Chenjarl Sarpanch Election: చెంజర్ల గ్రామ సర్పంచ్ అభ్యర్థిని జీ.రాజేశ్వరి
కరీంనగర్, స్వేచ్ఛ: ‘‘సర్పంచ్‌గా గెలిచాక నేను స్టాంప్ పేపర్‌పై రాసి ఇచ్చిన హామీలు నిర్దేశిత గడువులోగా నెరవేర్చకపోతే ప్రజల చెప్పులు మెడలో వేసుకుని రాజీనామా చేస్తా’’ అని కరీంనగర్ జిల్లా చెంజర్ల గ్రామ (Chenjarl Sarpanch Election) సర్పంచ్ అభ్యర్థిని జీ రాజేశ్వరి సాహసోపేత హామీ ఇచ్చారు. స్థానిక సంస్థల పోటీలో భాగంగా చెంజర్ల గ్రామం నుంచి సర్పంచ్‌గా ఆమె పోటీ చేస్తున్నారు. గెలిచాక గ్రామ అభివృద్ధి కోసం కొన్ని పనులు చేస్తానంటూ స్టాంప్ పేపర్ మీద ఆమె రాసిచ్చారు. గ్రామస్తులకు ఇచ్చిన మాట ప్రకారం పని చేస్తానని హామీ ఇచ్చారు. తనను గెలిపిస్తే గ్రామానికి 12 పడకల ఆసుపత్రిని తీసుకొస్తానని, గ్రామస్తుల అవసరాల కోసం మినీ ఫంక్షన్ హాల్ నిర్మిస్తానని చెప్పారు. యువతకు ఫిట్‌నెస్ పొందేందుకు ఓపెన్ జిమ్ ఏర్పాటు ఏర్పాటు చేస్తానని వివరించారు. అంతేకాకుండా, గ్రామంలో విచ్చలవిడిగా ఉన్న కోతుల సమస్యను ప్రధానంగా పరిష్కరిస్తానని బాండ్ పేపర్‌పై రాసిచ్చిన హామీల్లో పేర్కొన్నారు. వీటన్నింటిని మూడేళ్లలో పూర్తి చేయకపోతే స్వచ్ఛందంగా రాజీనామా చేస్తానని చెప్పారు.
Read Also- Telangana Agriculture: సాగులో తెలంగాణ సరికొత్త రికార్డ్.. పంజాబ్‌ను దాటేసిన తెలంగాణ
ఆసక్తి రేకెత్తిస్తున్న హామీ
కాగా, సాధారణంగా ఎన్నికల హామీలు కేవలం మాటలకే పరిమితం అవుతుంటాయి. కానీ, ఈ సర్పంచ్ అభ్యర్థి ఏకంగా స్టాంప్ పేపర్‌పై సంతకం చేయడం చెంజర్ల గ్రామస్తులలో చర్చకు దారితీసింది. ఆమె సాహసోపేత వాగ్దానం పట్ల కొంతమంది ప్రశంసిస్తుండగా, మరికొందరు ఆమె చిత్తశుద్ధిని పరీక్షించేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. ముఖ్యంగా కోతుల బెడద పరిష్కారం, 12 పడకల ఆసుపత్రి హామీలు స్థానికులను బాగా ఆకట్టుకుంటున్నాయని తెలుస్తోంది. ఈ హామీ రాజేశ్వరి కేవలం గెలుపునకు బాటలు వేయవచ్చని భావిస్తున్నారు. అంతేకాదు, నిబద్ధతతో కూడిన రాజకీయాలకు కొత్త ఒరవడి తీసుకువచ్చినట్లు అయ్యిందని పలువురు స్థానికులు విశ్లేషిస్తున్నారు.
ఒకవేళ రాజేశ్వరి ఈ ఎన్నికల్లో గెలిచి, మూడేళ్ల గడువులోగా హామీలను నెరవేర్చగలిగితే, స్థానిక ప్రజాప్రతినిధులు జవాబుదారీగా ఉండటానికి ఆమె ఒక ఉదాహరణగా నిలుస్తారని భావిస్తున్నారు.. లేదంటే, హామీ ఇచ్చినట్టుగా చెప్పులు మెడలో వేసుకుని రాజీనామా చేస్తాననే షరతుకు తలొగ్గాల్సి ఉంటుందని, ఈ వాగ్దానం ఆమెపై తీవ్ర ఒత్తిడిని పెంచుతోందని విశ్లేషిస్తున్నారు. మొత్తానికి రాజేశ్వరి హామీలు ఎన్నికల ఫలితం, ఆమె భవితవ్యంపై ఆసక్తిని రేకెత్తిస్తోంది.
వడ్డెమాన్ సర్పంచ్‌గా గెలిపించాలి
నాగర్ కర్నూల్, స్వేచ్ఛ: నాగర్‌కర్నూల్ నియోజకవర్గం బిజినేపల్లి మండలం వడ్డెమాన్ గ్రామ సర్పంచ్‌గా గెలిపిస్తే నిరంతరం ప్రజల సమస్యలు పరిష్కరిస్తానని కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి రేవల్లి అనిత వెంకట్ రెడ్డి అభ్యర్థించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ఆమె ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… గ్రామంలోనీ సీసీ రోడ్లు, డ్రైనేజీ, తాగు నీటి సమస్యలను పరిష్కరిస్తానన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి సహకారంతో గ్రామాన్ని గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఉంగరం గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

