Road Accidents: క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని యావత్ దేశం సంబురాల్లో మునిగిపోయింది. ఏసు క్రీస్తూ జన్మదినం సందర్భంగా క్రైస్తవులు ఉదయం నుంచి చర్చిల్లో ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. సమాజ శ్రేయస్సు గురించి వేడుకుంటున్నారు. ఇలాంటి ఆనంద సమయంలో దేశంలో వరుసగా ఘోర రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోవడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. వేర్వేరు ప్రమాదాల్లో ఇప్పటివరకూ 21 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చేరారు.
కర్ణాటక బస్సు ప్రమాదం
కర్ణాటకలో ఇవాళ తెల్లవారుజామున ఘోర బస్సు ప్రమాదం (Bus Accident) చోటుచేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొనడంతో మంటలు చెలరేగి 17 మంది సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదంలో ప్రైవేటు బస్సు, లారీ పూర్తిగా దగ్దమయ్యాయి. ట్రావెల్స్ బస్సు బెంగళూరు నుంచి శివమెుగ్గ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు పేర్కొన్నాయి. కాగా బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడ్డ వారికి రూ.50,000 ప్రకటించారు. మరోవైపు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఈ ప్రమాదంపై స్పందిస్తూ బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.
ఈడ్చుకెళ్ళిన స్కూల్ బస్సు
హైదరాబాద్ లోని పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలోనూ ఓ యాక్సిడెంట్ జరిగింది. జయభేరి కాలనీలో సాధు వాస్వానీ స్కూల్ కు చెందిన బస్సు అతివేగంగా వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న తండ్రి, కొడుకు రోడ్డుపై పడిపోయారు. ఈ క్రమంలో బాలుడ్ని కొద్దిదూరం వరకూ బస్సు ఈడ్చుకెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. ఘటనలో గాయపడ్డ తండ్రి, కొడుకులను స్థానికులు హుటాహుటీనా ఆస్పత్రికి తరలించారు.
బ్రిడ్జిపై నుంచి బోల్తా పడ్డ కారు..
అటు మహారాష్ట్రలోనూ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సోండో ప్రాంతంలో గల బ్రిడ్జిపై నుంచి ఓ కారు ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ఘటనలో కారులోని నలుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతులు తెలంగాణలోని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ వాసులుగా అధికారులు గుర్తించారు. వైద్యం నిమిత్తం మహారాష్ట్రలోని నాగ్ పూర్ కు వెళ్లి.. తిరిగి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకున్నట్లు పేర్కొన్నారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఒక బాలిక ఉన్నారు.
Also Read: Christmas 2025: ఒకేచోట వైఎస్ జగన్, విజయమ్మ.. క్రిస్మస్ వేళ ఆసక్తికర దృశ్యాలు
తమిళనాడులోనూ బస్సు ప్రమాదం
తమిళనాడులో(Tamil Nadu) ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కడలూరులో కార్లను ఆర్టీసీ బస్సు(Rtc bus) ఢీ కొట్టడంతో 9 మంది మృతి చెందారు. ఇద్దరు పిల్లలతో పాటు నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. తమిళనాడు నుంచి చెన్నైకి బయలు దేరిన ఆర్టీసీ బస్సు టైరు పేలి అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో ముందుగా వెళ్తున్న రెండు కార్లను బస్సు ఢీకొనడంతో ఘోరం జరిగిపోయింది. గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను హాస్పిటల్స్‌కు తరలించారు. ఈ దుర్ఘటనపై సీఎం స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

