Delhi Mall: దేశ రాజధాని దిల్లీలోని మూతపడ్డ మాల్ లోకి వెళ్లిన విద్యార్థుల్లో ఒకరు అనుమానస్పదంగా మృతి చెందారు. మోడల్ టౌన్ ప్రాంతంలోని ఈ మాల్.. గత కొన్నేళ్లుగా మూసివేసి ఉంది. ఈ నేపథ్యంలో మాల్ లో రీల్స్ చేయాలని భావించిన ముగ్గురు స్నేహితులు లోపలికి ప్రవేశించారు. లోపల వీడియోలు చిత్రీకరిస్తున్న క్రమంలో 60 అడుగుల ఎత్తు నుంచి 16 ఏళ్ల టీనేజర్ కిందపడ్డాడు. తీవ్ర గాయాలపాలై ప్రాణాలు కోల్పోయాడు. బాలుడి కుటుంబం ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేయడంతో దిల్లీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
వివరాల్లోకి వెళ్తే..
మృతి చెందిన టీనేజర్ ను 16 ఏళ్ల కవిన్ కుమార్ (Kavin Kumar)గా పోలీసులు పేర్కొన్నారు. అతడు దిల్లీలోని అశోక్ విహార్ లో గల ఓ ప్రైవేటు స్కూల్లో 11వ తరగతి చదువుకుంటున్నట్లు పేర్కొన్నారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం కవిన్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి మూతపడ్డ మాల్ లోకి ప్రవేశించాడు. వీడియోలు తీయడానికి మాల్ లోని నాలుగో అంతస్తుకు మెట్ల మార్గంలో చేరుకున్నాడు. ఈ క్రమంలో షాపుల మధ్య గ్యాలరీ కవర్ గా అమర్చిన ఫైబర్ గ్లాస్ షెడ్ పైకి కవిన్ ఎక్కాడని పోలీసులు తెలిపారు. ఆ షెడ్ ఒక్కసారిగా కూలిపోవడంతో కిందపడి తీవ్రంగా గాయపడ్డారని పేర్కొన్నారు. వెంటనే అతడ్ని సమీపంలోని పెంటామెడ్ ఆస్పత్రికి తరలించగా.. అక్కడికి చేరుకున్న వెంటనే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
స్నేహితులపై అనుమానాలు
టీనేజర్ అనుమానస్పద మృతిపై మరో అధికారి మాట్లాడుతూ.. వారంతా రీల్స్ తీయడం కోసమే మాల్ లోకి ప్రవేశించినట్లు ధ్రువీకరించారు. కవిన్ పడిపోవడానికి ముందు తీసిన వీడియోలను అతడి స్నేహితులు తమకు చూపించినట్లు చెప్పారు. అయితే కవిన్ కుటుంబం మాత్రం అతడి స్నేహితుల ప్రవర్తనపై అనుమానాలు వ్యక్తం చేస్తోంది. కవిన్ బంధువు సుధీర్ కుమార్ మాట్లాడుతూ ఆదివారం సాయంత్రం 5.30 గంటల సమయంలో కవిన్ ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు చెప్పారు. స్నేహితులతో కలిసి బిలియర్డ్స్ ఆడటానికి వెళ్తున్నానని తల్లికి చెప్పినట్లు పేర్కొన్నారు. అరగంట తర్వాత కవిన్ తల్లికి ఫోన్ వచ్చిందని పేర్కొన్నారు. ప్రమాద విషయాన్ని కుటుంబానికి తెలియజేయడానికి ముందే స్కూల్ గ్రూప్ లో ఈ విషయం వ్యాపించిందని కవిన్ బంధువు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Sikkim Sundari: అంతుచిక్కని రహస్యం.. రాతి నుంచి పుట్టుకొచ్చే.. అరుదైన హిమాలయ పువ్వు!
2012 నుంచి మూతపడ్డ మాల్
కవిన్ మరో బంధువు మునీత్ కుమార్ మాట్లాడుతూ.. అతడు కూడా స్నేహితులపై అనుమానం వ్యక్తం చేశారు. కవిన్ కు వారు సవాల్ విసిరి ఉండొచ్చని పేర్కొన్నారు. అందుకే అతడు ప్రమాదకరమైన షెడ్ పై నడవడానికి ప్రయత్నించి ఉండొచ్చని అంచనా వేశారు. కాగా 2012 నుంచి మూతపడి ఉన్న మాల్ లోకి పిల్లలు ఎలా ప్రవేశించగలిగారని మాల్ యాజమాన్యాన్ని సైతం బాధిత కుటుంబం ప్రశ్నించింది. ప్రజలు లోపలికి రాకుండా ప్రవేశ ద్వారాలను పూర్తిగా మూసి ఉంచాల్సిందని పేర్కొన్నారు. మెుత్తంగా బాధిత కుటుంబం ఆరోపణలను సైతం పరిగణలోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

