Hyderabad Vijayawada Train: తెలుగు రాష్ట్రాలలో అత్యంత రద్దీగా ఉండే రైలుమార్గాలలో హైదరాబాద్ – విజయవాడ రూట్ (Hyderabad Vijayawada Train) ప్రధానమైనది. ఈ రెండు నగరాల మధ్య లక్షలాదిమంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. అయితే, ఎన్నో ముఖ్యమైన పనుల మీద ప్రయాణాలు చేసేవారికి ప్రయాణ సమయం ఇబ్బంది పెడుతోంది. కొందరు ప్రయాణికులు అసహనం వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. వందేభారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రయాణ సమయం గణనీయంగా ఆదా అయ్యింది. హైదరాబాద్ – విజయవాడ మార్గంలో ప్రయాణ సమయాన్ని మరింత తగ్గించాలని దక్షిణమధ్య రైల్వే (South Central Railway) యోచిస్తోంది. ఇందులో భాగంగా ఈ రెండు నగరాల మధ్య ప్రయాణాన్ని 3 గంటలకు తగ్గించేందుకు వీలుగా, ఈ రూట్‌లో గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడిచే రైళ్లును తీసుకోవాలని భావిస్తోంది. అందుకు వీలుగా ‘గోల్డెన్ డయాగనల్’ (GD) కారిడార్‌లోని రైలు మార్గాలను ఆధునీకరించాలని భావిస్తున్నట్టు తెలిసింది.
దక్షిణమధ్య రైల్వే మనసులో ఉన్న ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ లభిస్తే హైదారాబాద్-విజయవాడ మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. ఈ స్థాయి స్పీడ్‌తో ప్రయాణించే రైళ్లు ప్రస్తుతం ఢిల్లీ – ఆగ్రా, ఢిల్లీ – మీరట్ వంటి కొన్ని మార్గాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీటిని ‘సెమీ హైస్పీడ్ కారిడార్’ అని అంటారు. సికింద్రాబాద్- విజయవాడ మధ్య ఈ సర్వీసులను తీసుకొస్తే దక్షిణ భారతదేశంలోనే ఈ తరహా తొలి మార్గం అవుతుందని రైల్వే అధికారులు పేర్కొన్నారు. అనుమతి లభిస్తే రెండేళ్లలోనే ఈ మౌలిక సదుపాయాల ఆధునీకరణ పనులు పూర్తవుతాయని రైల్వే అధికారులు లెక్కలు వేస్తున్నారు.
Read Also- Telangana Crime Report: వార్షిక క్రైమ్ రేట్ రిపోర్ట్ విడుదల చేసిన డీజీపీ.. కీలకమైన విషయాలు ఇవే
ప్రస్తుతం 4-5 గంటలు
హైదరాబాద్ – విజయవాడ మధ్య రైలు మార్గంలో ప్రస్తుతం సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు 4 నుంచి 5 గంటల సమయంలో గమ్యస్థానానికి చేరుతున్నాయి. సెమీ హైస్పీడ్ కారిడార్‌ను అందుబాటులోకి తీసుకొస్తే, ప్రయాణ సమయం 3 గంటల కంటే కూడా తక్కువగా ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే వందే భారత్ వంటి ప్రీమియం రైళ్లు అందబాటులోకి వచ్చిన సికింద్రాబాద్-కాజీపేట, కాజీపేట-విజయవాడ, దువ్వాడ-విజయవాడ, విజయవాడ-గూడూరు రూట్లలో కూడా హైస్పీడ్ రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే ఈ మార్గాలలో ప్రస్తుతం గంటకు 130 కిలోమీటర్ల వేగంతో రైళ్లు తిప్పుతుండగా, గంటకు 160 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో రైళ్లు నడిపేందుకు అనుమతి ఇవ్వాలంటూ కేంద్రాన్ని దక్షిణమధ్య రైల్వే కోరినట్టుగా కథనాలు వెలువడుతున్నాయి. ఈ మేరకు సమగ్ర ప్రతిపాదనలను పంపినట్టు అధికారులు ధ్రువీకరించారు.
Read Also- Mana Shankara Varaprasad Garu: ‘మెగా విక్టరీ మాస్’ సాంగ్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

