Sridhar Babu: భవిష్యత్ తరాల కోసం పారదర్శకంగా హిల్ట్ పాలసీ తీసుకొస్తున్నామని, పారిశ్రామిక ప్రగతి కంటే ప్రజల ప్రాణాలే ముఖ్యమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Sridhar Babu) స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు పాలసీ తీసుకొచ్చామన్నారు. శాసనసభలో హిల్ట్ పాలసీపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వం చారిత్రాత్మక బాధ్యతను భుజానికి ఎత్తుకున్నదని, మన పిల్లల కోసం, రేపటి తరాల భవిష్యత్తు కోసం, ఈ నేల మనుగడ కోసం తాము హిల్ట్ పాలసీ పేరిట చారిత్రాత్మక మార్పు వైపు మొదటి అడుగు వేశామన్నారు. అయినా కూడా కొందరు కావాలని ఈ పాలసీలో ఏదో మతలబు ఉందంటూ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ పాలసీని చాలామంది కేవలం ఒక ల్యాండ్ ట్రాన్స్‌ఫర్మేషన్‌గా మాత్రమే చూస్తున్నారని, భూమి వినియోగం మాత్రమే మారుతున్నదని చెప్పారు. పారిశ్రామిక ప్రాంతం కాస్త నివాస ప్రాంతంగా మారుతున్నదని కేవలం రెవెన్యూ రికార్డుల కోణం మాత్రమే చూస్తున్నారని, ఇది కేవలం చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ కాదు, రాబోయే తరాల కోసం ప్రభుత్వం చేస్తున్న ఒక ఆరోగ్యకరమైన పునాది అని స్పష్టం చేశారు.
పరిశ్రమల పక్కనే జీవనం మంచిది కాదు
ఈ పాలసీ ద్వారా రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేర్పులు చేయడం కాదు, తమ ఉద్దేశం పరిశ్రమలను ఓఆర్ఆర్ అవతలికి తరలించి, రేపటి తరాలకు స్వచ్ఛమైన గాలిని, స్వచ్ఛమైన నీటిని అందించాలన్నదే తమ సంకల్పంగా పేర్కొన్నారు. 50 ఏళ్ల కిందట పరిశ్రమల కోసం కేటాయించిన చోట నేడు లక్షలాది కుటుంబాలు నివసించే రెసిడెన్షియల్ కాలనీలు వెలిశాయన్నారు. నాడు ఫ్యాక్టరీకి, ఇంటికి మధ్య కిలోమీటర్ల దూరం ఉండేదని నేడు ఫ్యాక్టరీల పక్కనే అపార్ట్‌మెంట్లు ఉంటున్నాయని, విషపూరిత పొగ గాలిలో కలిసిపోయే అవకాశం లేకుండా నేరుగా బెడ్ రూమ్‌లోకి ప్రవేశిస్తున్నదని చెప్పారు. ఓవైపు నివాస గృహాలు మరోవైపు పరిశ్రమలు ఈ రెండింటి మధ్య బఫర్ జోన్ అంటూ లేకుండా పోయిందని ఇది కేవలం ప్లానింగ్ లోపం కాదని శాస్త్రీయంగా ఒక పెను ప్రమాదానికి బహిరంగ ఆహ్వానం పలకడమేనని చెప్పారు.
Also Read: Sridhar Babu: మున్సిపల్ పరిపాలన వ్యవస్థను పటిష్టం చేస్తాం : మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి!
