New Year Celebrations: ప్రశాంత వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలి
ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్
ఖమ్మం, క్రైమ్ స్వేచ్ఛ: నూతన సంవత్సర వేడుకలు (New Year Celebrations) ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఖమ్మ పోలీస్ కమిషనర్ సునీల్ దత్ (Khammam Police) హెచ్చరించారు. డిసెంబర్ 31 రాత్రి జాతీయ రహదారి, ప్రధాన రహదారులపై వేడుకలు జరుపుకోవడం నిషేధమని పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు. ముఖ్యంగా మద్యం తాగి వాహనాలను నడపవద్దని, మితిమీరిన వేగంతో ద్విచక్ర వాహనాలు నడిపి ప్రమాదాలకు గురై తల్లిదండ్రులను క్షోభకు గురిచేయవద్దని సూచన చేశారు. మద్యం దుకాణదారులు నిర్ణీత సమయం వరకే విక్రయాలు జరపాలన్నారు. అర్ధరాత్రి గుంపులు గుంపులుగా తిరుగుతూ.. ప్రజలను భయభ్రాంతులకు గురిచేయవద్దని అన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ పెట్రోలింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకునేలా స్నేహపూర్వక వాతావరణంలో శుభాకాంక్షలు తెలుపుకోవాలని విద్యార్థులు, యువతకు సూచించారు. మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ షీటీమ్స్ ప్రత్యేకంగా పర్యవేక్షణ చేపడతాయని తెలిపారు.
Read Also- Battle of Galwan: గల్వాన్ సినిమాపై చైనా అక్కసు.. భారత్ స్ట్రాంగ్ రియాక్షన్.. డ్రాగన్‌కు చురకలు!
శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ట్రాఫిక్, టాస్క్ ఫోర్స్, షీటీమ్స్, పెట్రోలింగ్ బృందాలు అప్రమత్తంగా విధులు నిర్వహిస్తాయని సునీల్ దత్ తెలిపారు. డీజేలకు అనుమతి లేదని, బాణాసంచా కాల్చడంపై నిషేధం ఉంటుందని తెలిపారు. నూతన సంవత్సర వేడుకల్లో డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక తనిఖీలు చేపడతామని, డ్రగ్స్ సరఫరా చేసే ముఠాలపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. బార్లు, వైన్ షాపులు నిర్దేశిత సమయానికి మూసివేయాలని, మైనర్లకు మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. రెస్టారెంట్లు, షాపుల పరిసరాల్లో సీసీటీవీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. అసభ్యకర డ్యాన్స్ కార్యక్రమాలు నిర్వహించరాదని హెచ్చరించారు. డ్రంకెన్ డ్రైవింగ్ పరీక్షలు కట్టుదిట్టంగా అమలు చేస్తామని, మైనర్లకు వాహనాలు ఇచ్చే యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అర్థరాత్రి యువకులు నిర్లక్ష్యంగా అధిక వేగంతో వాహనాలు నడపకుండా, బైక్ రేసులు జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు కొనసాగుతుందన్నారు. ఖమ్మం జిల్లా ప్రజలందరికీ ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
రౌడీ షీటర్ల పై ప్రత్యేక దృష్టి పెట్టండి: కల్లూరు ఏసీపీ వసుందర యాదవ్
ఖమ్మం క్రైమ్, స్వేచ్ఛ: సంఘ విద్రోహ చర్యలకు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే రౌడీషీటర్లు, హిస్టరీ షీట్లు ఓపెన్ చేసిన వారిపై పోలీసు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నాడు వీ.ఎం.బంజర పోలీస్ స్టేషన్‌ను ఆమె సందర్శించారు. పోలీస్ స్టేషన్ నిర్వహణ, పోలీసుల పనితీరు, విచారణ నివేదికలు, సీసీటీఎన్ఎస్ అప్లోడ్, జనరల్ డైరీ రికార్డులను, సీజ్ చేసిన వాహనాలు, పరిసరాలను వసుంధర యాదవ్ పరిశీలించారు. రౌడీషీటర్లు, వారి హిస్టరీపై పోలీసులు దృష్టి పెట్టాలని అన్నారు. గ్రామాలలో క్షేత్రస్థాయిలో అవగాహన ఉండాలని సెక్టార్ పోలీస్ ఆఫీసర్లకు ఆమె సూచించారు. నిఘా వ్యవస్థను బలోపేతం చేసేందుకు సీసీటీవీ కెమెరాల ఏర్పాటుపై ప్రజలలో అవగాహన పెంపొందించాలన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులు, డయల్ 100 కాల్స్ ప్రతిస్పందన సమయం, పెండింగ్ కేసులు పరిశీలించారు. విధిగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ.. వాహనాల తనిఖీలు ముమ్మరం చేయాలని అన్నారు. పాత నేరస్ధుల కదలికలను నిఘా పెట్టాలన్నారు. అక్రమ వ్యాపారాలకు పాల్పడే వారిపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కల్లూరు పరిధిలో ఎలాంటి మత్తు పదార్థాలు, గంజాయి వంటి రవాణా, విక్రయాలు సాగకుండా పోలీస్ అధికారులు ప్రత్యేక పోకస్ పెట్టాలని స్పష్టం చేశారు.
Read Also- Dangerous Roads India: వణుకు పుట్టించే మార్గాలు.. బండి ఉంటే సరిపోదు.. గట్స్ కూడా ఉండాల్సిందే!

