Chevella Bus Accident: చేవెళ్ల బస్సు ప్రమాదఘటనతో ఓవర్ లోడ్ వాహనాల నియంత్రణ అంశం తెరమీదకు వచ్చింది. ఎవరు ఓవర్ లోడ్ ను కంట్రోల్ చేయాలి. కమర్షియల్ వాహనాలు ఏ మేరకు తరలించాలి. ఎంత కెపాసిటీ ఉండాలి.. లేకుంటే ఆ వాహనాలపై ఎంతపెనాల్టీ వేయాలి. నిబంధనలు అతిక్రమిస్తే వాటిపై ఎలాంటి కేసులు నమోదు.. వాహనం సీజ్ చేయాలంటే ఏయే అంశాలు పరిగణలోకి తీసుకుంటారనే అంశాలు ఇప్పుడు జోరుగా చర్చనడుస్తుంది. రవాణాశాఖ అధికారులు తీసుకోవాల్సిన చర్యలు.. ప్రస్తుతం చేపడుతున్న చర్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. వారి నిర్లక్ష్యంతోనే ఓవర్ లోడ్ వాహనాలు ఇష్టానుసారంగా తీరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు విజిలెన్స్ బృందాలు సైతం ఏం చేస్తున్నాయనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. కమర్షియల్ వాహనాలు అనుమతి (పరిమితి)కి మించి రవాణా చేయవద్దనే నిబంధనలు ఉన్నాయి.
జీరో బిల్లులతో ఓవర్ లోడ్
అయితే ఆ వాహనాలను నిత్యం మానిటరింగ్ చేయాల్సి ఉంటుంది. రవాణాశాఖ అధికారులు ప్రతి రోజూ తనిఖీలు చేయాల్సి ఉంది. కానీ వారి ఉదాసీనత కారణంగానే కమర్షియల్, మైన్స్ మినరల్స్ తరలించే వాహనాలు నిబంధనలు పాటించడం లేదని సమాచారం. తనిఖీ చేయాల్సిన అధికారులు కేవలం కార్యాలయాలకే పరిమితం అవుతున్నారని, రాష్ట్రంలో ఏదైన ఘటన జరిగితేనే స్పందిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి తోడు మైనింగ్ వ్యాపారులు(క్రషర్ మిషన్ వ్యాపారులు) నిబంధనలకు తిలోదకాలు ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వేబిల్లులు లేకుండా అంటే మైనింగ్ రాయల్టీ చెల్లించకుండా జీరో బిల్లులతో ఓవర్ లోడ్ వేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, టిప్పర్లు, లారీలు ఓవర్ లోడ్, ఓవర్ స్పీడ్ కారణంగానే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులే పేర్కొంటున్నారు. వాటిపై చర్యలు తీసుకోకుండా కొంతమంది అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తనిఖీలు చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం.. సిబ్బందికి సైతం డ్యూటీలు సరిగ్గా వేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
పరిమితికి మించి తరలించవద్దనే రవాణాశాఖ యాక్టు
మరోవైపు టిప్పర్లు ఇసుక, కంకర, డస్ట్ తరలించే సమయంలో విధిగా టార్ఫలిన్లు కట్టాలనే నిబంధన ఉంది. వీటితో పాటు కర్రలు, చెత్తతరలింపు, ఇతరాత్ర తరలించే కమర్షియల్ వాహనాలు, ప్రయాణికులను తరలించే వాహనాలు సైతం పరిమితికి మించి తరలించవద్దనే రవాణాశాఖ యాక్టు చెబుతుంది. టార్ఫలిన్లు లేకుండా ఇసుక, డస్టు, కంకర తరలించే వాహనాలపై 10వేలు జరినామా విధించాలని యాక్టులోనే పేర్కొన్నారు. గతంలో హెచ్చరించినా టార్ఫలిన్లు కట్టకపోతే వాహనంసైతం సీజ్ చేయవద్దని అధికారులు పేర్కొంటున్నారు. టార్పాలిన్లు కట్టకుండా ఇసుక, డస్టు తరలిస్తున్న సమయంలో వెనుకనుంచే వచ్చే వాహనదారులపై పడటం, కంకర సైతం రోడ్డుపై పడటంతో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్న సంఘటనలు ఉన్నాయి. వాహనదారులు మృతి చెందిన సందర్బాలు ఉన్నాయి.
