Telangana Crime Report: సాంప్రదాయ నేరాలు… సైబర్ మోసాలు తగ్గాయ్
శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయి
వార్షిక నివేదిక విడుదల సందర్భంగా డీజీపీ శశిధర్ రెడ్డి
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని డీజీపీ శివధర్ రెడ్డి చెప్పారు. క్రితంసారితో పోలిస్తే ఈ సంవత్సరం నేరాలు 2.33శాతం తగ్గాయన్నారు. ముఖ్యంగా సైబర్ నేరాలు శాతం తగ్గగా వీటిల్లో రికవరీ 23శాతం పెరిగినట్టు చెప్పారు. డ్రగ్ ఫ్రీ స్టేట్ గా తెలంగాణను మార్చటానికిగాను కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఇక ఈ ఏడాది 509 మావోయిస్టులు లొంగిపోగా వారిలో 21మంది తెలంగాణకు చెందిన వారు ఉన్నట్టు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ సుప్రీం కోర్టులో నడుస్తున్న నేపథ్యంలో దానిపై తాను ఏమీ మాట్లాడనని చెప్పారు. అయితే, ఫోన్ ట్యాపింగ్‌తో పాత్ర ఉన్నట్టు తేలిన వారు ఎవరైనా సరే వారిపై చర్యలు ఉంటాయన్నారు. ఇక, ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమంది రవి కేసులో ఏయే చర్యలు తీసుకోవాలో అన్నీ తీసుకుంటామన్నారు. పోలీసింగ్‌లో రాష్ట్రం దేశం మొత్తంలో అగ్రస్థానంలో నిలిచిందన్నారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో మంగళవారం డీజీపీ శివధర్ రెడ్డి వార్షిక నేర నివేదికను విడుదల చేసి మాట్లాడారు.
సైబర్ నేరాలు తగ్గాయి…
సైబర్ మోసాలపై ప్రజలకు విస్తృతస్థాయిలో కల్పిస్తున్న అవగాహన సత్ఫలితాలను ఇస్తోందని డీజీపీ చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 3శాతం మేర సైబర్ నేరాలు తగ్గాయన్నారు. అదే సమయంలో 23శాతం రికవరీ పెరిగినట్టు చెప్పారు. సైబర్ క్రిమినల్స్ నుంచి 246 కోట్లను రికవరీ చేసి 25,500మంది బాధితులకు వాపస్ ఇప్పించినట్టు తెలిపారు. వేర్వేరు రాష్ట్రాల్లో స్పెషల్ ఆపరేషన్లు జరిపి సైబర్ నేరాల్లో పాత్ర ఉన్న 371మందిని అరెస్ట్ చేసినట్టు వివరించారు.
Read Also- Karimnagar News: వైకుంఠ ఏకాదశి సందర్భంగా కరీంనగర్ యువకుడి వినూత్న నిరసన.. డిమాండ్ ఏంటంటే?
డ్రగ్స్‌పై ఉక్కుపాదం…
తెలంగాణను డ్రగ్ ఫ్రీ స్టేట్‌గా మార్చాలని ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యాన్ని చేరటానికి పకడ్బంధీ చర్యలు తీసుకుంటున్నట్టు డీజీపీ శివధర్ రెడ్డి చెప్పారు. ఈగల్ ఫోర్స్, హైదరాబాద్ యాంటీ నార్కొటిక్ వింగ్, తెలంగాణ యాంటీ నార్కొటిక్ బ్యూరో ఈ దిశలో ప్రశంసనీయ ఫలితాలను సాధిస్తున్నట్టు తెలిపారు. ఈ సంవత్సరంలో 172.93 కోట్ల రూపాయల విలువ చేసే డ్రగ్స్ ను సీజ్ చేసినట్టు చెప్పారు. క్రితంసారితో పోలిస్తే ఇది 25శాతం ఎక్కువ అని తెలిపారు. వేర్వేరు రాష్ట్రాల్లో ఆపరేషన్లు జరిపి డ్రగ్స్ దందా చేస్తున్న పలువురిని అరెస్ట్ చేశామన్నారు.
యాక్సిడెంట్లు తగ్గాయి…
క్రితంసారితో పోలిస్తే ఈ ఏడాది రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య 5శాతం పెరిగినట్టు డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. అయితే, ఆయా ప్రమాదాల్లో మరణాలు తగ్గాయన్నారు. గత ఏడాది 23,491 యాక్సిడెంట్లు జరుగగా 7,056మంది చనిపోయినట్టు తెలిపారు. ఈసారి 24,826 రోడ్డు ప్రమాదాలు సంభవించగా 6,499మంది ప్రాణాలు కోల్పోయినట్టు చెప్పారు.
