Agricultural Corporations: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయశాఖ అనుబంధ కార్పొరేషన్ల పనితీరుపై దృష్టిసారించారు. పనిచేయని అధికారులు, శాఖలను గుర్తించి వాటిపై చర్యలకు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే అన్ని కార్పొరేషన్ల ఆర్థిక పరిస్థితులు, ఆస్తులపై పూర్తిస్థాయిలో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశాలు ఇచ్చినా నివేదిక ఇవ్వలేదని సమాచారం. మరోసారి అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశాలు జారీ చేశారు. వ్యవసాయరంగానికి అనుబంధంగా ఆగ్రోస్, మార్క్ ఫెడ్, విత్తనాభివృద్ధి సంస్థ, గిడ్డంగుల కార్పొరేషన్, ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్లు ఉన్నాయి. ఇవి పంట ఉత్పత్తుల కొనుగోలు, ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ పరికరాల క్రయ విక్రయ వ్యాపారాలు నిర్వహిస్తున్నాయి.
Also Read: Agricultural Workers: 4 నెలలుగా ఎదురు చూస్తున్న ఉపాధి కూలీలు
మంత్రి తుమ్మల ప్రత్యేక ఫోకస్
వీటితోపాటు మార్కెటింగ్ సంస్థ కార్పొరేషన్ల మాదిరిగానే పలు పనులను చేస్తున్నది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అనుబంధ కార్పొరేషన్లపై మంత్రి తుమ్మల ప్రత్యేక ఫోకస్ పెట్టారు. వాటి కార్యకలాపాలు, ఉద్యోగుల పనితీరు, రైతులకు అందజేస్తున్న సేవలపై దృష్టిసారించారు. అకస్మాత్తుగా కార్పొరేషన్ల కార్యాలయాలను తనిఖీ చేస్తున్నారు. ఉద్యోగులు సమయపాలన, ఆ కార్యాలయం పనితీరును అధ్యయనం చేస్తున్నారు. అందులో భాగంగానే గత నెలలో ఆయిల్ ఫెడ్, మార్క్ ఫెడ్ కార్యాలయాలను సైతం తనిఖీ చేశారు. ఉద్యోగులు సమయ పాలన పాటించకపోవడంతో మంత్రి సీరియస్ అయ్యారు. అంతేకాదు ఆ ఉద్యోగులకు మెమోలు సైతం జారీ చేయాలని, సంజాయిషీ తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. ఆయా శాఖల ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరును మార్చుకోవాలని, ఉన్నతాధికారులు సైతం మానిటరింగ్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అంతేకాదు ఎప్పటికప్పుడు మంత్రి ఆరా తీస్తున్నారు.
ఆగ్రోస్ కార్యాలయం తనిఖీ
వ్యవసాయ పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (ఆగ్రోస్)పై, ఆ సంస్థలోని ఉద్యోగుల పనితీరుపై మంత్రికి ఫిర్యాదులు వచ్చినట్లు సమాచారం. దీంతో శనివారం అకస్మాత్తుగా ఆగ్రోస్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. దీంతో ఉద్యోగుల పనితీరు, వారి సమయ పాలన వెలుగులోకి వచ్చింది.10.30 గంటలు దాటినా సగం మంది ఉద్యోగులకు కూడా కార్యాలయానికి రాలేదు. ఏ కార్యాలయ ఉద్యోగులకు అయినా 5 నిమిషాలు మినహాయింపు ఉంటుంది. అంటే 10.05 గంటలకు హాజరుకావాల్సి ఉంటుంది. కానీ సంస్థ జీఎం సైతం హాజరుకాకపోవడంతో మంత్రి సీరియస్ అయ్యారు. గతంలోనే పలు కార్పొరేషన్ల అధికారులను మంత్రి వార్నింగ్ ఇచ్చారు. అనుబంధ కార్పొరేషన్లు రైతులకు సేవలందించాలని, ఉద్యోగులు సమయపాలన పాటించాలని ఆదేశాలు ఇచ్చారు.
ఉద్యోగులు విధుల్లో అలసత్వం
అయినప్పటికీ కార్పొరేషన్లలో పనిచేస్తున్న ఉద్యోగులు విధుల్లో అలసత్వం ప్రదర్శించడం ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది. కార్పొరేషన్లకు చెందిన కమిషనర్లు దృష్టి సారించకపోవడమా? లేకుంటే ప్రభుత్వ ఉద్యోగం అంటే అలసత్వమా? లేక మంత్రి ఆదేశాలను బేఖాతరు చేయడమా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులపై చర్యలు తీసుకోకపోవడమే.. లేకుంటే పర్యవేక్షణ లోపించడంతోనే అధికారులు విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తున్నారా? అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. దీనికి తోడు ఆగ్రోస్ కార్యాలయంలోఎంఐటీ భవనాలు, మెయింటైనెన్స్ సరిగా లేదు. నిత్యం కార్యాలయంలో ఉన్నతాధికారులు విధులు నిర్వహిస్తున్నప్పటికీ వాటిపై దృష్టిసారించకపోవడం ఇప్పుడు విమర్శలకు దారితీస్తుంది. ఇది ఉద్యోగుల పనితీరుకు అద్దంపడుతుంది. మంత్రి తుమ్మల సైతం అసహనం వ్యక్తం చేశారు. అధికారులకు చర్యలకు ఆదేశించినట్లు సమాచారం. ఇప్పటికైనా అధికారులు పనితీరును మార్చుకుంటారా? లేకుంటే మంత్రి ఆదేశాలను లైట్‌గా తీసుకుంటారా? అనేది చూడాలి.
సమయపాలన తెలుసుకునేందుకు మంత్రి చర్యలు
వ్యవసాయ అనుబంధ కార్పొరేషన్లలో ఉద్యోగుల సమయపాలన తెలుసుకునేందుకు మంత్రి చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. వ్యవసాయశాఖ కింద ఉన్న అన్ని శాఖలు, కార్పోరేషన్లు సంబంధించిన ఉద్యోగులు సకాలంలో హాజరయ్యేలా అన్ని శాఖల వివరాలు రోజువారీగా లైవ్ అప్‌డేట్ ఉండే విధంగా డాష్ బోర్డు ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిసింది. అంతేగాకుండా కార్పొరేషన్లను సెంట్రలైజ్‌డ్ చేస్తే వాటి పనితీరును సైతం మెరుగు పర్చే వీలు కలుగుతుందని అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ఏదీ ఏమైనా ప్రభుత్వం తీసుకుంటున్న చర్చలతో కార్పొరేషన్లు గాడిలో పడతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Also Read: Agricultural Cooperative Society: ఆగమైతున్న అసైన్డ్ భూములు.. పట్టించుకోని అధికారులు
