Private Hospitals: అమ్మ.. ఈ గోస తప్పదా
సిజేరియన్లకే ప్రైవేట్ వైద్యుల మొగ్గు
95 శాతం శస్త్ర చికిత్సలతోనే కాన్పులు
సర్కార్ ఆస్పత్రిలో అధిక శాతం సాధారణ ప్రసవాలే
వైద్యుల కాసుల కక్కుర్తికి నిదర్శనం
గద్వాల, స్వేచ్ఛ: గద్వాల జిల్లాలోని (Gadwal District) ప్రసవాల తీరు ఆందోళన కలిగిస్తోంది. కత్తెర పడకుండా కడుపులో ఉన్న శిశువు బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ప్రభుత్వాసుపత్రిలో సాధారణ ప్రసవం కోసం ప్రయత్నాలు జరుగుతున్నా ప్రైవేట్ ఆస్పత్రుల్లో (Private Hospitals) మాత్రం ఆ పరిస్థితి లేదు. జిల్లాలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సాధారణ ప్రసవాలకే మొగ్గు చూపుతున్నారు. కానీ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో కోతలకే అధిక ప్రాధాన్యతనిస్తూ 90 శాతం సిజేరియన్ ద్వారానే డెలివరీలు చేస్తుండడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సిజేరియన్లలో ఒక ఏడాదిపాటు ప్రైవేట్ హాస్పిటళ్లలో నమోదైన సంఖ్య గమనిస్తే వాటి తీరు స్పష్టమవుతోంది.
ప్రభుత్వ ఆసుపత్రికి క్యూ
ప్రభుత్వ ఆసుపత్రికి మధ్యతరగతి ప్రజలు ప్రసవాల కోసం క్యూ కడుతున్నారు ఆస్పత్రుల్లోనే మౌలిక సదుపాయాలు మెరుగుపడుతుండడంతో సర్కార్ ఆసుపత్రులకు మొగ్గు చూపుతున్నారు. నెలకు సరాసరి 480 కు పైగా ప్రసవాలు జరుగుతున్నాయి. ఇందులో 280కి పైగా సాధారణ ప్రసవాలు చేస్తున్నారు. ప్రత్యేకంగా మిడ్ వైఫరీ వ్యవస్థను ఏర్పాటు చేసి సాధారణ ప్రసవాలపై అవగాహన కల్పించడం తోపాటు కొన్ని రకాల ఎక్సర్‌సైజులతో నార్మల్ డెలివరీలను ప్రోత్సహిస్తుండడం నారీమణులకు శుభపరిణామం. కొందరు ప్రభుత్వ ఆస్పత్రుల్లో గైనకాలజిస్టులుగా విధులు నిర్వహిస్తూనే ప్రైవేట్‌గా క్లినిక్‌లు నిర్వహిస్తూ గర్భిణీలను వారి క్లినిక్‌లో సిజేరియన్‌కు సిఫారసు చేస్తున్నారు. కానీ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో జరుగుతున్న అత్యధిక సిజేరియన్లతో మహిళల ఆరోగ్యం పై ప్రభావం పడే అవకాశం ఉంది. జిల్లాలో గత సంవత్సర కాలంలో ఇద్దరు మహిళలు ఆపరేషన్ వికటించి మరణించిన సంఘటనలు చోటుచేసుకున్నాయి.
Read Also- Gin Movie: టికెట్ డబ్బులకు సరిపడా వినోదం పక్కా అందిస్తాం..‘జిన్’ చిత్ర దర్శకుడు చిన్మయ్ రామ్
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో
జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో మాతా శిశు ఆరోగ్య కేంద్రంతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సాధారణ ప్రసవాలు చేస్తున్నారు. జిల్లాలోని ఆరోగ్య కేంద్రాలలో ఈ సౌకర్యం ఉంది.
ఆరోగ్యంపై దూరదృష్టి లేక
వాస్తవానికి సహజ ప్రసవంతో పోలిస్తే సిజేరియన్ చాలా సులువనే భావనతో ప్రజల్లో మనసుల్లో నాటుకుపోయింది. చాలా తక్కువ సమయంలోనే ముహూర్తం చూసుకొని బిడ్డకు జన్మనివ్వచ్చనే ఆలోచనకు వస్తున్నారు. కానీ ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్న ప్రసవాల తీరును చూసిన ప్రజల ఆలోచన ధోరణిలో మార్పు రావాలి. ఎక్కువ సమయం తీసుకుంటున్నప్పటికీ భవిష్యత్తులో ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే సాధారణ ప్రసవం చేసుకోవాలంటూ వైద్యులు సూచిస్తున్నారు.
అత్యవసరం లేకున్నా
తల్లికి గానీ, బిడ్డకు గానీ ప్రమాదకర పరిస్థితులు ఎదురైనప్పుడు మాత్రమే శస్త్ర చికిత్స చేసి బిడ్డను బయటకు తీస్తారు. కానీ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో కేవలం డబ్బుల కోసమే ఆపరేషన్లు చేస్తున్నారనే విమర్శలు వ్యక్తవుతున్నాయి. గర్భిణీల బంధువులను భయభ్రాంతులకు గురిచేసి శస్త్ర చికిత్సలు చేస్తుండగా ఆరోగ్య సమస్యలతో కొంతమంది మంచి ముహూర్తాలు అంటూ కొంతమంది సిజేరియన్ లను ఎంచుకున్న వారు కూడా ఉన్నారు. దీంతో నెలలు నిండకున్నా,పురిటి నొప్పులు రాకుండానే డెలివరీలు జరుగుతున్నాయి. అదే ప్రభుత్వ ఆసుపత్రిలో సురక్షిత ప్రసవానికి అనువుగా లేని ఆరోగ్య సమస్యలతో బాధపడే గర్భిణీలకు మాత్రమే సిజేరియన్లు చేస్తూ సాధారణ ప్రసవాలను పెంచే ప్రయత్నం చేస్తున్నారు.
దృష్టి సారిస్తున్నాం: డీఎంహెచ్‌వో సంధ్యా కిరణ్మయి
ప్రభుత్వ ఆస్పత్రుల్లో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ ప్రసవాలు పెంచడంపై ప్రత్యేక దృష్టి పెట్టాం. ప్రైవేట్ ఆస్పత్రుల్లో సిజేరియన్లు తగ్గించేందుకు సంబంధిత నర్సింగ్ హోమ్ ల గైనకాలజిస్ట్ లకు అవగాహన కల్పిస్తున్నాం. సాధారణ ప్రసవాలయ్యే వారికి సిజరిన్ అవసరం లేకుండా డెలివరీలే చేయాలని సూచిస్తున్నాం. సాధారణ ప్రసవాలు పెంచేందుకు తగిన చర్యలు చేపడుతున్నాం.
2025 జనవరి నుంచి డిసెంబర్ 18 వరకు మొత్తం ప్రసవాలు : 10,046
ప్రభుత్వ ఆసుపత్రుల్లో..
సాధారణం- 3,721
సిజేరియన్- 1,423
ప్రైవేట్‌లో సాధారణం – 506
సిజేరియన్ – 1840
ఇతర ప్రదేశాలలో- 2,556

