Zero Hour Assembly: రాష్ట్ర శాసనసభలో ‘జీరో అవర్’లో సందడి నెలకొన్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా సభ్యులంతా ప్రజా సమస్యలపై సూటిగా ప్రశ్నల వర్షం కురిపించారు. పార్టీలకతీతంగా ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల అభివృద్ధి, పెండింగ్ పనులు, నిధుల విడుదలపై ప్రభుత్వాన్ని నిలదీయడం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ప్రతిపక్షాలు మాత్రమే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాయని అనుకుంటారు. కానీ ఈసారి సీన్ మారింది. అధికార పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు సైతం తమ ప్రాంతాల్లోని రోడ్ల దుస్థితి, సాగునీటి ప్రాజెక్టుల ఆలస్యంపై అసహనం వ్యక్తం చేశారు. ప్రజలకు తాము జవాబుదారీగా ఉండాలని, అందుకే సభ దృష్టికి సమస్యలను తెస్తున్నామని వారు స్పష్టం చేశారు.
మెజార్టీ సభ్యులు లేవలెత్తిన అంశాలు
ఏళ్ల తరబడి నిలిచిపోయిన వంతెనలు, భవన నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని పలువురు ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. అంతేగాక మంజూరైన నిధులను తక్షణమే విడుదల చేసి, అభివృద్ధి కుంటుపడకుండా చూడాలని కోరారు. తాగునీటి ఎద్దడి, విద్యుత్ సమస్యలు, ఆసుపత్రుల్లో సిబ్బంది కొరతపై రూరల్ ప్రాంత శాసన సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. జీరో అవర్‌లో లేవనెత్తిన ప్రతి అంశానికి ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ రావాలని సభ్యులు పట్టుబట్టారు. కేవలం నోట్ చేసుకుంటామని కాకుండా, గడువులోగా పనులు పూర్తి చేస్తామని మంత్రులు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేయడంతో సభలో కొంత ఉత్కంఠ నెలకొన్నది.
Also Read: ibomma Ravi Case: ‘ఐబొమ్మ రవి కేసు’.. సంచలన విషయాలు చెప్పిన సైబర్ క్రైమ్ డీసీపీ!
ప్రజాస్వామ్యానికి శుభపరిణామం
ముఖ్యంగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు తమ వాణిని బలంగా వినిపించడం పట్ల విశ్లేషకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యలపై చర్చ జరగడమే సభ అసలు ఉద్దేశమని, ఆ దిశగా ఈసారి ‘జీరో అవర్’ పూర్తి స్థాయిలో సక్సెస్ అయిందని వారు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి, అసెంబ్లీ వేదికగా ప్రజా ప్రతినిధులు వేసిన ప్రశ్నలు ప్రభుత్వ యంత్రాంగంలో చర్చనీయాంశంగా మారాయి.
సమాధానం కావాల్సిందే..
జీరో అవర్ అంటే కేవలం సమస్యను చెప్పి వదిలేయడం కాకుండా, సంబంధిత మంత్రి నుండి కచ్చితమైన హామీ లేదా సమాధానం కావాలని కొందరు సభ్యులు పట్టుబట్టారు. సభాపతి కూడా స్పందిస్తూ, సభ్యులు లేవనెత్తిన అంశాలపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.”ప్రజాస్వామ్యంలో జీరో అవర్ అనేది సామాన్యుడి గొంతు. ఇక్కడ వచ్చే ప్రతి ప్రశ్న వెనుక వేల మంది ప్రజల ఆశలు ఉంటాయి” అని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో జీరో అవర్ విజయవంతం కావడం ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి సంకేతం అని సీనియర్ నాయకులు అంటున్నారు.
Also Read: Khaleda Zia: బంగ్లాదేశ్ అల్లర్ల వేళ.. మాజీ ప్రధాని అస్తమయం.. అసలు ఎవరీ ఖలీదా జియా?

