Minister Sridhar Babu: విద్యారంగం బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) స్పష్టం చేశారు. హైదరాబాద్ నాగోల్‌లో తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్) 80 వసంతాల అభ్యుదయోత్సవం- విద్యా సదస్సు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీధర్ మాట్లాడుతూ, రాష్ట్ర సాధనలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమైనదని కొనియాడారు. అదే ఉద్యమ స్ఫూర్తితో ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని కోరారు.
11 వేల టీచర్ పోస్టుల భర్తీ
విద్యాశాఖలోని సమస్యలను నేరుగా పరిష్కరించేందుకే ముఖ్యమంత్రే స్వయంగా ఆ శాఖను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన అతి తక్కువ సమయంలోనే 37 వేల మందికి బదిలీలు, 23 వేల మందికి పదోన్నతులు కల్పించామని గుర్తు చేశారు. 11 వేల టీచర్ పోస్టుల భర్తీ కోసం డీఎస్సీ నిర్వహించి రికార్డు స్థాయి టైం కేవలం నాలుగు నెలల్లోనే నియామకాలు పూర్తి చేశామని తెలిపారు. విద్యారంగంలో సమూల సంస్కరణల కోసం విద్యా కమిషన్ ఏర్పాటు చేశామని, కమిషన్ అందించే నివేదికను సంపూర్ణంగా అమలు చేస్తామని అన్నారు.
Also Read: Minister Sridhar Babu: నైపుణ్యాలే యువత భవిష్యత్తు.. ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు!
సమస్యల పరిష్కారానికి హామీ
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం కారణంగానే ఉపాధ్యాయుల ఆర్థిక సమస్యల పరిష్కారం కొంత ఆలస్యమవుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. 317 జీవో బాధితులకు న్యాయం చేస్తామని, ప్రతి నెలా ఒకటో తేదీనే వేతనాలు చెల్లిస్తున్నామని తెలిపారు. ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేసి ప్రభుత్వ పాఠశాలలను దేశంలోనే అగ్రగామిగా నిలపాలని కోరారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల పిల్లల కోసం నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు విద్యా వ్యవస్థలో పెను మార్పులు తెస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యా కమిషన్ నివేదిక ఆధారంగా రాబోయే రోజుల్లో మరిన్ని సంస్కరణలు అమలు చేస్తామని మంత్రులు స్పష్టం చేశారు. అనంతరం సదస్సు ముఖ్య వక్త ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాశీం మాట్లాడుతూ, ఉపాధ్యాయులు తమ వృత్తి నిబద్ధత, సామాజిక బాధ్యతను పెంపొందించుకోవాలని కోరారు. సంక్షోభంలో ఉన్న విద్యను కాపాడే బాధ్యత కూడా ఉపాధ్యాయులపై ఉందన్నారు.
Also Read: Minister Sridhar Babu: ప్రభుత్వం వేసే ప్రతి అడుగు భావితరాల కోసమే: మంత్రి శ్రీధర్ బాబు

