Rivaba Jadeja: టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) భార్య, ప్రస్తుతం గుజరాత్ రాష్ట్ర మంత్రిగా ఉన్న రివాబా జడేజా (Rivaba Jadeja) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ కార్యక్రమంలో తన భర్త జడేజా క్రమశిక్షణను హైలెట్ చేస్తూ మాట్లాడిన ఆమె, టీమిండియాలోని మిగతా క్రికెటర్లు (Team India Cricketers) అందరూ వ్యసనపరులు, చెడు అలవాట్లు ఉన్నవారని ఆమె నిందించారు. గుజరాత్‌లోని ద్వారకాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.
విదేశాలకు వెళ్లినా నా భర్త బుద్ధిమంతుడే
తన భర్త, టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా క్రికెట్ ఆడేందుకు లండన్, దుబాయ్, ఆస్ట్రేలియా వంటి అనేక దేశాలకు వెళ్లాల్సి ఉంటుందని, అలా విదేశాలకు వెళ్లినప్పుడు కూడా జడేజా క్రమశిక్షణతో ఉంటారని రివాబా చెప్పారు. ఇలాంటి ఎన్నో ప్రయాణాలు చేసినప్పటికీ నేటి వరకు జడేజాకు ఎలాంటి వ్యసనం, చెడు అలవాటు లేదని, కనీసం అలాంటి చర్యల్లో పాల్గొనలేదని అన్నారు. ఎందుకంటే, తన భర్తకు అతడి బాధ్యతలు తెలుసునని ఆకాశానికి ఎత్తారు. తన దాదాపు 12 ఏళ్లుగా ఇంటికి దూరంగా ఉంటున్నాడని, ఆయన చేయాలనుకుంటే తనకు ఇష్టం వచ్చింది చేయవచ్చు, కానీ తన నైతిక కర్తవ్యం ఏమిటో ఆయనకు తెలుసునని రివాబా పేర్కొన్నారు. ఏం చేయాలో, చెయ్యకూడదో అతడికి తెలుసు కాబట్టి చేయబోడని చెప్పారు. అయితే, భారత్ జట్టులోని మిగతా సభ్యులందరూ చెడు అలవాట్లలో మునిగిపోతుంటారని, వారికి ఎలాంటి ఆంక్షలు ఉండవని రివాబా అన్నారు.
మిగతా క్రికెటర్లు చెడు అలవాట్లు!
గుజరాత్ మంత్రిగా ఉన్న రివాబా చేసిన ఈ వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. ప్రొఫెషనల్ క్రికెటర్లు ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తుంటారు. జడేజా మినహా మిగతా జట్టు సభ్యులందరూ చెడు అలవాట్లలో మునిగిపోతుంటారని రివాబా అనడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు జడేజా సహచర టీమిండియా క్రికెటర్లతో పాటు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్లేయర్లు, సిబ్బందిని తప్పుపట్టినట్లుగా అనిపిస్తోందని పలువురు విమర్శిస్తున్నారు.
కెరీర్ చివరి దశలో జడేజా
భారత స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ప్రస్తుతం వన్డే, టెస్ట్ ఫార్మాట్లలో మాత్రమే ఆడుతున్నారు. గతేడాది టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీ20 ఫార్మాట్ నుంచి తప్పుకున్నాడు. వన్డే, టెస్ట్ ఫార్మాట్‌లో కూడా జడేజా కెరీర్ చివరి దశలో ఉన్నాడని చెప్పుకోవచ్చు. వయసే ఇందుకు కారణంగా ఉంది. ఇప్పటికే జడేజాకు 38వ సంవత్సరం నడుస్తోంది. కాబట్టి, ఎక్కువకాలం క్రికెట్‌లో కొనసాగే అవకాశాలు లేవని క్రికెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు, ఐపీఎల్‌లో కూడా రవీంద్ర జడేజా కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టబోతున్నాడు. సుదీర్ఘకాలం చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడిన అతడిని రాజస్థాన్ రాయల్స్ జట్టు తీసుకుంది. ఆటగాళ్ల ప్రత్యేక ట్రేడింగ్ విధానంలో అతడిని దక్కించుకుంది. చెన్నై సూపర్ కింగ్స్‌లో ఉన్నంతకాలం జడేజా చాలా కీలకమైన ఆటగాడిగా ఉన్నాడు. సీఎస్కే టైటిల్స్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. వచ్చే సంవత్సరం జరగనున్న ఐపీఎల్ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జెర్సీలో ఏవిధంగా రాణిస్తాడో చూడాలి.
Read Also- KTR: రైతు ప్రయోజనాలే పునాదిగా నూతన బిల్లు ఉండాలి.. కేంద్ర ప్రభుత్వానికి కేటీఆర్ సూచనలు!

