై భారత్ సహాయం చేయకుంటే ఆ దేశంపై కఠిన వైఖరి అవలంభించాల్సి ఉంటుందని ట్రంప్ మరోమారు హెచ్చరించారు.
వాణిజ్య ఒప్పందంపై చర్చలు
అయితే రష్యా నుంచి చమురు కొనుగోలు.. దేశీయ ఇంధన భద్రతకు చాలా అవసరమని భారత్ సమర్థించుకుంటోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం అమెరికా – భారత్ మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు సాగుతున్నాయి. వాణిజ్య ప్రతిష్టంభనకు చెక్ పెట్టేలా వాషింగ్టన్ – న్యూ దిల్లీ కృషి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ట్రంప్ మరోమారు టారిఫ్ హెచ్చరికలు జారీ చేయడం చర్చకు తావిస్తోంది. ఇప్పటికే భారత్ నుంచి అమెరికాకు దిగుమతయ్యే వస్తువులపై 50 శాతం అదనపు సుంకాలను ట్రంప్ విధించారు. ఆ ప్రభావం భారత ఎగుమతులపై కూడా పడింది.
Also Read: Allu Arjun: బన్నీకి చేదు అనుభవం.. సెల్ఫీల కోసం ఎగబడ్డ ఫ్యాన్స్.. భార్యతో వచ్చి ఉక్కిరిబిక్కిరి!
భారత్ పట్ల విచిత్ర వైఖరి..
భారత్ తో వాణిజ్య చర్చలు కొనసాగుతున్న వేళ.. ఇటీవలే దేశంలోని అమెరికా రాయబార కార్యాలయం తన ఎక్స్ ఖాతాలో ఆసక్తికర పోస్టు పెట్టింది. అందులో భారత దేశాన్ని, ప్రధాని మోదీని ట్రంప్ ఉటంకిస్తూ చేసిన వ్యాఖ్యలను పొందుపరిచింది. భారత్ ఒక అద్భుత దేశంగా మోదీ అభివర్ణించారని, ప్రధాని మోదీ గొప్ప స్నేహితుడని కొనియాడారని పేర్కొంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అమెరికాకు భారత్ వ్యూహాత్మక భాగస్వామి అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేసింది. అయితే ఓ వైపు భారదేశాన్ని, మోదీని పొగుతూనే ట్రంప్.. వరుసగా హెచ్చరికలు జారీ చేస్తుండటం అర్థంకానీ అంశంగా మారిపోయింది.

