Sridhar Babu: మహానగరంలో రోజురోజుకీ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెడుతూ, రాకపోకలు మరింత వేగంగా సాగేందుకు హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న రెండు ఎలివేటెడ్ కారిడార్ల అలైన్‌మెంట్ మార్పులకు ఎలాంటి అవకాశం లేదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు క్లారిటీ ఇచ్చారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల పర్వంలో భాగంగా బీజేపీ సభ్యుడు పాల్వాయి హరీశ్ బాబు మాట్లాడుతూ, మల్కాజ్‌గిరి సమీపంలోని ఆర్కేపురం వద్ద నిర్మిస్తున్న పనుల వల్ల సుమారు 300 మధ్యతరగతి, రిటైర్డ్ డిఫెన్స్ ఉద్యోగుల నివాసాలు పూర్తిగా కోల్పోతున్నారని, వారిని నిరాశ్రయులను చేయకుండా అలైన్‌మెంట్ మార్చాలని కోరారు. దీనికి శ్రీధర్ సమాధానం చెబుతూ, ఈ కారిడార్ల కోసం స్థల సేకరణ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి రక్షణ శాఖకు చెందిన 120 ఎకరాల స్థలాన్ని సేకరించారని, ఆ ప్రక్రియ తుది దశలో ఉందని వివరించారు. కారిడార్‌కు ఒకవైపు చెరువు ఉండటం వల్ల అలైన్ మెంట్ మార్చడం వీలు పడదని స్పష్టం చేశారు. త్వరలోనే క్షేత్ర స్థాయిలో ఈ ప్రాజెక్టు పనులు మొదలుకానున్నట్లు మంత్రి సభా ముఖంగా వెల్లడించారు.
Also Read: Minister Sridhar Babu: విద్యలో సమూల మార్పులే ప్రభుత్వ లక్ష్యం : టీచర్ల సమస్యలపై శ్రీధర్ బాబు భరోసా!
తీవ్ర అసహనం
అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల ప్రవర్తనను సీరియస్‌గా తీసుకుని తగిన చర్యలు తీసుకోవాలని శ్రీధర్ బాబు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను కోరారు. సభలో వ్యక్తిగత దూషణలు చేయవద్దని స్పీకర్ సూచించినప్పటికీ, బీఆర్ఎస్ సభ్యులు సభా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం సరికాదన్నారు. బీఏసీ సమావేశంలో చర్చలన్నింటికీ హాజరవుతామని చెప్పిన వారు, ఇప్పుడు సభకు రాకుండా పత్తా లేకుండా పోయారని ఎద్దేవా చేశారు. సభ నుంచి బయటకు వెళ్లిన తర్వాత సభ గురించి, స్పీకర్ హోదా గురించి అనుచితంగా మాట్లాడటాన్ని తీవ్రంగా పరిగణించాలని కోరారు.
విభజనపై క్లారిటీ
జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించబోతున్నారన్న ఊహాగానాలపై మంత్రి స్పష్టత ఇచ్చారు. అటువంటి ప్రతిపాదన ఏదీ ప్రస్తుతం ప్రభుత్వం వద్ద లేదని, సభలో లేని బీఆర్ఎస్ సభ్యుడు హరీశ్ రావు అడిగిన ప్రశ్నకు సమాధానంగా వెల్లడించారు. జీహెచ్ఎంసీకి ప్రస్తుతం ఉన్న అప్పుల వివరాలను కూడా మంత్రి సభ ముందుంచారు. డిసెంబర్ 31, 2025 నాటికి జీహెచ్ఎంసీ బకాయిలు రూ. 4,717.81 కోట్లుగా ఉన్నాయని, ఈ అప్పులన్నీ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసినవేనని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం గత 12 నెలల్లో కొత్తగా ఎలాంటి అప్పులు చేయలేదని, ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు సాగుతున్నామని మంత్రి శ్రీధర్ స్పష్టం చేశారు.
Also Read: Minister Sridhar Babu: డిజిటల్ సేఫ్టీలో రోల్ మోడల్‌గా తెలంగాణ.. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు!