యాక్షన్ తీసుకునేందుకు ప్రభుత్వం విజిలెన్స్ బృందాలు
అంతేగాకుండా టిప్పర్లు, కమర్షియల్ వాహనాలు ఓవర్ లోడ్ వెళ్లే వాటిపై యాక్షన్ తీసుకునేందుకు ప్రభుత్వం విజిలెన్స్ బృందాలు సైతం ఏర్పాటు చేసింది. ఆ బృందంలో 20 నుంచి 30 మంది వరకు ఉంటారని, అందులో పోలీసు, మైనింగ్, ఆర్టీఏ, జీఎస్టీ, పారెస్టు అధికారులు సైతం ఉంటారు. తనిఖీల్లో ఎవరికి సంబంధించినవి వెలుగులోకి వస్తే ఆశాఖ అధికారులు చర్యలు తీసుకుంటారు. అయితే రాయల్టి ఇన్ స్పెక్టర్లు మహిళలు కావడం, సివిల్ డ్రస్సులో ఉండటంతో టిప్పర్, కమర్షియల్ వాహన డ్రైవర్లు వాహనాలు ఆపడం లేదని, ఆపినా వారిపైనే బెదిరింపులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆ బృందంలో ఆర్టీఏ అధికారులు సైతం ఉండాలి.
ఉన్నతాధికారుల నిర్లిప్తత ధోరణి కారణం
కానీ ఉన్నతాధికారుల నిర్లిప్తత ధోరణి కారణంగానే తనిఖీలు పూర్తి స్థాయిలో చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో వాహనాలు ఓవర్ లోడ్ తో వెళ్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు రవాణాశాఖ అధికారులు కొన్ని సందర్భాల్లో ఓవర్ లోడ్ తో వెళ్తున్న వాహనాలపై కేసులు రాయలంటే కూడా జంకుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి సిబ్బందికి తగిన భరోసా లేకపోవడం, కేసులు రాస్తే కూడా ఒత్తిళ్లు వస్తున్నట్లు సమాచారం. దీంతో కొంత ఉద్యోగులు సిబ్బందిలో కొంత నైరాశ్యం నెలకున్నట్లు సమాచారం. దీనికి తోడు నిబంధనలు అతిక్రమించిన క్రషర్, లారీ యజమానులపై కేసులు రాస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారని, సీజ్ చేసిన వాహనాలను సైతం వెంటనే తీసుకెళ్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఎవరు బాధ్యులు
ఇది ఇలా ఉంటే రావాణా శాఖ అధికారులు వాహనాలను సీజ్ చేస్తే భద్రపరిచేందుకు సీజింగ్ యార్డులు సైతం లేకపోవడంతో కేవలం కేసులకే పరిమితం అవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అదికాకుండా సీజింగ్ యార్డులు ఉంటే అధిక లోడ్ తో వెళ్లే వాహనాలను సీజ్ చేస్తే టప్పర్, కమర్షియల్ వాహన యజమానులు సైతం భయపడతారని, ఓవర్ లోడ్ కంట్రోల్ కు వస్తుందని పలువురు ఆర్టీఏ ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా ఓవర్ లోడ్ తో వెళ్తున్న వాహనాల నియంత్రణ బాధ్యత ఆర్టీఏ, మైనింగ్, క్రషర్ యజమానులు, పోలీసులా? ఎవరు బాధ్యులు అనేది ప్రభుత్వమే స్పష్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికైనా ఆయా శాఖల ఉన్నతాధికారులు స్పందించి విజిలెన్స్ టీంలను పటిష్టం చేస్తే తప్ప ఓవర్ లోడ్ నియంత్రణ సాధ్యం కాదని పలువురు పేర్కొంటున్నారు.
Also Read: Chevella Bus Accident: బస్సు ప్రమాదంలో తీవ్ర విషాదం.. ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి
