Minister Sridhar Babu: భవిష్యత్ అవసరాలకు తగిన నైపుణ్యాలు పెంచుకోగలిగితేనే యువత తాము కోరుకున్న ఉద్యోగాలను పొందగలుగుతారని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) సూచించారు. కాలానుగుణంగా ఎదురయ్యే సవాళ్లను అధిగమించిన వారే తమ వృత్తిలో నిలదొక్కుకోగలుగుతారని ఆయన అన్నారు. టీ-వర్క్స్ ప్రాంగణంలో పాత్ వే టు తైవాన్ పేరుతో తైవాన్‌లో ఉద్యోగాల కల్పనకు జరిగిన మొదటి రౌండ్ ఇంటర్వ్యూల కార్యక్రమాన్ని శ్రీధర్ ప్రారంభించారు.
అవగాహన ఒప్పందంపై సంతకాలు
ఈ సందర్భంగా టీ-వర్క్స్ సీఈఓ జోగిందర్ తనికెళ్ల, తైవాన్ ప్రభుత్వ సంస్థ టేలెంట్ తైవాన్ ప్రతినిధి ఈడెన్ లియెన్‌లు మంత్రి సమక్షంలో ఉద్యోగాల కల్పన, ఉన్నత విద్యా కార్యక్రమాలకు సంబంధించిన అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. తైవాన్‌కు చెందిన రియల్ టెక్, లాజిటెక్, మీడియాటెక్, విస్ట్రాన్, హిమాక్స్, కౌపాంగ్, ఐటిఆర్ఐ వంటి ప్రముఖ కంపెనీలు ఈ ప్రోగ్రాం కోసం ముందుకొచ్చాయి. ఈ ప్రోగ్రాం ద్వారా తైవాన్ కంపెనీలు ఇక్కడి విద్యార్థులను మొదటి రౌండ్ ప్రాథమిక ఎంపిక ప్రక్రియ పూర్తి చేసుకుని తదుపరి దశలో తైవాన్‌కు ఆహ్వానిస్తాయి. మొదటి విడతగా 20 ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులు తొలిదశ ఇంటర్వ్యూల కోసం హాజరయ్యారు. తైవాన్ కంపెనీలు ప్రతిభావంతుల వేటలో దేశం మొత్తం మీద తెలంగాణాను ఎంపిక చేసుకున్నందుకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.
Also Read: Minister Sridhar Babu: ప్రభుత్వం వేసే ప్రతి అడుగు భావితరాల కోసమే: మంత్రి శ్రీధర్ బాబు
ఆరు నెలల మాండరిన్ భాషా శిక్షణ
తొలిదశ ఇంటర్వ్యూలు పూర్తి చేసుకున్న విద్యార్థులు ఆరు నెలల పాటు ఇక్కడ (చైనీస్) మాండరిన్ భాషను నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాత మాండరిన్ భాష, సాంకేతిక పరిజ్ఞానాల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. ఎంపికైన విద్యార్థులకు తైవాన్‌లో ఉద్యోగావకాశాలు కల్పిస్తారని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ వెంకటేశ్ చల్లవర్ తమ పరివర్తన్ ఫండ్ కింద టీ-వర్క్స్ ఫౌండేషన్‌కు రూ.1.5 కోట్ల నిధులను సమకూర్చనున్నట్టు శ్రీధర్ సమక్షంలో ప్రకటించారు. కేవలం 2.2 కోట్ల జనాభా ఉన్న తైవాన్ చిప్‌ల తయారీ, టెక్నాలజీ రంగాల్లో ప్రపంచమంతా ఆధారపడే స్థాయికి ఎదిగిందని శ్రీధర్ బాబు గుర్తు చేశారు. భవిష్యత్తు టెక్నాలజీల గురించి తైవాన్ ముందు చూపు, శ్రమించే తత్వాన్ని తెలంగాణా యువత ఆదర్శంగా తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రపంచ అవసరాలను గుర్తించి అందుకు అనుగుణంగా అనువర్తనం చెందడం వల్లే తైవాన్‌కు ఇదంతా సాధ్యమైందని ఆయన కొనియాడారు. కార్యక్రమంలో తైవానీస్ యూనివర్సిటీల ప్రతినిధులు కూడా పాల్గొని, తమ విద్యాసంస్థల ప్రాముఖ్యతను వివరించారు.
Also Read: Minister Sridhar Babu: తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో మహిళల కీలక పాత్ర : మంత్రి శ్రీధర్

