IRCTC New Feature: ప్రయాణికులకు భారతీయ రైల్వే సంస్థ (Indian Railways) మరో శుభవార్త చెప్పింది. ఐర్‌సీటీసీ (IRCTC) ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్‌లో ఒక కొత్త సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఆధార్‌తో లింకప్ అయిన వినియోగదారులకు అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ (ARP) సమయంలో అధిక ప్రాధాన్యత లభించనుంది. త్వరితగతిన టికెట్ బుకింగ్ చేసుకునే సౌకర్యం కలగనుంది. IRCTC ఖాతాను ఆధార్‌తో లింకప్ చేసిన ప్రయాణికులకు రిజర్వేషన్లు ప్రారంభమైన వెంటనే ముందుగా యాక్సెస్ లభించనుంది.
కొత్త అప్డేట్‌తో ఏంటీ ప్రయోజనం?
IRCTC ఖాతాను ఆధార్ లింకప్ చేసిన వినియోగదారులకు మాత్రమే తాజా అప్డేట్ తో ప్రయోజనం చేకూరనుంది. సాధారణంగా దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్ల టికెట్లను 120 రోజుల ముందుగానే అందుబాటులోకి తీసుకొస్తారు. ఈ సమయంలో ఆధార్‌తో ధృవీకరించిన వినియోగదారులు అధిక ప్రాధాన్యతతో బుకింగ్ సర్వర్‌లను యాక్సెస్ చేయగలుగుతారు. దీనివల్ల టికెట్ బుకింగ్ లో జాప్యం తగ్గి.. కన్ఫర్మ్ సీట్లు లేదా బెర్త్‌లు దక్కే అవకాశాలు మెరుగవుతాయి. ఈ ప్రయోజనాన్ని IRCTC వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా పొందవచ్చు. రైలులోని జనరల్, స్లీపర్, రిజర్వ్‌డ్ క్లాసుల టికెట్లను వినియోగదారులు బుక్ చేసుకోవచ్చు.
మార్పునకు కారణం?
IRCTCలో తాజా అప్డేట్ ను తీసుకొని రావడానికి బలమైన కారణమే ఉంది. అడ్వాన్స్ రిజర్వేషన్ ప్రక్రియ ప్రారంభమైన వెంటనే ప్రయాణికుల నుంచి తీవ్ర పోటీ ఉంటోంది. టికెట్లు ఓపెన్ అయిన వెంటనే బుక్ చేసుకునేందుకు వినియోగదారులు ఎగబడుతుంటారు. దీంతో IRCTC పోర్టల్ పై తీవ్రమైన ఒత్తిడి పడుతున్నట్లు రైల్వే వర్గాలు గుర్తించాయి. దీనివల్ల సర్వర్ నెమ్మదిగా పనిచేయడం లేదా కొన్నిసార్లు ఆగిపోవడం వంటివి జరుగుతున్నట్లు తేలింది. ఈ కారణం చేత IRCTCపై ఒత్తిడి తగ్గించడంతో పాటు జెన్యూస్ ప్రయాణికుడికి మేలు కలిగేలా కొత్త ఫీచర్ ను రైల్వే శాఖ తీసుకొచ్చింది.
త్వరితగతిన బుకింగ్..
ఆధార్ లింకప్ చేసిన ప్రయాణికులకే తొలుత బుకింగ్ యాక్సిస్ లభించనుండటంతో ప్రయాణికులు వేగంగా తమ టికెట్లను బుకింగ్ చేసుకోవడానికి వీలు కలుగుతుంది. అదే సమయంలో నకిలీ లేదా మోసపూరిత ఖాతాలను నియంత్రించే అవకాశం ఏర్పడుతుంది. వినియోగదారులకు టికెట్ కన్ఫర్మేషన్ ఛాన్స్ రెట్టింపు అవుతుంది. టికెట్ బుకింగ్ కు అధిక డిమాండ్ ఉన్న ARP సమయంలో ధృవీకరించిన వినియోగదారులకు మెరుగైన అవకాశాలు లభిస్తాయి.
Also Read: Dangerous Roads India: వణుకు పుట్టించే మార్గాలు.. బండి ఉంటే సరిపోదు.. గట్స్ కూడా ఉండాల్సిందే!
ఆధార్‌ను ఎలా లింక్ చేయాలి?
IRCTC ఖాతాకు తమ ఆధార్ ను లింకప్ చేయని వినియోగదారులు ఈ కింది స్టెప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం ముందుగా రిజిస్టర్డ్ వివరాలతో IRCTC వెబ్ లేదా యాప్ లో లాగిన్ అవ్వాలి. తర్వాత ప్రొఫైల్ సెట్టింగ్స్ విభాగానికి వెళ్లి ఆధార్ నెంబర్ ను నమోదు చేయాలి. అప్పుడు ఆధార్ కు ఇచ్చిన రిజిస్టర్ మెుబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. దానిని నమోదు చేయడం ద్వారా మీ ఆధార్ ధ్రువీకరణ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. తద్వారా ARP సమయంలో ముందుగా బుకింగ్ యాక్సెస్ ను పొందవచ్చు.

