Telangana Farmers: రైతును రాజును చేయడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతుంది. రెండు లక్షల రుణమాఫీ, రైతు భరోసా, ధాన్యానికి బోనస్ ఇస్తూ ఆర్థిక భరోసా కల్పిస్తుంది. అందులో భాగంగానే వ్యవసాయ రంగంలో కూలీల కొరత కారణంగా రైతులు ఇబ్బందులు పడొద్దని యాంత్రికరణ వైపునకు రైతులను ప్రోత్సహించాలని భావిస్తుంది. అందులో భాగంగానే సబ్సిడీపై యంత్రాలను ఇచ్చేందుకు సిద్ధమైంది. రైతు యాంత్రికరణ పథకాన్ని పునః ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తుంది. జనవరిలో ప్రారంభించేందుకు కసరత్తు చేస్తుంది. అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే జాతి ఆహార భద్రత మిషన్ లో భాగంగా పప్పు దినుసులు విత్తనాలను సబ్సిడీపై అందజేస్తుంది. రైతులను దృష్టిలో ఉంచుకొని రైతు యాంత్రికరణ పథకాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఈ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 1,31,000 మంది రైతులకు సబ్సిడీపై వివిధ పనిముట్లు, యంత్రాలు అందజేయనున్నారు.
అర్హుల జాబితాను రెడీ
రైతు యాంత్రికరణ పథకం కింద జనవరి మొదటి వారంలో గ్రామ మండలాల్లో వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు పర్యటించాలని ప్రభుత్వం ఆదేశించింది. రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని సూచించింది. ఇప్పటికే కొంతమంది రైతులు రైతు యాంత్రీకరణ పథకం కోసం రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తు చేసుకుంటున్నారు. అధికారులు సైతం వచ్చిన దరఖాస్తుల నుంచి మండలాల వారిగా అర్హుల జాబితాను రెడీ చేస్తున్నారు. జనవరి నెలలోగా ఈ ప్రక్రియను పూర్తిచేసి, రైతులకు ఆధునిక యంత్రాలు అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా పథకాన్ని జనవరి మొదటి వారంలో ప్రారంభించేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వ్యవసాయ వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు మండలాల వారీగా పర్యటించి రైతులకు అందుతున్న సబ్సిడీలు, యాంత్రికరణ పథకం దరఖాస్తులు, యూరియా పాములు తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో ఫీడ్బ్యాక్ సేకరించాలని, రైతుల సమస్యలను నేరుగా తెలుసుకొని తక్షణమే పరిష్కారం చూపాలని ప్రభుత్వం ఆదేశించింది.
Also Read: Demon Pavan: అక్కడ లవ్ ఎమోషన్ ఆర్గానిక్‌గా వచ్చిందే.. డెమోన్ పవన్
సబ్సిడీ యంత్రాల సరఫరా
గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2017లో సబ్సిడీ పై అందజేస్తున్న వ్యవసాయ యాంత్రికరణ పనిముట్ల పంపిణీ పథకాన్ని నిలిపివేసింది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. రైతుబంధు పథకాన్ని ప్రారంభించిన తర్వాత సబ్సిడీ యంత్రాల సరఫరా కు మంగళం పాడింది. వ్యవసాయ రంగంలో మారుతున్న సాంకేతికత, వాతావరణ మార్పులు, కూలీల కొరత వంటి సమస్యలు రైతులను వేధిస్తుండడంతో రేవంత్ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ యాంత్రికరణ పునః ప్రారంభానికి శ్రీకారం చుడుతుంది. ఏ జిల్లాలో ఏ పథకాన్ని ప్రారంభిస్తారు అనేది త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని వ్యవసాయ అధికారులు తెలిపారు.
ఎకరం భూమి ఉన్నా అర్హులే..
కేవలం పెద్ద రైతులే కాకుండా ఎకరం భూమి ఉన్న రైతులూ అర్హులు. ముఖ్యంగా సన్నకారు, చిన్నకారు, అలాగే ఎస్సీ, ఎస్టీ రైతులకు 50% రాయితీ, మిగిలిన రైతులకు 40% రాయితీ అందించనున్నారు. ఇది రైతుల పట్ల ఉన్న ప్రభుత్వ సహానుభూతిని ప్రతిబింబిస్తుంది. రైతుల భారం తక్కువ చేసి, మెకానికలైజేషన్‌ను ప్రోత్సహించే దిశగా ఇది మైలురాయి కానుంది.
గడ్డి చుట్టే యంత్రం
ఈ పథకం కింద రైతులు ట్రాక్టర్‌తో ఉపయోగించే పరికరాలు (ప్లౌ, ట్రాలీ, సీడర్), విత్తనాల చల్లే యంత్రాలు, కోతకాయ యంత్రాలు, మల్చింగ్ మెషిన్లు, పంట తొలగింపు పరికరాలు, స్ర్పెయర్లు, కల్టివేటర్లు, కేజీ వీల్స్, డ్రోన్స్, రోటవేటర్లు, బోదేలు తీసేవి, షాప్ కట్టర్లు, విత్తన గొర్రు, గడ్డి చుట్టే యంత్రం, బ్రష్ కట్టర్, తదితర పరికరాలు అందజేయనున్నారు. ఈ పరికరాల వల్ల పంటల దిగుబడి పెరగడంతో పాటు, వ్యవసాయ పనుల్లో సమయం, ఖర్చు రెండూ తగ్గుతాయి.
రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం. వ్యవసాయ రంగంలో కూలీల కొరత వేధిస్తుంది. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇవి గమనించి యాంత్రీకరణ ను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. గత ప్రభుత్వం రైతుబంధు పేరుతో సబ్సిడీ యంత్రాల పంపిణీ పథకాన్ని నిలిపివేసింది. రైతులపై ఆ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. తమ ప్రభుత్వం రైతుల కోసం అహర్నిశలు కృషి చేస్తుంది. యాంత్రికరణ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 1,31,000 మంది రైతులకు వ్యవసాయ పరికరాలను అందించబోతున్నాం. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జనవరిలో ప్రారంభించబోతున్నాం. అర్హులందరికీ పథకం వర్తింపజేస్తాం.

