Mahabubabad District: మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలంలోని ఖానాపురం గ్రామంలో ఉన్న పిఎసిఎస్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో భారీ అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. గత ఐదు సంవత్సరాలుగా బినామీ రైతుల పేర్లపై టోకెన్లు తీసుకుని పెద్ద ఎత్తున వరి ధాన్యాన్ని అక్రమంగా తరలించినట్లు ఆరోపణలు వేలువడుతున్నాయి. తక్కువ ధరకు రైతుల వద్ద కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వ మద్దతు ధరతో పాటు క్వింటాకు రూ.500 బోనస్ పొందేందుకు, బినామీ రైతుల పేర్లను సృష్టించి పిఎసిఎస్ కొనుగోలు కేంద్రంలో విక్రయించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
దళారులు చీకటి ఒప్పందాలు
ఇందుకోసం ప్రాథమిక సహకార సంఘం అధికారులతో దళారులు చీకటి ఒప్పందాలు కుదుర్చుకున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఆర్ అండ్ బి రోడ్డుపక్కనే కొనుగోలు కేంద్రం ఉండాల్సినప్పటికీ, ఈ–క్రాప్ సెంటర్‌కు ఎలాంటి సంబంధం లేకుండా రోడ్డుకు దాదాపు కిలోమీటర్ లోపల ఖాళీ స్థలంలో అక్రమంగా పిఎసిఎస్ సెంటర్ ఏర్పాటు చేసి దందా నడుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ కేంద్రం ద్వారా బినామీ పేర్లతో భారీగా వరి కొనుగోళ్లు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.
Also Read: Mahabubabad District: ఆ రెండు గ్రామాలు రాష్ట్రానికే ఆదర్శం.. ఇద్దరు సర్పంచులు 18 వార్డులు ఏకగ్రీవం!
గ్రామాల్లో ఒక సామ్రాజ్యాన్నే ఏర్పాటు
ఈ అక్రమ వరి ధాన్యం దందాతో చుట్టుపక్కల గ్రామాల్లో ఒక సామ్రాజ్యాన్నే ఏర్పాటు చేసుకున్నాడని దళారి గురించి రైతుల మధ్య పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. రైతుల హక్కులను కాలరాస్తూ ఇన్నేళ్లుగా ఇంతటి ఘోరం జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహించడమే ఇందుకు కారణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్, డీసీఓ, డీఏఓ అధికారులు తక్షణమే స్పందించి సమగ్ర విచారణ జరిపి, దళారీ వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక రైతులు డిమాండ్ చేస్తున్నారు.

