Kavitha: తెలంగాణలో మొంథా తుఫాన్ ప్రభావంతో పత్తి కొనుగోలులో తేమ ప్రమాణాల్లో సడలింపు ఇవ్వాలని మాజీ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) కోరారు. కేంద్ర టెక్స్టైల్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ కి సోమవారం లేఖ రాశారు. తుపాన్ తో తీవ్రంగా నష్టపోయిన పత్తి రైతుల తరపున లేఖ రాస్తున్నట్లు పేర్కొన్నారు. అనేక జిల్లాల్లో అత్యధిక వర్షపాతం, వరదలు సంభవించి వ్యవసాయ పంటలు, మౌలిక సదుపాయాలు, రైతుల జీవనాధారాలపై తీవ్రమైన నష్టం కలిగించిందన్నారు. రాష్ట్రంలో పత్తి ప్రధాన పంటగా ఉన్నదని, ఈ అధిక వర్షాల కారణంగా కోతకు వచ్చిన పత్తి సాధారణ కంటే ఎక్కువ తేమను గ్రహించిందన్నారు.
Also Read: DCP Kavitha: సైబర్ క్రిమినల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి.. డీసీపీ దార కవిత సూచనలు
20% నుంచి 25% వరకు పెరిగింది
సాధారణ పరిస్థితుల్లో, పత్తి కొనుగోలులో అనుమతించదగిన తేమ శాతం సుమారు 8% నుంచి 12% మధ్యలో ఉంటుందని, అయితే, ఈ తుపాన్ ప్రభావంతో ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో పత్తి తేమ శాతం 20% నుంచి 25% వరకు పెరిగిందన్నారు. దీంతో పత్తి ప్రస్తుత నియమావళి ప్రకారం కొనుగోలు చేయడానికి అనర్హంగా మారిందని, దీంతో ఇప్పటికే నష్టపోయిన వేలాది మంది రైతులు మరింత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
రైతులకు ఉపశమనం కలిగించే నిర్ణయం
ఈ అసాధారణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, ప్రస్తుతం అమల్లో ఉన్న తేమ ప్రమాణాల్లో సడలింపు ఇవ్వాలని కోరారు. ప్రస్తుత పత్తి కొనుగోలు సీజన్ ముగిసే వరకు లేదా ప్రభావితమైన పత్తి నిల్వలను సరిగా ఆరబెట్టేంత వరకు, 25% వరకు తేమ ఉన్న పత్తిని కొనుగోలు చేయడానికి అనుమతించాలనీ విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. సహాయక చర్య రైతుల ఆర్థిక నష్టాన్ని తగ్గించడమే కాకుండా, పత్తి సరఫరా వ్యవస్థ నిరంతరంగా కొనసాగడానికీ దోహదం చేస్తుందన్నారు. గతంలో కూడా సహజ విపత్తుల సందర్భాల్లో ఇలాంటి సడలింపులు ఇతర రాష్ట్రాలకు మంజూరు చేయబడ్డాయన్నారు. విజ్ఞప్తిని సానుకూలంగా పరిగణించి తెలంగాణ పత్తి రైతులకు ఉపశమనం కలిగించే నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామన్నారు.
Also Read: Kavitha: విద్యార్థిని శ్రీవర్షిత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలి : కవిత
