Telangana state: దేశ పారిశ్రామిరక రంగంలో తెలంగాణ రాష్ట్రం తనదైన మార్క్ చూపించింది. పరిశ్రమల స్థాపనకు భూములను సమకూర్చడంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. దేశంలో అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్ (CM Revanth Reddy) కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ను సైతం నిర్వహించి యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. ఈ క్రమంలోనే పారిశ్రామిక రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచి సత్తా చాటింది.
పరిశ్రమలకు అనుకూలంగా 96 శాతం భూమి
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ పరిధిలోని డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (DPIIT) ఆధ్వర్యంలో ఓ నివేదిక రూపొందింది. ఇండియా ఇండస్ట్రియల్ ల్యాండ్ బ్యాంక్ (India Industrial Land Bank – IILB) విడుదల చేసిన ఆ నివేదికలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. దీని ప్రకారం తెలంగాణలోని 157 పారిశ్రామిక వాడల్లో 32,033 హెక్టార్ల భూమిని అందుబాటులో ఉంచగా.. అందులో పరిశ్రమల ఏర్పాటు కోసం ఏకంగా 30,749 హెక్టార్ల భూమి సిద్ధంగా ఉందని DPIIT స్ఫష్టం చేసింది. పారిశ్రమల ఏర్పాటుకు ఏకంగా 96 శాతం భూమి అనుకూలంగా ఉన్నట్లు వెల్లడించింది.
ఏపీలో 10 శాతం మాత్రమే
మరోవైపు ఏపీలో ఉన్న 638 పారిశ్రామిక పార్కుల పరిధిలో 1,10,595 హెక్టార్ల భూమి ఉండగా.. అందులో కేవలం 10,747 హెక్టార్ల భూమి మాత్రమే పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నట్లు DPIIT తన నివేదికలో తెలిపింది. ఏపీలో 10 శాతం భూమి కూడా పరిశ్రమల ఏర్పాటుకు సిద్ధంగా లేదని స్పష్టం చేసింది. తాజా నివేదిక ప్రకారం దేశంలో మొత్తం 4,523 పారిశ్రామిక పార్కులు ఉన్నాయి. వాటి మొత్తం విస్తీర్ణం 7.70 లక్షల హెక్టార్లు కాగా.. ప్రస్తుతం 1.35 లక్షల హెక్టార్ల భూమి మాత్రమే పరిశ్రమల ఏర్పాటుకు అందుబాటులో ఉంది.
Also Read: UP Man: యూపీలో సంచలనం.. కుక్కలా మారిన యువకుడు.. కనిపించిన వారిపై దాడి
సీఎం రేవంత్ చర్యలు భేష్!
తెలంగాణను పరిశ్రమలకు నిలయంగా మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత కొంతకాలంగా తీవ్రంగా కృషి చేస్తోంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ పేరిట త్వరితగతిన పరిశ్రమల ఏర్పాటుకు అనుమతి ఇవ్వడం, పారిశ్రామిక వాడల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటు, విద్యుత్, డ్రైనేటీ వసతుల కల్పన వంటి చురుగ్గా సాగుతున్నాయి. ఐటీ, ఫార్మా, ఎలక్ట్రానిక్స్, ఆటోమెుబైల్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో తెలంగాణను అగ్రస్థానంలో నిలిపేందుకు సీఎం రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శ్రమిస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ రైజింగ్ విజన్ – 2047 పేరిట ఇటీవల డాక్యుమెంట్ ను సైతం సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు.

