School Bus Accident: హైదరాబాద్ లోని శంషాబాద్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముందున్న వాహనాన్ని తప్పించబోయి ఓ స్కూల్ బస్సు ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు, పోలీసులు.. గాయపడ్డ విద్యార్థులను బస్సులో నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అనంతరం సమీపంలోని ఆస్పత్రికి వారిని తరలించారు. రహదారిపై అడ్డంగా బస్సు పడిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
జలవిహార్‌కు వెళ్తుండగా..
బెంగళూరు జాతీయ రహదారిపై శంషాబాద్ లోని బాలానగర్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. యాక్సిడెంట్ కు గురైన బస్సును రిషి స్కూల్ కు చెందినదిగా గుర్తించారు. స్కూల్లోని 60 మందికి పైగా విద్యార్థులు.. పిక్నిక్ లో భాగంగా జలవిహార్ కు బయలుదేరిన క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. బస్సు డ్రైవర్ వేగంగా వెళ్తూ ముందున్న వాహనాన్ని తప్పించాలని భావించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో స్టీరింగ్ కంట్రోల్ తప్పడంతో బస్సు ఒక్కసారిగా బోల్తా పడినట్లు బాధిత విద్యార్థులు పేర్కొన్నారు. ఈ ఘటనలో పదుల సంఖ్యలో విద్యార్థులు గాయపడ్డారు. వారిని అంబులెన్స్ సాయంతో ఆస్పత్రికి తరలించారు.
సహాయ చర్యల్లో మంత్రి..
బస్సు ప్రమాదానికి గురైన మార్గంలోనే రాష్ట్ర క్రీడా మంత్రి వాకిటి శ్రీహరి వనపర్తి పర్యటనకు బయలుదేరారు. ఈ క్రమంలో బస్సు ప్రమాదాన్ని గమనించి.. తన కాన్వాయ్ ను ఆపించారు. అనంతరం మంత్రి స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొని.. ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా వాహనాలను క్లియర్ చేశారు. గాయపడ్డ విద్యార్థుల దగ్గరికి వెళ్లి వారిని పరామర్శించారు. ప్రమాదానికి గురై భయ బ్రాంతులకు లోనైన విద్యార్థులకు మంత్రి ధైర్యం చెప్పారు. ఈ ప్రమాదం లో గాయపడ్డ విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని షాద్ నగర్ డాక్టర్ లకు ఫోన్ చేసి చెప్పారు. విద్యార్థులను దగ్గరుండి అన్ని చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.
శంషాబాద్ సమీపంలో స్కూల్ బస్సు ప్రమాదానికి గురైన ఘటనా స్థలంలో సహాయక చర్యల్లో పాల్గొన్న మంత్రి వాకిటి శ్రీహరి
పోలీసులు, స్థానికులతో కలిసి ట్రాఫిక్ క్లియర్ చేసిన మంత్రి వాకిటి శ్రీహరి https://t.co/p5ekLIiGlI pic.twitter.com/62VmDNxuLx
— BIG TV Breaking News (@bigtvtelugu) December 25, 2025
Also Read: Telangana BJP: బీజేపీ దూకుడు.. త్వరలో స్పోక్స్ పర్సన్ల నియామకం.. తెరపైకి రేషియో విధానం!
హైదరాబాద్‌లో మరో యాక్సిడెంట్
హైదరాబాద్ లోని పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలోనూ ఇవాళ ఉదయం ఓ యాక్సిడెంట్ జరిగింది. జయభేరి కాలనీలో సాధు వాస్వానీ స్కూల్ కు చెందిన బస్సు అతివేగంగా వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న తండ్రి, కొడుకు రోడ్డుపై పడిపోయారు. ఈ క్రమంలో బాలుడ్ని కొద్దిదూరం వరకూ బస్సు ఈడ్చుకెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. ఘటనలో గాయపడ్డ తండ్రి, కొడుకులను స్థానికులు హుటాహుటీనా ఆస్పత్రికి తరలించారు.

