Minister Sridhar Babu: భవిష్యత్తు కోసం కేవలం ఎదురు చూడటం కాదని, దానిని మనమే నిర్మించాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్- 2025లో సోమవారం ఆయన పాల్గొని మాట్లాడారు. తమ ప్రభుత్వం వేసే ప్రతి అడుగు, చేసే ఆలోచన భావితరాల ఆశయాలు, అవసరాలకు అనుగుణంగా రేపటి తెలంగాణ కోసమేనని తెలిపారు. ‘తెలంగాణ రైజింగ్’ ఫీనిక్స్ పక్షి స్ఫూర్తితో ఇన్నోవేషన్, హ్యూమన్ క్యాపిటల్, సుస్థిరత, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్‌గా తెలంగాణను మార్చాలనే లక్ష్యంతోనే తెలంగాణ రైజింగ్‌కు శ్రీకారం చుట్టామన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న ఎకనామిక్ రీ అలైన్‌మెంట్స్, టెక్నలాజికల్ డిస్రప్షన్, క్లైమేట్ అన్‌సెర్టెనిటీ లాంటి సవాళ్లను అవకాశాలుగా మలుచుకొని ముందుకు వెళ్తున్నామని మంత్రి వివరించారు. ఈ దార్శనికతతో కూడిన అడుగుల ద్వారా 2047 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.
జాతీయ సగటు కంటే..
భౌగోళిక విస్తీర్ణం, జనాభాలో చిన్న రాష్ట్రమైనా, దేశ జీడీపీలో 5 శాతం వాటాను తెలంగాణ కలిగి ఉందని శ్రీధర్ బాబు గుర్తు చేశారు. 2024-2025లో రాష్ట్ర జీఎస్‌డీపీ వృద్ధి రేటు 10.1 శాతం కాగా, జాతీయ సగటు 9.9 శాతంగా మాత్రమే నమోదైంది. రాష్ట్ర తలసరి ఆదాయం రూ.3.79 లక్షలు, ఇది జాతీయ సగటు కంటే 1.8 రేట్లు ఎక్కువ అని వివరించారు. రాష్ట్ర ఇండస్ట్రియల్ (7.6 శాతం), సేవల రంగం (11.9 శాతం) వృద్ధి రేట్లు కూడా జాతీయ సగటు కంటే ఎక్కువగా నమోదవడం తమ ప్రభుత్వ పనితీరుకు నిలువెత్తు నిదర్శనమన్నారు. మాన్యుఫ్యాక్చరింగ్, కన్ స్ట్రక్షన్, మైనింగ్, క్వారీయింగ్ వంటి ఇండస్ట్రియల్ సబ్ సెక్టార్లలోనూ ఇదే వృద్ధి కనిపించిందని తెలిపారు.
Also Read: Crime News: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. అతి దారుణంగా కత్తితో గొంతు కోసి మరదలిని చంపిన బావ
ఏఐ విప్లవాత్మక అడుగులు
దేశంలోనే తొలి ఏఐ పవర్డ్ విలేజ్‌గా మారిన మంథని నియోజకవర్గంలోని ఒక మారుమూల గ్రామం రేపటి తెలంగాణకు మార్గదర్శిగా నిలిచిందని మంత్రి ఉదహరించారు. భారత్ ఫ్యూచర్ సిటీ, తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్, ఏఐ ఆధారిత తెలంగాణ డేటా ఎక్స్‌ఛేంజ్, ఏఐ యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీ వంటి విప్లవాత్మక అడుగులు ప్రపంచపటంలో తెలంగాణను ప్రత్యేకంగా నిలుపుతాయన్నారు. రేపటి కోసం, భవిష్యత్ తరాలకు భరోసాగా తెలంగాణతో కలిసి భవిష్యత్తును నిర్మించేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలు, నిపుణులను మంత్రి ఈ సందర్భంగా కోరారు.
Also Read: IndiGo Crisis: ఇండిగో సంక్షోభం.. ఏకంగా 4500 విమానాలు రద్దు.. సమస్యలపై కేంద్రం ఫోకస్