Read Also- Bangladesh Violence: షాకింగ్.. బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తి హత్య
హత్యలు తగ్గాయ్
ఇక, ఈ సంవత్సరం హత్యలు కూడా 8.76శాతం మేర తగ్గినట్టు డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. అత్యాచారం కేసుల్లో 13.45శాతం తగ్గుదల ఉందన్నారు. మహిళలు, పిల్లల భద్రత కోసం ఉమెన్ సేఫ్టీ వింగ్ విస్తృతస్థాయిలో చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. మహిళల కోసం ఉన్న చట్టాలు, వారి హక్కులపై అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు. ఎలాంటి సమస్య ఎదురైనా ఫిర్యాదు చేయాలన్న ధైర్యాన్ని మహిళలకు అందిస్తున్నట్టు వివరించారు.
509 మంది మావోయిస్టులు లొంగుబాటు
ఈ ఏడాదిలో 509మంది మావోయిస్టులు లొంగిపోయినట్టుగా డీజీపీ శివధర్ రెడ్డి చెప్పారు. జనజీవన స్రవంతిలోకలవటానికి సిద్ధంగా ఉన్న మావోయిస్టుల కోసం ఇప్పటికే ద్వారాలు తెరిచే ఉన్నాయన్నారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసి రాష్ట్రాభివృద్ధికి పాటు పడాలని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు ఫలితాలనిస్తున్నట్టు తెలిపారు. లొంగిపోయిన వారందరికీ ప్రభుత్వం తరపున పునరావాసం కల్పిస్తున్నట్టు చెప్పారు.
మహిళా అధికారులు భేష్…
తెలంగాణ పోలీసు శాఖలో వేర్వేరు హోదాల్లో ఉన్న మహిళా అధికారులు ప్రశంసనీయంగా విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. సీఐడీ, ఏసీబీ డీజీ చారూ సిన్హా, పోలీస్ అకాడమి డైరెక్టర్ అభిలాష బిస్త్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఛీఫ్ శిఖా గోయల్, ఎస్ఐబీ ఐజీ సుమతి తదితరులు మెరుగైన ఫలితాలను సాధించారన్నారు. ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవటానికి ప్రతీ పోలీస్ స్టేషన్ లో క్యూ ఆర్ కోడ్ ను అందుబాటులో పెట్టామన్నారు. ఈ ఏడాది 1.20 లక్షల మొబైల్ ఫోన్లను రికవరీ చేయటం ద్వారా దేశంలోనే తెలంగాణ పోలీస్ మొదటి స్థానంలో నిలిచిందని చెప్పారు.
సుప్రీంకోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసు
సుప్రీం కోర్టులో విచారణలో ఉన్న ఫోన్ ట్యాపింగ్ కేసుపై తాను ఏమీ వ్యాఖ్యానాలు చేయలేనని డీజీపీ శివధర్ రెడ్డి చెప్పారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందన్నారు. దీంట్లో ట్యాపింగ్ కేసుతో సంబంధం ఉన్నట్ఠుగా ఎవరు తేలినా…వాళ్లు ఏ స్థాయిలో ఉన్నా చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు. గ్యాంగ్ స్టర్ నయీం భూముల కేసు సీఐడీ విచారణలో ఉన్నట్టు చెప్పారు. నయీం గ్యాంగ్ కబ్జాలు చేసిన భూములను పెద్ద ఎత్తున గుర్తించినట్టు తెలిపారు. వీటిని అమ్మాలని చాలామంది ప్రయత్నించారన్నారు. అయితే, వారికి చెక్ పెట్టామని చెప్పారు. నయీం భూములపై హైకోర్టు నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయన్నారు. ఈ భూములను ఎవ్వరూ కొనవద్దని, అమ్మవద్దని సూచించారు. ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమంది రవిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుసని డీజీపీ చెప్పారు. కోర్టులో తేల్చుకుంటా అంటూ రవి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా అలాగే అంటూ జవాబిచ్చారు.
మరింత పటిష్టం…
పోలీసు శాఖను మరింత పటిష్టం చేయనున్నట్టు డీజీపీ శివధర్ రెడ్డి చెప్పారు. ఈ ఏడాదిలో కొత్తగా హైడ్రా పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే హైడ్రా వందల కోట్ల రూపాయల విలువ చేసే భూములను కాపాడినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు డీజీపీలు మహేశ్ భగవత్, చారూ సిన్హా, పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్, ఇంటెలిజెన్స్ ఛీఫ్ విజయ్ కుమార్, తాజాగా సైబరాబాద్ కమిషనర్ గా నియమితులైన డాక్టర్ ఎం.రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