ఢిల్లీలో ఏం జరుగుతుందో చూస్తున్నాం
స్వచ్ఛమైన గాలి, నీరు ఇవ్వలేని నాగరికత అసమర్థతే అవుతుందని శ్రీధర్ బాబు అభివర్ణించారు. అభివృద్ధి పేరిట పర్యావరణ విధ్వంసం జరగకూడదని చెప్పారు. పిల్లలకు ఆస్తులు కాదు శుభ్రమైన వాతావరణం ఇవ్వడమే నిజమైన వారసత్వమని పేర్కొన్నారు. బంగారు గిన్నెలో విషం పెడుతున్న పరిస్థితి ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రకృతి నాశనమైతే తిరిగి రాదని హెచ్చరించారు. మనమంతా భూమి యజమానులు కాదని, కేవలం ట్రస్టీలమేనన్నారు. ఢిల్లీలో నివాసాల మధ్య ఉన్న 168 పరిశ్రమలను, తరలించాలని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. చైనాలో బ్లూ స్కై విధానం ద్వారా భారీ పరిశ్రమలను నగరం అవతలికి తరలించారని వివరించారు. కాలుష్య కారక పరిశ్రమలు ఓఆర్ఆర్ లోపల ఉండకూడదనే హిల్ట్ పాలసీ అమలు చేస్తున్నట్లు, దీనిపై పారదర్శకంగా ముందుకెళ్తున్నట్టు వివరించారు. గతంలో విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్, మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో గ్యాస్ వంటి దుర్ఘటనలు చోటు చేసుకున్నాయని తెలిపారు. పారిశ్రామిక రసాయనాల వల్లే భూగర్భ జలాలు విషపూరితం అవుతాయని చెప్పారు. ఇప్పటికైనా మేల్కోకపోతే హైదరాబాద్ కూడా ఢిల్లీ పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
2013లోనే జీవో
రెడ్ అండ్ ఆరెంజ్ పరిశ్రమలను ఓఆర్ఆర్ అవతలికి తరలించాలని 2013లోనే జీఓ ఇచ్చారని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. ప్రజల భవిష్యత్ దృష్ట్యా రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలన్నారు. ప్రజలను కాలుష్యం నుంచి రక్షించాలనే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు. హిల్ట్ పాలసీ బయటకు రాకముందే విమర్శిస్తున్నారన్నారు. ప్రభుత్వ భూములు అడ్డగోలుగా ఇస్తున్నారని మాట్లాడుతున్నారని, కనీస సమాచారం తెలియకుండా బీఆర్ఎస్, బీజేపీలు విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ హిల్ట్ పాలసీపై సద్విమర్శలు చేస్తే స్వీకరిస్తామని, 6 నెలల గడువు ఇస్తామని పేర్కొన్నారు. ఎవరైనా స్వచ్ఛందంగా ముందు కొస్తేనే భూములు కన్వర్ట్ చేస్తామని స్పష్టం చేశారు. పారిశ్రామికవేత్తల భూములు ప్రభుత్వానివి అంటూ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. దశాబ్దాల కిందటే గత ప్రభుత్వాలు వారికి భూములు అమ్మేశాయని గుర్తు చేశారు. మనం భూ యజమానులం కాదని, ట్రస్టీలం మాత్రమేనని వ్యాఖ్యానించారు. ల్యాండ్ కన్వర్షన్‌పై బలవంతం ఏమీ లేదన్నారు. పారిశ్రామికవేత్తలకు ఇష్టమైతేనే ల్యాండ్ కన్వర్షన్ చేస్తామని తెలిపారు.
ఆనాడు ఏం చేశారు?
గత ప్రభుత్వం 2020 డిసెంబర్ 10న ఓ పాలసీని తీసుకొచ్చి ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేసేందుకు ప్రయత్నించిందని, ఇప్పుడు తమను విమర్శిస్తున్న బీజేపీ నాయకులు అప్పుడు ఎక్కడికి వెళ్లారు, ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. మీ రెండు పార్టీల మధ్య ఉన్న దోస్తానా ఏంటి అని నిలదీశారు. నిపుణులతో చర్చించిన తర్వాతే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తాను ఈ హెల్త్ పాలసీని రూపొందించామని వివరించారు. నిబంధనల మేరకు అందర్నీ సంప్రదించిన తర్వాతనే కన్వర్షన్ ఫీజును నిర్ణయించామని వెల్లడించారు. ఎలాంటి అనుమానాలకు తావు లేదని, ఈ పాలసీ కింద కన్వర్ట్ చేసే భూములు ప్రభుత్వానికి చెందినవి కావని స్పష్టం చేశారు.
Also Read: Sridhar Babu: ఎలివేటెడ్ కారిడార్ అలైన్‌మెంట్ నో చేంజ్.. జీహెచ్ఎంసీ విభజనపై మంత్రి శ్రీధర్ బాబు!

