Maoist Encounter: మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఒడిశా అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. ఒడిశా స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) సిబ్బందికి, నక్సలైట్లకు మధ్య ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. కంధమల్ జిల్లాలోని బెల్ఘర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని గుమ్మా అడవుల్లో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది.
ఎదురుకాల్పుల అనంతరం SOG సిబ్బంది నక్సలైట్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మరణించిన నక్సలైట్లను సుక్మా నివాసి రాకేష్ రాయ్‌గడగా గుర్తించారు. రెండవ నక్సలైట్‌ను బీజాపూర్ నివాసి అమృత్ ప్లాటూన్ సభ్యుడు, సప్లై దళ్ సభ్యుడిగా గుర్తించారు. అలాగే తెలుగు మావోయిస్టు కమాండర్, ఒడిశా రాష్ట్ర కమిటీ ఇన్ ఛార్జ్ గణేష్ (Ganesh Uike) సైతం ఈ కాల్పుల్లో మృతి చెందినట్లు బలగాలు స్పష్టం చేశాయి.
కాగా గణేష్ స్వస్థలం నల్గొండ జిల్లాలోని పుల్లెమ్ల గ్రామం. యువకుడిగా ఉన్నప్పుడే మావోయిస్టుల భావజాలానికి ఆకర్షితుడై అడవి బాట పట్టారు. అతడిపై రూ.25 లక్షల రివార్డును సైతం తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. గణేష్.. సీపీఐ మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడిగాను పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒడిశా రాష్ట్ర మావోయిస్టు కార్యకలాపాలకు కీలక బాధ్యతలను స్వీకరించారు. ఆయన గత 40 ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. దండకారణ్య ప్రాంతంలో మావోయిస్టు బలాన్ని పెంచడంలో కృషి చేశారు.
Also Read: Bandi Sanjay: పంచాయతీలకు నిధులు.. ప్రభుత్వానికి బండి సంజయ్ డెడ్ లైన్
అంతేకాదు భద్రతా బలగాలపై జరిపే దాడుల ప్రణాళికలోనూ గణేష్ ముఖ్య భూమిక పోషించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఫలితంగా వివిధ రాష్ట్రాల్లో కలిపి అతడిపై రూ.1-5 కోట్ల వరకూ రివార్డ్స్ ఉన్నట్లు స్పష్టం చేశారు. కాగా గణేష్ ఉయికే డిగ్రీ వరకూ చదువుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఎన్ కౌంటర్ అనంతరం ఘటనా స్థలి నుంచి భారీ ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే ఒక రివాల్వర్, 303 రైఫిల్, ఒక వాకీ-టాకీ, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఒడిశా పోలీసులు అధికారికంగా ప్రకటించారు.

