TGSRTC: రాబోయే బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో ప్రజలకు రవాణాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా టీజీఎస్ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 7754 స్పెషల్ బస్సులను నడపాలని నిర్ణయించింది. అందులో 377 స్పెషల్ సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించనున్నట్లు టీజీఎస్ఆర్టీసీ ప్రకటించింది. ఈ నెల 20 నుంచి అక్టోబర్ 2 వరకు ఈ ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు పేర్కొంది. తిరుగు ప్రయాణానికి సంబంధించి అక్టోబర్ 5, 6వ తేదిల్లోనూ రద్దీకి అనుగుణంగా బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ ఆర్టీసీ పేర్కొంది.
ఆ బస్టాండ్స్ నుంచి స్పెషల్ బస్సులు
హైదరాబాద్ లో ప్రధాన బస్టాండ్ ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్ తో పాటు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే కేపీహెచ్ బీ కాలనీ, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఉప్పల్ బస్టాండ్, దిల్ సుఖ్ నగర్, ఎల్బీనగర్, ఆరాంఘర్, తదితర ప్రాంతాల నుంచి ఈ ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ తెలిపింది. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి రాష్ట్రం నలుమూలలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు ఈ ప్రత్యేక బస్సులు నడవనున్నట్లు స్పష్టం చేసింది.
గతేడాది కంటే అదనంగా..
ఈ నెల 20తో పాటు 27 నుంచి 30 తేదివరకు అలాగే అక్టోబర్ 1, 5, 6 వ తేదిల్లో నడిచే స్పెషల్ బస్సుల్లోనే సవరణ ఛార్జీలు అమల్లో ఉంటాయని ఆర్టీసీ స్పష్టం చేసింది. ఆయా రోజుల్లో తిరిగే రెగ్యూలర్ సర్వీసుల చార్జీల్లో ఎలాంటి మార్పు ఉండదు. అవి యధావిధిగా ఉంటాయని తేల్చిచెప్పింది. ‘గత దసరా కంటే ఈ సారి అదనంగా 617 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశాం. రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంప్ లను ఏర్పాటు చేసి ప్రయాణికులకు అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నాం. రద్దీ ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం షామియానాలు, కూర్చీలు, తాగునీరు, తదితర మౌలిక సదుపాయాలతో పాటు పబ్లిక్ అడ్రస్ సిస్టంను ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశాం’ అని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ అన్నారు.
Also Read: Viral Video: గరిట ఎందుకు దండగ.. జేసీబీ ఉండగా.. పాపం తినేవారి పరిస్థితేంటో!
ప్రైవేటు వాహనాల్లో వెళ్లి చిక్కుల్లో పడొద్దు
బస్సుల్లో రద్దీ ఉందని ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించే వారికి సజ్జనార్ కీలక సూచనలు చేశారు. వైట్ నంబర్ ప్లేట్ గల ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించి.. ఇబ్బందులు పడొద్దని హితవు పలికారు. టీజీఎస్ఆర్టీసీలో ఎంతో అనుభవం గల డ్రైవర్లు ఉన్నారని వారు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తారని చెప్పారు. బతుకమ్మ, దసరా ప్రత్యేక సర్వీసుల్లో ముందస్తు రిజర్వేషన్ ను సంస్థ అధికారిక వెబ్ సైట్ tgsrtcbus.in లో చేసుకోవాలని కోరారు. దసరా స్పెషల్ సర్వీసులకు సంబంధించి పూర్తి సమాచారం కోసం టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని సూచించారు.