KTR: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న విత్తన బిల్లు డ్రాఫ్ట్‌ను భారత రాష్ట్ర సమితి తీవ్రంగా వ్యతిరేకించింది. కేంద్రం ప్రతిపాదిస్తున్న ఈ విత్తన బిల్లు వలన రైతన్నలకు తీవ్రమైన నష్టం జరుగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గురువారం ఈ మేరకు మీడియా ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న బిల్లును పూర్తిగా ఆపివేసి, రైతన్నలతో, రైతు సంఘాలతో, నిపుణులతో, రాజకీయ పార్టీలతో చర్చ చేసిన అనంతరం ఈ అంశంపై ముందుకు పోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఈ బిల్లులో నకిలీ విత్తనాలను కట్టడి చేసే అంశంపై స్పష్టత లేదని, వాటి వల్ల నష్టపోయిన రైతన్నలకు నిర్దిష్ట సమయంలోనే పరిహారం అందించే అంశంపై గ్యారంటీ లేదని అన్నారు. దీంతో పాటు కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా విత్తనాల ధరలను నిర్ణయించే విధంగా ఈ బిల్లులో నిబంధనలు ఉన్నాయని, గతంలా ధరల నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేకుండా పోతుందని అన్నారు.
విత్తన సార్వభౌమత్వం ప్రమాదం
నకిలీ విత్తనాల తయారీలో కంపెనీలను బాధ్యులను చేయకుండా, కేవలం అమ్మకందారులను బాధ్యత వహించేలా, కేవలం సప్లై చైన్‌పై బాధ్యతను ఉంచేలా ఈ చట్టం రూపొందించబడిందని పేర్కొన్నారు. మరోవైపు, నకిలీ విత్తనాలకు సంబంధించిన అంశంలో జాతీయ స్థాయిలో ఆయా కంపెనీలను బ్లాక్‌లిస్ట్ చేయడం, భారీ పెనాల్టీలు, కఠిన జైలు శిక్ష వంటి అంశాలకు ఇందులో పెద్దగా ఆస్కారం లేదని కేటీఆర్ అన్నారు. దీంతో పాటు సాంప్రదాయంగా రైతన్నలే విత్తనాలను తయారు చేసుకొని పండించుకునే వ్యవసాయ సాంప్రదాయాలు ఇప్పటికీ అనేక చోట్ల ఉన్నాయని, అయితే ఇలాంటి రైతన్నల సమూహానికి ఈ బిల్లులో ఏమాత్రం రక్షణ లేకుండా పోయిందని అన్నారు. వీటితో పాటు విదేశాల నుంచి నేరుగా ఆయా కంపెనీలు ఎలాంటి విత్తన ట్రయల్స్ లేకుండానే దేశంలో తమ విత్తనాలను అమ్ముకునే విధంగా సులభమైన నిబంధనలు ఉన్నాయని, వీటి వలన దేశీయ విత్తన భద్రత, విత్తన సార్వభౌమత్వం ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read: KTR: లేబర్ కోడ్‌లపై ఢిల్లీలో వ్యతిరేకత తెలంగాణలో అమలు ఎందుకు? కేటీఆర్
వ్యవసాయ రంగంలో కీలకం
ఈ అంశానికి సంబంధించి రాష్ట్రాలకు, రాష్ట్రంలోని వ్యవసాయ యూనివర్సిటీలకు ఎలాంటి ప్రాధాన్యత లేకుండా చేశారని అన్నారు. దీంతో పాటు ఈ మొత్తం బిల్లు రాష్ట్రాల పరిధిలోని వ్యవసాయ రంగంలో కీలకమైన విత్తనాల అంశంపై కేంద్ర ఆధిపత్యానికి దారి తీస్తుందని, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రాలు సొంత చట్టాలు చేసుకుని ముందుకు పోయే అంశాన్ని బలహీనం చేస్తుందని కేటీఆర్ అన్నారు. అందుకే రైతే కేంద్రంగా ఉండే విత్తన బిల్లును రూపకల్పన చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉన్నదని, ఈ అంశంలో ఈజ్ ఆఫ్ బిజినెస్ పేరుతో కార్పొరేట్ కంపెనీలకు ఆధిపత్యం అప్పగించే ప్రయత్నాలను పక్కన పెట్టాలని సూచిచారు.
బయోసేఫ్టీ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి
దీంతోపాటు విత్తన సార్వభౌమత్వం, దేశీయ బయోసేఫ్టీ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, రాష్ట్రాల అంశంపై కేంద్రానికి ఆధిపత్యం ఇవ్వకుండా రూపకల్పన చేయాలని ఈ బిల్లుకు సవరణలు ప్రతిపాదించారని, దీంతో పాటు నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన రైతన్నలకు ఎకరానికి పండే పంటలో గరిష్ఠ ఉత్పత్తి మేరకు నష్టపరిహారం నిర్దిష్ట సమయంలో అందేలా కఠిన నిబంధనలు ఇందులో ఉంచాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం కంపెనీల ప్రయోజనాల కోసం కాకుండా రైతన్నల ప్రయోజనాలకు, వ్యవసాయ సంక్షేమ అభివృద్ధికి ఉపయోగపడేలా అత్యంత పారదర్శకంగా, కఠినమైన నిబంధనలతో కూడిన విత్తన బిల్లును తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు. త్వరలోనే ఈ అంశంపై మాజీ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డితో పాటు ఎంపీ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో పార్టీ తరఫున ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి కేంద్రానికి మరిన్ని సూచనలు ఇస్తామని కేటీఆర్ తెలియజేశారు.
Also Read: KTR: ఆటో డ్రైవర్లకు అండగా కేటీఆర్.. కాంగ్రెస్ సర్కార్‌కు అల్టీమేటం జారీ

