Jupally Krishna Rao: తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ వేడుక ను పురస్కరించుకొని పూల పండగ ప్రాముఖ్యతను, మహిళల ఐక్యతను,ప్రకృతి సౌందర్యాన్ని ప్రపంచానికి తెలియజేసేలా కవులు, కళాకారులు, గాయకులు రచనలు, ప్రదర్శనలు చేయాలని పర్యాటక,సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao)పిలుపునిచ్చారు. హైదరాబాద్ టూరిజం ప్లాజాలో బుధవారం కవులు, కళాకారులు, గేయ రచయితలు, గాయకులు, సాంస్కృతిక సలహా మండలి సభ్యులతో సమావేశం నిర్వహించారు.
పువ్వులను పూజించే సంస్కృతి
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంబరాన్ని అంటేలా బతుకమ్మ సంబరాలు జరిపేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందన్నారు. కవులు, కళాకారులు తమ రచనల ద్వారా, కళారూపాల ద్వారా తెలంగాణ సాంస్కృతిక సంప్రదాయాలను, బతుకమ్మ పండుగ ప్రాముఖ్యతను ముందు తరాలకు పరిచయం చేసేలా కృషి చేయాలన్నారు. బతుకమ్మ విశిష్టత, ప్రకృతిని పరిరక్షించేందుకు పువ్వులను పూజించే సంస్కృతి, గౌరమ్మ శక్తిని, మహిళల ఆశలను, ఆకాంక్షలను వివరించేలా పాటలు రాయాలని కోరారు. బతుకమ్మ పండుగకు సంబంధించిన ప్రత్యేక పాటలు, వీడియోలను రూపొందించాలని సూచించారు. కవుల, కళాకారుల రచనలు, ప్రదర్శనలు ప్రజలలో బతుకమ్మపై అవగాహనను పెంచుతాయని, పండుగను మరింత ప్రాచుర్యంలోకి తీసుకురావడమే కాకుండా, సమాజంలో స్ఫూర్తిని నింపుతుందన్నారు. ఈ సమావేశంలో ప్రొఫెసర్ కోదాండరాం, వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ సభ్యురాలు భవాని రెడ్డి, స్టేట్ ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ లక్ష్మి, ప్రముఖ దర్శకులు నర్పింగరావు, సినీ గేయ రచయిత సుద్ధాల అశోక్ తేజ పాల్గొన్నారు.
Also Read: Bathukamma festival 2025: బతుకమ్మకు బల్దియా ఏర్పాట్లు.. 28న గిన్నీస్ రికార్డు లక్ష్యంగా ఉత్సవాలు
అందరికీ డిప్యూటేషన్ చాన్స్ కల్పించండి.. టీపీయూఎస్ ముఖ్యమంత్రికి వినతి
రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు డిస్ లోకేటెడ్ అనే అంశంతో కాకుండా అందరికీ డిప్యూటేషన్ కు అవకాశం కల్పించాలని తెలంగాణ ప్రాంతీయ ఉపాధ్యాయ సంఘం(టీపీయూఎస్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హన్మంత్ రావు, నవాత్ సురేశ్ ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం జీవో 190 ఇచ్చిన తర్వాత కూడా కొన్ని సమస్యలు అలాగే ఉన్నాయని, వాటిని పరిష్కరించాలని ఎమ్మెల్సీలు మల్క కొమురయ్య, ఏవీఎన్ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు, చీఫ్ సెక్రటరీకి వినతిపత్రం అందించారు. కేడర్ మారినా అందరి మాదిరిగా డిప్యూటేషన్ కు అవకాశం కల్పించాలని వారు వినతిలో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ స్పౌజ్ లను కూడా పరిగణంలోకి తీసుకుని డిప్యూటేషన్ కు చాన్స్ ఇవ్వాలన్నారు. ఖాళీలు లేకుంటే బై పోస్ట్ లేదా ఆగైనిస్ట్ పోస్టులో డిప్యూటేషన్ చేపట్టాలన్నారు. హైదరాబాద్ లో పనిచేస్తున్న ఉద్యోగుల స్పౌజ్ హైదరాబాద్ కు వెళ్లడం వీలు కాదని, అందుకే వారిని దగ్గర జిల్లాలైన మేడ్చల్ లేదా రంగారెడ్డికి డిప్యూటేషన్ చేయాలని వినతిలో పేర్కొన్నారు.
ఉపాధ్యాయుల ఉద్యోగ భద్రత, ప్రమోషన్లు ప్రమాదం
ఇదిలా ఉండగా ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అన్ని ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి చేసిన విషయం ఉపాధ్యాయులను ఆందోళనను కలిగిస్తోందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఏవీఎన్ రెడ్డి, మల్క కొమురయ్య ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. 2009 ఆర్టీఈ చట్టం, 2010 ఎన్ సీటీఈ నోటిఫికేషన్ ప్రకారం 2010కి ముందు నియమితులైన ఉపాధ్యాయులు టెట్ నుంచి మినహాయింపు పొందాలన్నారు. ఈ హక్కును విస్మరించడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల ఉద్యోగ భద్రత, ప్రమోషన్లు ప్రమాదంలో పడుతున్నాయని వివరించారు. ప్రభుత్వపరంగా రిట్ పిటిషన్ దాఖలు చేయాలని, సమస్యను తొందరగా పరిష్కరించాలని ముఖ్యమంత్రి వారు కోరారు.
Also Read: Tunnel: యాక్షన్ థ్రిల్లర్ ‘టన్నెల్’ సెన్సార్ పూర్తి.. లావణ్య త్రిపాఠికి హిట్ వస్తుందా!