Ganja Seized: డ్రగ్స్ ఫ్రీ న్యూ ఇయర్ వేడుకలు జరిగేలా చూడడానికి ఇటు పోలీసులు, అటు ఎక్సైజ్ సిబ్బంది దాడులను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో వేర్వేరు చోట్ల పెడ్లర్లను అరెస్ట్ చేసి వారి నుంచి ఎండీఎంఏ డ్రగ్, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
ముంబై నుంచి ఎండీఎంఏ
కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా ఉన్న డిమాండ్‌ను సొమ్ము చేసుకునేందుకు మహారాష్ట్రకు చెందిన కేతావత్ రవి (28), జెర్పుల రవి (35) కలిసి ముంబైలో ఎండీఎంఏ డ్రగ్ కొన్నారు. అనంతరం బస్సు మార్గంలో హైదరాబాద్ చేరుకున్నారు. సోమవారం మియాపూర్ చౌరస్తాలో మాదక ద్రవ్యాలను విక్రయించడానికి ప్రయత్నించారు. ఈ మేరకు సమాచారం అందడంతో వెంటనే పోలీసులు దాడి జరిపి ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 10.5 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ లక్షన్నరకు పైగానే ఉంటుందని మియాపూర్ ఏసీపీ శ్రీనివాసరావు చెప్పారు.
బెంగళూరు నుంచి తెస్తూ..
మొదట డ్రగ్స్‌కు అలవాటు పడి ఆ తరువాత అదే దందా మొదలు పెట్టిన ఇద్దరిలో ఒకరిని బాలాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 1.6 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నగిడి జానకి శ్రీరామ్(23) కొండాపూర్‌లో నివాసముంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. కొంతకాలంగా శ్రీరామ్, అతని స్నేహితుడు విశ్వ ఎండీఎంఏ డ్రగ్‌కు బానిసలుగా మారారు. ఇద్దరికీ చేస్తున్న ఉద్యోగాల నుంచి ఆశించిన ఆదాయం రాకపోతుండడంతో డ్రగ్స్ దందా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో తరచూ బెంగళూరు వెళుతూ ఎండీఎంఏ డ్రగ్ తీసుకొచ్చి ఇక్కడ ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు. సోమవారం బాలాపూర్ దగ్గర శ్రీరామ్ అమ్మడానికి ప్రయత్నిస్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి అరెస్ట్ చేశారు. నిందితుడిపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి రిమాండ్ చేశారు.
Also Read: Jagapathi Babu: షాకింగ్ లుక్‌లో జగపతిబాబు.. ‘పెద్ది’ పోస్టర్ వైరల్!
హోటల్‌లో గంజాయి సీజ్
మాదాపూర్‌లోని క్లయిర హోటల్‌పై దాడి జరిపిన ఎస్‌ఓటీ పోలీసులు 3.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో హోటల్‌లో వంట మనిషిగా పని చేస్తున్న అభిషేక్ మండల్‌ను అరెస్ట్ చేశారు. కర్ణాటక, ముంబై నుంచి గంజాయి తెప్పించుకుంటున్న అభిషేక్ హోటల్‌కు వచ్చే వారిలో గంజాయి అలవాటు ఉన్న వారికి దానిని విక్రయిస్తున్నట్టుగా వెల్లడైంది.
నాంపల్లిలో కూడా..
మాన్‌గార్ బస్తీలో గంజాయి విక్రయాలు జరుగుతున్నట్టు తెలిసి ఎక్సైజ్ స్టేట్ టాస్క్‌ఫోర్స్ ఏ టీమ్ లీడర్ అంజిరెడ్డి సిబ్బందితో కలిసి సోమవారం దాడులు జరిపారు. దినేశ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 1.2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ దందాతో కాలూ అలియాస్ సాయి, ఆశూ అనే వ్యక్తులకు కూడా సంబంధం ఉన్నట్టు విచారణలో తేలడంతో వారిపై కూడా కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు.
Also Read: Municipal Elections: మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్.. ఉత్తర్వులు జారీ..!

