Kohli Rohit: టీమిండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ (Vijay Hazare Trophy)లో ఆడుతున్న సంగతి తెలిసిందే. ఇవాళ జరిగిన మ్యాచ్ లలో ఇరువురు తమ రాష్ట్ర జట్లకు ప్రాతినిథ్యం వహించారు. సిక్కింతో జరిగిన మ్యాచ్ లో ముంబయి తరపున రోహిత్ బరిలోకి దిగగా.. ఏపీతో మ్యాచ్ లో దిల్లీ బాయ్ విరాట్ కోహ్లీ మైదానంలోకి దిగాడు. ఈ క్రమంలో ఇరువురు శతకాలతో సత్తా చాటారు. తమ జట్ల విజయానికి బాటలు వేశారు.
దుమ్మురేపిన రోహిత్..
విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా ముంబయి, సిక్కిం జట్లు తలపడ్డాయి. జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ముంబయి తరపున రోహిత్ బరిలోకి దిగాడు. తొలుత బ్యాటింగ్ కు దిగిన సిక్కిం జట్టు 50 ఓవర్లలో 236-7 స్కోరు మాత్రమే చేసింది. ఛేదనలో ముంబయి ఓపెనర్ గా వచ్చిన రోహిత్.. 94 బంతుల్లోనే 155 పరుగులు చేశాడు. 18 ఫోర్లు, 9 సిక్సులతో సత్తా చాటాడు. తద్వారా తన ఇన్నింగ్స్ చూసేందుకు మైదానానికి తరలివచ్చిన అభిమానులను ఆనందంలో ముంచెత్తాడు. రోహిత్ స్వైర విహారంతో ముంబయి జట్టు 30.3 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి 237 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా రోహిత్ శర్మ ఎంపిక కావడం విశేషం.
విరాట్ పరుగుల వరద..
మరోవైపు బెంగళూరు వేదికగా ఏపీతో జరిగిన మ్యాచ్ లో దిల్లీ తరపున విరాట్ కోహ్లీ సైతం దుమ్మురేపాడు. 101 బంతుల్లో 131 పరుగులు చేసి సత్తా చాటాడు. 2010-11 తర్వాత విరాట్ విజయ్ హజారే ట్రోఫీ ఆడటం ఇదే తొలిసారి. అయినప్పటికీ తొలి మ్యాచ్ లోనే శతకం బాది తన సత్తా ఏంటో మరోమారు విరాట్ నిరూపించుకున్నాడు. 83 బంతుల్లోనే విరాట్ శతకం పూర్తి చేసుకోవడం గమనార్హం. అతడి ఇన్నింగ్స్ లో 14 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. కాగా దిల్లీ జట్టుకు కెప్టెన్ గా రిషబ్ పంత్ వ్యవహరిస్తున్నాడు. 35 పూర్తయ్యే సరికి దిల్లీ జట్టు 291-4 స్కోరు చేసింది. క్రీజులో రిషబ్ పంత్ (5*), ఆయుష్ బదోని (1*) ఉన్నారు.
Also Read: Telangana state: సీఎం రేవంత్ ఖాతాలో మరో ఘనత.. పారిశ్రామిక రంగంలో తెలంగాణ అగ్రస్థానం
విరాట్ పేరిట మరో ఘనత
కోహ్లీ తన సెంచరీ ఇన్నింగ్స్ తరువాత లిస్ట్ – ఏ క్రికెట్ లో 16,000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన రెండో భారతీయ ఆటగాడిగా విరాట్ నిలిచాడు. అయితే సచిన్ టెండూల్కర్ ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఓవరాల్ గా చూస్తే దేశవాళీ క్రికెట్ లో 16వేలకు పైగా పరుగులు చేసిన తొమ్మిదో ఆటగాడిగా కోహ్లీ నిలిచారు. సచిన్, రికీ పాంటింగ్, సంగాక్కర, వివియన్ రిచర్డ్స్ వంటి దిగ్గజాల సరసన కోహ్లీ చేరాడు.

