Samagra Shiksha: రాష్ట్ర విద్యాశాఖలో నిరంతరం శ్రమిస్తున్న సమ బీగ్ర శిక్షా ఉద్యోగుల పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై తెలంగాణ సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం కరీంనగర్ జిల్లా శాఖ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. పాఠశాలల్లో అమలు చేయబోతున్న ఫేస్ రికగ్నైజ్ సిస్టమ్ (FRS) హాజరు విధానాన్ని తాము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని, అయితే విధులకు సంబంధించి నిబంధనలు విధించడంలో చూపిస్తున్న శ్రద్ధను, తమ న్యాయమైన సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ఎందుకు చూపడం లేదని జిల్లా అధ్యక్షులు గుండా రాజిరెడ్డి(Guunda Rajireddy), ప్రధాన కార్యదర్శి చంద్రగిరి మహేష్(Mahesh) ప్రశ్నించారు.
మహిళా ఉద్యోగులకు..
ముఖ్యంగా ఎన్నికలకు ముందు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Reanth Reddy) హన్మకొండ ఏకశిలా పార్కు వేదికగా సమగ్ర శిక్షా ఉద్యోగుల సమ్మెకు మద్దతు తెలుపుతూ ఇచ్చిన హామీలు నేటికీ కార్యరూపం దాల్చకపోవడం శోచనీయమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తామని, సమాన పనికి సమాన వేతనం సూత్రాన్ని అమలు చేస్తామని, మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మరియు భవిష్యనిధి వంటి సదుపాయాలు కల్పిస్తామని ఇచ్చిన వాగ్దానాలు రెండేళ్లు గడిచినా అమలుకు నోచుకోలేదని వారు మండిపడ్డారు. ప్రభుత్వం తలుచుకుంటే చాయ్ తాగే లోపు జీవో ఇచ్చి సమస్యలను పరిష్కరించవచ్చని నాడు ప్రతిపక్ష నేతగా రేవంత్ రెడ్డి చెప్పిన మాటలను ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తూ, నేడు అధికారంలో ఉన్నా తమ గోడును పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.
ఇది పచ్చి శ్రమ దోపిడీ
పీజీ(PG), బీఎడ్(BED), టెట్(TET) వంటి అత్యున్నత అర్హతలు కలిగి ఉండి, ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా విధులను నిర్వర్తిస్తున్న తమకు నెలకు కేవలం రూ. 3,250 నుండి రూ. 19,500 మధ్య మాత్రమే వేతనం లభించడం అమానుషమని, ఇది పచ్చి శ్రమ దోపిడీ అని వారు ధ్వజమెత్తారు. ఈ అరకొర జీతాలతోనే పెరిగిన నిత్యావసర ధరల మధ్య కుటుంబాన్ని పోషించుకుంటూ, మరోవైపు విధి నిర్వహణకు అవసరమైన స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ మరియు రవాణా ఖర్చులను భరించడం అత్యంత భారంగా మారిందని పేర్కొన్నారు. పని చేయించుకునేటప్పుడు విద్యాశాఖలో భాగమేనని చెబుతూ, హక్కుల దగ్గరకు వచ్చేసరికి ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సొసైటీ అని, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని చేతులు దులుపుకోవడం ప్రభుత్వ ద్వంద్వ నీతికి నిదర్శనమని వారు విమర్శించారు.
నగదు రహిత వైద్య సదుపాయం
గత ఏడాది డిసెంబర్ నుండి ఈ ఏడాది జనవరి వరకు నిర్వహించిన నిరవధిక సమ్మె కాలంలో క్యాబినెట్ సబ్ కమిటీ ద్వారా సమస్యలను పరిష్కరిస్తామని ఇచ్చిన హామీలను ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలని వారు కోరారు. చనిపోయిన సమగ్ర శిక్షా ఉద్యోగుల కుటుంబాలకు రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించడంతో పాటు, ఐదు లక్షల నగదు రహిత వైద్య సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లిస్తూ, పేస్కేల్(Pay Scale) మరియు ఉద్యోగ భద్రత కల్పిస్తూ ఎఫ్.ఆర్.ఎస్(FRS) విధానాన్ని అమలు చేయాలని, అప్పుడే ఉద్యోగులకు నిజమైన న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించి, ఇచ్చిన మాట ప్రకారం సమగ్ర శిక్షా ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపాలని, లేనిపక్షంలో తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.

