Sikkim Sundari: తూర్పు హిమాలయ ప్రాంతాల్లోని అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఓ అరుదైన మెుక్క పెరుగుతోంది. ఈశాన్య రాష్ట్రమైన సిక్కింలోని హిమాలయ ప్రాంతాల్లో మాత్రమే ఈ అతి పురాతన పుష్పం దర్శనమిస్తుందని స్థానికులు చెబుతున్నారు. దీనిని ‘సిక్కిం సుందరి’గా పిలుచుకుంటామని పేర్కొంటున్నారు. అయితే శాస్త్రీయంగా ఈ మెుక్కను రియం నోబిలే (Rheum nobile) అని కూడా పిలుస్తారు. సిక్కింలో దాగున్న అంతుచిక్కని రహస్యాల్లో ఈ మెుక్క కూడా ఒకటని అక్కడి ప్రజలు చెబుతున్నారు.
గాజులా మెరిసే పత్రాలు..
సిక్కిం సుందరి మెుక్క గురించి ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మెుక్కను సహనానికి ఒక్క గొప్ప పాఠంగా అభివర్ణించారు. కొందరు పర్యాటకులు ఆ మెుక్క పెరుగుతున్న ప్రాంతాలను దర్శించిన వీడియోను ఆయన పంచుకున్నారు. దీంతో సిక్కిం సుందరి మెుక్క గురించి ఒక్కసారిగా చర్చ మెుదలైంది. కాగా సముద్ర మట్టానికి 4,000-4,800 మీటర్ల ఎత్తులో ఈ మెుక్క పెరుగుతుంటుంది. గ్లాస్ హౌస్ మెుక్కలుగా పిలువబడే ఆసక్తికరమైన జాతికి ఈ అరుదైన పుష్పం చెందింది. హిమాలయ పువ్వును కప్పుతూ ఉండే పత్రాలు గాజు తరహాలో పారదర్శకంగా ఉంటాయి. సహజ గ్రీన్ హౌస్ లా పనిచేస్తూ లోపల ఉన్న సున్నితమైన పువ్వులను తీవ్రమైన చలి గాలులు, యూవీ కిరణాల నుంచి రక్షిస్తాయి. అయితే అత్యంత కఠినమైన రాతి, మంచు నేలపై ఈ పుష్పాలు పెరుగుతుండటం విశేషం. సుందరమైన హిమాలయ ప్రాంతాల్లో గోపురం తరహాలో మెరుస్తూ కనిపించే ఈ అరుదైన పుష్పాలు చూపరులను కట్టిపడేస్తాయి.
I knew nothing about this extraordinary marvel: the ‘Sikkim Sundari’
Thriving at staggering altitudes of 4,000–4,800 meters, this "Glasshouse Plant" stands like a glowing tower against the mountains.
Its life is a masterclass in patience.
It is monocarpic, which means that… pic.twitter.com/keoMSmGcUl
— anand mahindra (@anandmahindra) December 21, 2025
ప్రత్యేక జీవన చక్రం..
ఈ అరుదైన పుష్పాన్ని మోనోకార్పిప్ మెుక్క అని కూడా పిలుస్తుంటారు. ఇది జీవిత కాలంలో ఒకసారి మాత్రమే పుష్పిస్తుంది. ఒక మెుక్క పుష్పించడానికి 7 నుంచి 30 సంవత్సరాలు పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అత్యంత కఠినమైన పర్వత ప్రాంత పరిస్థితులను తట్టుకొని.. నెమ్మదిగా తన శక్తిని ఈ మెుక్క కూడగట్టుకుందని పేర్కొంటున్నారు. అలా రెండు మీటర్ల ఎత్తు వరకూ ఎదిగి.. పుష్పిస్తుందని చెబుతున్నారు. అలా తన విత్తనాలను చుట్టుపక్కల ప్రాంతాల్లో చల్లి.. ఆపై మెుక్క మరణిస్తుందని స్పష్టం చేస్తున్నారు. ఇదే విషయాన్ని ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర సైతం తన సోషల్ మీడియా పోస్టులో వివరించారు.
హిమనీ నదాల సమీపంలో..
ఈ అరుదైన మెుక్క నార్త్ సిక్కింలోని ఎత్తైన ట్రెక్కింగ్ మార్గాల వెంట దర్శనమిస్తుంది. ముఖ్యంగా ఆల్పైన్ పాస్‌లు, హిమనీ నది లోయల దగ్గర ఇవి పెరుగుతుంటాయి. అత్యంత కఠినమైన వాతావరణాల్లో పెరగడం వల్ల దీన్ని ఎలాంటి భద్రతా ప్రమాణాలు లేకుండా చూడటం కష్టం. అందుకే ట్రెక్కింగ్ చేసే వారు, అరుదైన వాటిని అన్వేషించే బృందాలకు మాత్రమే ఈ సిక్కిం సుందరి దర్శనమిస్తుంటుంది.
Also Read: Baba Vangas 2026 Prediction: 2026లో ఈ రాశుల వారి బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం పక్కా అంటున్న బాబా వంగా.. మీ రాశి ఉందా?
ఔషద గుణాల నిధి..
ఈ అరుదైన మెుక్క.. అందంగా ఉండటమే కాకుండా ఔషధ గుణాలను సైతం కలిగి ఉందని స్థానికులు చెబుతున్నారు. సంప్రదాయ హిమాలయ వైద్య పరిజ్ఞానంలో రియం నోబిలేకు ప్రత్యేక స్థానముందని స్పష్టం చేస్తున్నారు. ఒకప్పుడు తరుచూగా కనిపించే ఈ మెుక్క.. ప్రస్తుతం చాలా అరుదుగా మారిందని చెబుతున్నారు. అందుకే దీనిని చూడటానికి తప్ప వినియోగించడానికి వీల్లేకుండా స్థానికంగా ఆంక్షలు అమల్లో ఉన్నాయని పేర్కొన్నారు. అయితే మెుక్కకు ఉండే గాజు లాంటి పత్రాలు.. చల్లని గాలులకు కదులుతూ శబ్దాలు చేస్తాయని స్థానికులు చెబుతున్నారు. చిన్నపాటి సంగీతాన్ని ఇది తలపిస్తుందని పేర్కొన్నారు.

